సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి షాక్‌ | Satwik and Chirag pair lose at All England Badminton Championship first round | Sakshi
Sakshi News home page

సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి షాక్‌

Mar 5 2026 1:28 AM | Updated on Mar 5 2026 1:28 AM

Satwik and Chirag pair lose at All England Badminton Championship first round

తొలిసారి తొలి రౌండ్‌లో ఓటమి  

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లోరెండో రోజు భారత షట్లర్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన నాలుగో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 33వ స్థానంలో ఉన్న కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌–ఆరోన్‌ తాయ్‌ (మలేసియా) జంట 23–21, 21–12తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ జోడీని బోల్తా కొట్టించింది. 

42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో గట్టిపోటీనిచి్చనా... రెండో గేమ్‌లో  తేలిపోయింది. ఏడోసారి ఈ టోర్నీలో పోటీపడ్డ సాత్విక్‌–చిరాగ్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. 2022లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత జంట 2018, 2021, 2023, 2024, 2025లలో ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 

మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంట 42 నిమిషాల్లో 12–21, 15–21తో ఐదో సీడ్‌ థోమ్‌ గికెల్‌–డెల్‌పైన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ ఆయుశ్‌ శెట్టి (భారత్‌) 75 నిమిషాల్లో 21–19, 9–21, 17–21తో ప్రపంచ 14వ ర్యాంకర్‌ అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement