టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము చెందాల్సిన అవసరం లేదన్నాడు.
టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.
కల నిజమైన తరుణం ఇది
ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
పర్‌ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినా
పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్‌లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.
ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్‌లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్‌ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో
ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్‌లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్‌ఫెక్ట్‌గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా


