పశ్చిమాసియా యుద్ధంలోకి పాకిస్థాన్‌! | Pakistan Signals Possible Entry Into West Asia Conflict Over Saudi Arabia Defense Pact, Know More Details Inside | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా యుద్ధంలోకి పాకిస్థాన్‌!

Mar 4 2026 5:10 PM | Updated on Mar 4 2026 5:41 PM

 Pakistan signals it may be drawn into Iran war. Here's why

ఇస్లామాబాద్‌: పశ్చిమాసియా యుద్ధంలోకి తాము కూడా దిగే పరిస్థితి రావచ్చని పాకిస్థాన్ సంకేతాలు ఇచ్చింది. సౌదీ అరేబియాతో తమకు ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కారణంగా చూపింది. ఈ ఒప్పందం నాటోను పోలి ఉంటుంది. ప్రతీకార దాడుల్లో ఇరాన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. 

సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించవద్దని ఇరాన్‌ను హెచ్చరించినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. సౌదీ అరేబియాతో తమకు రక్షణ ఒప్పందాన్ని ఉన్నట్టు ఇరాన్‌కు అర్థమయ్యేలా చేశానని దార్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత మొదలైన ఇరాన్ యుద్ధానికి కూడా ఈ రక్షణ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టంగా తెలిపారు.

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఇతర దేశాలనూ తాకిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది.

మంగళవారం రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సీఐఏ ప్రధాన కార్యాలయం (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రధాన కేంద్రం)పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఒక రోజు ముందు సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన రాస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగింది. దాంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి.  

ఇరాన్‌తో పాక్‌ చర్చలు
పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య ఉన్న రక్షణ ఒప్పందం రియాద్‌పై ప్రభావం చూపిందని, భారీ దాడులు జరగకుండా చేసిందని దార్ చెప్పారు. ఇతర దేశాల కంటే సౌదీ అరేబియాపై దాడులు తక్కువగా జరిగాయని ఆయన తెలిపారు. దీనికి ప్రతిగా సౌదీ భూభాగాన్ని ఇరాన్‌పై దాడులకు వినియోగించరాదని హామీ ఇవ్వాలని టెహ్రాన్‌ కోరిందని దార్ తెలిపారు.  

గత సంవత్సరం సెప్టెంబర్‌లో సౌదీ-పాక్‌ మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. బుధవారం సౌదీ అరేబియా స్పందిస్తూ.. ఇరాన్ చేసిన దాడులపై ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన అర్ధరాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

పాకిస్థాన్‌కు ప్రమాదకరం 
ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ విమానాలను మోహరించడం పాకిస్థాన్‌కు ప్రమాదకరం. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే 4 కోట్ల షియా జనాభా పాకిస్థాన్‌లో ఉంది. గత వారం అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత పాక్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ హింసలో దాదాపు 35 మంది మరణించారు.

అంతేగాక, అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌లతో సరిహద్దు ఘర్షణలో పాకిస్థాన్ నిమగ్నమై ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్‌తో పెట్టుకుంటే పాకిస్థాన్ సమస్యలు మరింత పెరుగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement