మెరిసిన దక్షిణాఫ్రికా  | South Africa beat New Zealand in the Womens ODI Cricket World Cup 2025 | Sakshi
Sakshi News home page

మెరిసిన దక్షిణాఫ్రికా 

Oct 7 2025 5:02 AM | Updated on Oct 7 2025 5:02 AM

South Africa beat New Zealand in the Womens ODI Cricket World Cup 2025

6 వికెట్లతో న్యూజిలాండ్‌పై ఘన విజయం

బ్రిట్స్‌ సెంచరీ, రాణించిన లూస్‌

ఎంలాబాకు నాలుగు వికెట్లు

గురువారం భారత్‌తో దక్షిణాఫ్రికా పోరు

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో అనూహ్యంగా 69 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలపాలైన సఫారీ టీమ్‌ వెంటనే కోలుకుంది. టోర్నీ ఫేవరెట్‌లలో ఒకటైన న్యూజిలాండ్‌ జట్టును ఓడించి టోరీ్నలో గెలుపు బోణీ చేసింది. బౌలింగ్‌లో ఎంలాబా ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో తజీ్మన్‌ బ్రిట్స్‌ సెంచరీ, సూన్‌ లూస్‌ కీలక ఇన్నింగ్స్‌ కలిపి జట్టుకు విజయాన్ని అందించాయి.   

ఇండోర్‌: మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా కీలక విజయాన్ని అందుకుంది. బలమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్‌... సఫారీ సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. సోమవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. అనంతరం దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు సాధించి గెలిచింది. 

ఈ టోరీ్నలో న్యూజిలాండ్‌కిది వరుసగా రెండో ఓటమి. దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం విశాఖపట్నంలో భారత్‌తో తలపడుతుంది. అంతర్జాతీయ కెరీర్‌లో 350వ మ్యాచ్‌ ఆడిన కివీస్‌ ఓపెనర్‌ సుజీ బేట్స్‌ ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మైలురాయి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే (0) వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత మూడు భాగస్వామ్యాలతో కివీస్‌ జట్టు కోలుకుంది. 

జార్జియా ప్లిమ్మర్‌ (68 బంతుల్లో 31; 4 ఫోర్లు), అమేలియా కెర్‌ (42 బంతుల్లో 23; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (98 బంతుల్లో 85; 9 ఫోర్లు) ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించింది. డివైన్‌ మూడో వికెట్‌కు అమేలియాతో 57 పరుగులు, నాలుగో వికెట్‌కు బ్రూక్‌ హాలిడే (37 బంతుల్లో 45; 6 ఫోర్లు)తో 86 పరుగులు జత చేసింది. అయితే తర్వాతి బ్యాటర్లంతా విఫలం కావడంతో కివీస్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. 

44 పరుగుల తేడాతో కివీస్‌ జట్టు చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నాన్‌కులులెకో ఎంలాబా (4/40) ప్రత్యరి్థని దెబ్బ తీసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా కెపె్టన్‌ లారా వోల్‌వార్ట్‌ (14) ఆరంభంలోనే అవుటైంది. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తజీ్మన్‌ బ్రిట్స్‌ (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు వేసింది. బ్రిట్స్, సూన్‌ లూస్‌ (114 బంతుల్లో 83 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 170 బంతుల్లో 159 పరుగులు జోడించి జట్టును గెలుపునకు చేరువగా తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రిట్స్‌తో పాటు మరిజాన్‌ కాప్‌ (14), అనెక్‌ బాష్‌ (0) తక్కువ వ్యవధిలో అవుటైనా... లూస్‌ అజేయంగా నిలిచి విజయం పూర్తి చేసింది.    

350: న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్‌కు ఇది 350వ అంతర్జాతీయ మ్యాచ్‌. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో బేట్స్‌ అగ్ర స్థానంలో ఉండగా... ఆ తర్వాత వరుసగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (342), ఎలైస్‌ పెరీ (341), మిథాలీ రాజ్‌ (333), చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (309) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో కివీస్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని ఈ జాబితాలో డానీ వ్యాట్‌ (300)తో సమంగా ఆరో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement