ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో మరణించిన 160 మందికి పైగా విద్యార్థినుల సామూహిక ఖననం నిమిత్తం సమాధులు తవ్వుతున్న దృశ్యం
అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది మంది ఇరానియన్లు
అమెరికా నాశనం కావాలంటూ నినాదాలు
టెహ్రాన్: అమెరికా వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 165 మంది విద్యార్థినుల సామూహిక ఖనన క్రతువు వేలాది మంది స్థానికుల సమక్షంలో కొనసాగింది. మినాబ్ నగరంలోని బాలికల ప్రాథమిక పాఠశాలపై శనివారం అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినుల సంఖ్య తాజాగా 165కి పెరిగిన విషయం తెల్సిందే. మరో 60 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్లందరినీ ఒకే చోట సామూహికంగా పూడ్చిపెట్టారు. ఇందుకోసం 165 చిన్న గోతులు తీసిన వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వైరల్‌గా మారాయి.
మినాబ్ సిటీలో జరిగిన విద్యార్థినుల అంతిమయాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ‘అమెరికా నాశనం కావాలి’అని నినాదాలు చేశారు. విద్యార్థినుల పారి్ధవదేహాలను ఉంచిన వాహనాలు వీధుల గుండా వెళ్తుండగా వేలాదిగా జనం హాజరై రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
పేగు తెంచుకుని పుట్టిన తమ చిన్నారులను కడసారి చూసుకుంటూ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. తర్వాత అశ్రునయనాలతో తమ చిన్నారులకు వీడ్కోలు పలికారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ శోకసంద్రాలయ్యాయి. పార్థివదేహాలను వాహనాల్లో అంతిమయాత్రగా తీసుకొస్తుండగా వాళ్లను చివరిసారిగా చూసేందుకు జనం ఎగబడ్డారు. ప్రాణాలు కోల్పోయిన అతీనా అనే విద్యార్థిని తల్లి ఆవేదనలతో మాట్లాడారు. ‘‘అమెరికా చేసే ఘోర నేరాలకు నా బిడ్డ మృతదేహమే ప్రబల సాక్ష్యం’’అని కన్నీరుమున్నీరయ్యారు.


