ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! | West Asia Tensions Oil Markets China Backed Aramco Cuts Refinery Operations | Sakshi
Sakshi News home page

ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!

Mar 4 2026 2:22 PM | Updated on Mar 4 2026 2:27 PM

West Asia Tensions Oil Markets China Backed Aramco Cuts Refinery Operations

పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ​్‌కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.

హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్‌ సరఫరాకు బ్రేక్

ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్‌ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలు

సౌదీ ఆరామ్‌కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.

రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్‌) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.

ఇదీ చదవండి: ఏజీఆర్‌ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!

Advertisement
 
Advertisement
Advertisement