T20 WC: వార్‌ వన్‌సైడ్‌ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే! | T20 WC 1st Semi Final SA vs NZ: Jansen Fiery Fisty South Africa Score is | Sakshi
Sakshi News home page

SA vs NZ: వార్‌ వన్‌సైడ్‌ అనుకుంటే.. కివీస్‌ను దెబ్బ కొట్టిన యాన్సెన్‌

Mar 4 2026 8:43 PM | Updated on Mar 4 2026 9:42 PM

T20 WC 1st Semi Final SA vs NZ: Jansen Fiery Fisty South Africa Score is

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్‌ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ ముగించగలిగింది.

టీ20 ప్రపంచకప్‌-2026 తొలి సెమీస్‌ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్‌ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్‌ జట్టు వికెట్లు కోల్పోయింది. 

టాపార్డర్‌ కుదేలు
ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (18), క్వింటన్‌ డికాక్‌ (10), ర్యాన్‌ రికెల్టన్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34) కాసేపు నిలబడగా... డేవిడ్‌ మిల్లర్‌ (6) పూర్తిగా నిరాశపరిచాడు. 

ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29)తో కలిసి మార్కో యాన్సెన్‌ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు.

 27 బంతుల్లో అర్ధ శతకం
ఇక ఈ మ్యాచ్‌లో యాన్సెన్‌ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్‌ సెంచరీ. లాకీ ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్‌. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మిగిలిన వారిలో కార్బిన్‌ బాష్‌ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్‌ అయ్యాడు. కేశవ్‌ మహరాజ్‌ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. 

హెన్రీ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో
కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కోల్‌ మెకాంచీ, రచిన్‌ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్‌, జేమ్స్‌ నీషమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్‌ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement