యుద్ధకాండ.. ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం | Iranian drones hit the US Embassy in Saudi Arabia | Sakshi
Sakshi News home page

యుద్ధకాండ.. ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం

Mar 4 2026 4:10 AM | Updated on Mar 4 2026 7:54 AM

Iranian drones hit the US Embassy in Saudi Arabia

మంటల్లో చిక్కుకున్న రియాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం

సౌదీలోని యూఎస్‌ దౌత్య కార్యాలయంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు

యూఏఈలో చమురు కేంద్రంపై కూడా 

లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భూతల పోరు 

అవసరమైతే ఇరాన్‌లో కూడా: ట్రంప్‌ 

టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం 

అధ్యక్ష, భద్రతా మండలి భవనాలు ధ్వంసం 

ఐఆర్‌జీసీ కమాండ్‌ సెంటర్‌ కూడా: యూఎస్‌

దుబాయ్‌: పశ్చిమాసియాలో పోరు తారస్థాయికి చేరుతోంది. సుప్రీం నేత ఖమేనీ హత్యతో రెచ్చిపోయిన ఇరాన్‌ ప్రతీకార దాడుల తీవ్రతను నానాటికీ పెంచుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై మరింతగా విరుచుకుపడుతోంది. మంగళవారం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై డ్రోన్‌ దాడులకు దిగింది. దాంతో భారీగా మంటలంటుకుని కార్యాలయ భవనం దెబ్బ తిన్నట్టు సమాచారం. యూఏఈలో ఫుజైరాలోని చమురు కేంద్రంపైనా ఇరాన్‌ డ్రోన్‌ దాడికి దిగింది.

ఖతర్‌లో అల్‌ ఉదెయిద్‌లోని అమెరికా వైమానిక స్థావరాన్ని రెండు క్షిపణులు తాకాయి. ఈ నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఖతర్, జోర్డాన్, యూఏఈల్లోని తమ దౌత్య కార్యాలయాల నుంచి సిబ్బందిని అమెరికా ఉపసంహరిస్తోంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అమెరికన్లు తక్షణం ఆయా దేశాలను వీడాలని సూచించింది.

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు రెండో రోజూ కొనసాగాయి. దాంతో ఇజ్రాయెల్‌ సైనిక దళాలు మంగళవారం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి భూతల దాడులకు దిగడంతో పోరు కీలక మలుపు తిరిగింది. 80కి పైగా సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని లెబనాన్‌ సూచించింది. ఇప్పటిదాకా 55 మందికి పైగా మరణించినట్టు లెబనాన్‌ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా ప్రకటించింది.

రాత్రంతా దాడులే 
ఇరాన్‌ ఎయిర్, నేవీ డిఫెన్స్‌ వ్యవస్థలను ఇప్పటికే తుత్తునియలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ‘‘పరిస్థితి చాలా దూరం వెళ్లింది. ఈ దశలో చర్చలకు ఆస్కారమే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అవసరమైతే ఇరాన్‌లో భూతల పోరుకు కూడా వెనకాడబోమని సంకేతాలిచ్చారు! దాడులను మున్ముందు మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సోమవారం రాత్రంతా ఇజ్రాయెల్‌ నిరంతరాయంగా దాడులు కొనసాగించింది. దాంతో బాంబులు, క్షిపణి దాడులతో టెహ్రాన్‌ దద్దరిల్లిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా భారీగా వెలువడుతున్న మంటలు, ఎగసిపడుతున్న పొగ కనిపిస్తున్నాయి.

ఇరాన్‌ అధ్యక్ష భవన ప్రాంగణంతో పాటు దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యాలయం తదితరాలపై పెద్దపెట్టున దాడులు జరిగాయి. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలోని చారిత్రక గోలెస్తాన్‌ ప్యాలెస్‌ కూడా దాడుల్లో బాగా దెబ్బతింది. రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండ్‌ సెంటర్‌ను కూడా భస్మీపటలం చేసినట్టు అమెరికా ప్రకటించింది. కెర్మన్‌ ప్రావిన్సులో సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 13 మంది సైనికులు మరణించినట్టు ఇరాన్‌ పేర్కొంది. ఇరాన్‌లో మృతులు 787కు చేరినట్టు స్థానిక రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రకటించింది. కువైట్‌పై ఆదివారం నాటి ఇరాన్‌ దాడుల్లో గాయపడ్డ మరో ఇద్దరు అమెరికా సైనికులు మంగళవారం మరణించారు. దాంతో ఇప్పటిదాకా మరణించిన అమెరికా సైనికుల సంఖ్య ఆరుకు పెరిగింది.

సుప్రీం నేత ఎన్నికకు జరిగిన భేటీపై దాడి
చాలామంది చనిపోయారు: ఇజ్రాయెల్‌ 
జెరూసలేం: ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేందుకు ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ సమావేశమైన భవనంపై ఇజ్రాయెల్, అమెరికా మంగళవారం రాత్రి భారీ స్థాయిలో బాంబు దాడులు జరిపాయి. ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్‌ స్థానిక మీడియా సంస్థలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. కమిటీలోని 88 మంది సభ్యుల్లో చాలామంది దాడిలో చనిపోయినట్టు ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ జెరూసలేం పోస్ట్‌ చెప్పుకొచ్చింది. ఇరాన్‌ మాత్రం ఆ వార్తలను ధ్రువీకరించలేదు. దాడి సమయంలో భవనంలో ఎవరూ లేరని కూడా వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల భయంతో టెహ్రాన్‌లో కాకుండా దక్షిణాది నగరమైన కోమ్‌లో ఈ భేటీ జరిగినట్టు చెబుతున్నారు. దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్న భవనం తాలూకు వీడియో ఫుటేజీ స్థానిక మీడియాలో దర్శనమిచ్చింది.  

హార్మూజ్‌ మూసివేత 
నిలిచిన చమురు రవాణా 
ప్రపంచ చమురు రవాణా లో 20 శాతం దాకా జరిగే కీలక హార్మూజ్‌ జలసంధిని మూ సేస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. నిషేధాన్ని ఉల్లంఘించి ఆ మార్గం గుండా వెళ్లేందు కు ప్రయతి్నంచే నౌకలకు నిప్పు పెట్టి ముంచేస్తామని రివల్యూషనరీ గార్డ్స్‌ సలహా దారు బ్రిగేడియన్‌ జనరల్‌ ఇబ్రహీం జబ్బా రీ హెచ్చరించారు. దాంతో హా ర్మూజ్‌ గుండా చమురు రవా ణా పూర్తిగా నిలిచిపోయింది. 220 పై చిలుకు చమురు నౌకలు అక్కడికి సమీపంలోనే ఆగిపోయాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు ధరలకు మరింతగా రెక్క లు రావడం ఖాయ మని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నతాంజ్‌పై దాడులు నిజమే: ఐఏఈఏ 
ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై దాడులు నిజమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. వాటిలో అణు కేంద్రానికి స్వల్ప నష్టం వాటిల్లినట్టు ధ్రువీకరించింది. అయితే అక్కడ అణు ధార్మికతలో అసాధారణ పెరుగుదల వంటిదేమీ నమోదు కాలేదని తెలిపింది.  

సైప్రస్‌కు బ్రిటన్‌ యుద్ధ నౌక
లండన్‌: పశ్చిమాసియాలో తాజా పరిణామాల నేపథ్యంలో సైప్రస్‌కు ఒక యుద్ధ నౌకతో పాటు పలు సైనిక హెలికాప్టర్లను తరలిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రకటించింది. ఎయిర్‌ డిఫెన్స్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌక హెచ్‌ఎంఎస్‌ డ్రాగన్‌ ఇప్పటికే సైప్రస్‌కేసి కదిలిందని ప్రధాని కియర్‌ స్టార్మర్‌ తెలిపారు. సైప్రస్‌లోని బ్రిటన్‌ సైనిక స్థావరంపై ఇరాన్‌ తాజాగా డ్రోన్‌ దాడికి దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement