టీ20 ప్రపంచకప్ 2026 తది దశకు చేరింది. ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్.. రేపు (మార్చి 5) రెండో సెమీఫైనల్ జరుగనున్నాయి. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుండగా.. భారత్-ఇంగ్లండ్ రెండో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ మరి కొద్గి గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, బలాబలాల ప్రకారం ఇరు జట్లు సమానంగా ఉన్నాయన్నది కాదనలేని సత్యం.
ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికాతో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త తడబడినా, ఆ జట్టు శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంతటి ప్రతికూల పరిస్థితులను అయినా ఆ జట్టు తమకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలను చాలా చూశాం.
ఈ జట్టును ఎప్పుడూ ఫామ్‌ను బట్టి అంచనా వేయలేని పరిస్థితి. ఒక్కసారి లైన్‌లోకి వచ్చారంటే వారిని ఆపడం చాలా కష్టం. క్షణాల్లో ఫలితం తారుమారవుతుంది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత ఎడిషన్‌లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా దూసుకుపోతుంది. పైగా గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన జోష్‌లో ఉంది. ఫామ్‌ను పరిగణిలోకి తీసుకుంటే ఈ జట్టే టైటిల్ ఫేవరెట్లలో ముందుంది.
అయితే ఈ జట్టుకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడటం సౌతాఫ్రికాకు పరిపాటి. గతంలో వారు ఇలాంటి అనుభవాలు కోకొల్లలుగా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి వారి కసి చూస్తే టైటిల్ గెలవకుండా తమను ఎవరూ ఆపలేరన్నట్లుగా ఉంది.
జట్టులోకి ప్రతి ఒక్కరు మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఒక్క నాకౌట్ ఫోబియా తప్పించి సౌతాఫ్రికాను ఏదీ కలవరపెట్టట్లేదు.
హెడ్ టు హెడ్ రికార్డులు కూడా ఈ జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 19 టీ20ల్లో తలపడగా.. సౌతాఫ్రికా 12, న్యూజిలాండ్ ఏడింట మాత్రమే గెలుపొందాయి. ప్రపంచకప్ సమరాల విషయానికొస్తే.. సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. మెగా టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు ఎదురెదురుపడగా.. ఐదింట సౌతాఫ్రికానే జయకేతనం ఎగురవేసింది.
ఇన్ని సానుకూల పరిణామాల మధ్య సౌతాఫ్రికా నేటి మ్యాచ్‌లో మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
న్యూజిలాండ్ సెమీస్‌ను అధిగమించిన సందర్భాలు.. 2021 (ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి)
సౌతాఫ్రికా సెమీస్‌ను అధిగమించిన సందర్భాలు.. 2024 (ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి)


