మాడ్రిడ్: గతేడాది తొలిసారి వన్డే ప్రపంచకప్ కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో పురస్కారం ముంగిట నిలుచుంది. ప్రతిష్టాత్మక ‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఉంది. అంతర్జాతీయ క్రీడల్లో సాధించిన ఘన విజయాలు, ఘనతలకు ప్రతి యేట ‘లారెస్’ స్పోర్ట్స్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సారి భారత అమ్మాయిల జట్టు ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యింది.
ఒక భారత జట్టు అంతర్జాతీయ పురస్కారాల రేసులో నిలవడం ఇదే మొదటిసారి! భారత క్రికెట్ జట్టుతో పాటు ఈ టీమ్ కేటగిరీలో ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టు, యూరోపియన్ రైడర్ కప్ స్క్వాడ్, ఫ్రెంచ్ ఫుట్‌బాల్ లీగ్ చాంప్ పారిస్ సెయింట్–జెర్మయిన్, మెక్‌లారెన్ ఫార్ములావన్ టీమ్‌లు పోటీలో ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘లారెస్’ అవార్డుకు నామినేట్ అయిన తొలి క్రికెట్ జట్టు భారత్ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సెమీస్‌లో జగజ్జేత ఆ్రస్టేలియా మహిళల జట్టుపై 339 పరుగుల భారీస్కోరును ఛేదించి ఫైనల్ చేరడం, అక్కడ దక్షిణాఫ్రికాను కంగుతినిపించి ప్రపంచకప్ సాధించిన ప్రదర్శనతో ‘లారెస్’ నిర్వాహకులు హర్మన్ సేనను నామినేట్ చేశారు. ఏప్రిల్ 20న స్పెయిన్ రాజధాని నగరం మాడ్రిడ్‌లో అవార్డుల వేడుక జరుగుతుంది. గతంలో భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (2019), జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (2022), క్రికెటర్ రిషభ్ పంత్ (2025) నామినేట్ అయ్యారు.


