నేడు ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్
గెలిస్తే వరుసగా రెండోసారి తుది పోరుకు
ఆత్మవిశ్వాసంతో టీమిండియా
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
3-2 టి20 వరల్డ్ కప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది.
గత టి20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి.
ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్‌లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం.
ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్‌కు చేరింది. టి20 వరల్డ్ కప్‌ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి.
మార్పుల్లేకుండా...
పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు.
ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్‌పై గత మ్యాచ్‌లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం.
హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్‌లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్‌తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కత్తి మీద సామే. ఇంగ్లండ్‌పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి.

బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్
కీలకం విల్ జాక్స్...
ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్‌పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్‌లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు.
ఏ మ్యాచ్‌లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్‌లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది.
బెతెల్, బాంటన్‌లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్‌రౌండర్‌గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్‌తో పాటు రెండో పేసర్‌గా ఒవర్టన్‌పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది.
పిచ్, వాతావరణం
వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది.
17-12
భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్.
ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్.


