పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌ను పేలవంగా ముగించింది. సూపర్-8లో తప్పక భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో నామమాత్రపు గెలుపుతో సరిపెట్టుకుంది. ఫలితంగా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గుర్రుగా ఉన్న పీసీబీ
ఐసీసీ ఈవెంట్లో పాక్ సెమీ ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సైతం సల్మాన్ ఆఘా (Salman Agha) బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లకు జరిమానా రూపంలో శిక్ష విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
సెలక్టర్ పదవికి రాజీనామా
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత పాక్ బోర్డులో తొలి వికెట్ పడింది. అలీం దర్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు, హెడ్‌కోచ్ మైక్ హసన్ తీరుకు నిరసనగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్‌గా పేరుప్రఖ్యాతులు పొందిన అలీం దర్ అక్టోబరు 11, 2024లో పాక్ జట్టు సెలక్టర్‌గా నియమితుడయ్యాడు.
ఆకిబ్ జావేద్, అజర్ అలీ, అనలిస్టు హసన్ చీమాతో కలిసి సెలక్టర్ పదవి చేపట్టాడు. అయితే, టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో మైక్ హసన్ అతి జోక్యం వల్ల అలీం దర్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.
బాబర్ ఆజం వద్దు అన్నందుకేనా?
బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి సీనియర్లను ఎంపిక చేయవద్దని దర్ భావించగా.. ఆకిబ్ జావేద్ మద్దతుతో హసన్ ఈ ముగ్గురిని జట్టులో చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మహ్మద్ రిజ్వాన్‌ను ఆరో స్థానానికి ఎంపిక చేస్తే బాగుంటుందనే అలీం దర్ అభిప్రాయాన్ని కూడా వీరు కొట్టివేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఆకిబ్ జావేద్ కోచ్ హసన్‌కే మద్దతు పలుకుతూ.. ఇతర సభ్యుల నిర్ణయాలను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయిన అలీం దర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అందుకు అనుగుణంగా మంగళవారమే అతడు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. కాగా అలీం దర్ వద్దన్నా.. హసన్, జావేద్ పట్టుబట్టి జట్టులో చేర్చిన బాబర్ ఆజం, షాదాబ్, ఉస్మాన్ ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.
చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!


