నిరీక్షణ ముగిసేనా?  | Lakshya Sen to face world No 1 Shi Yu Qi in first round In All England 2026 | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ముగిసేనా? 

Mar 3 2026 3:34 AM | Updated on Mar 3 2026 3:34 AM

Lakshya Sen to face world No 1 Shi Yu Qi in first round In All England 2026

నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీపై ఆశలు  

బర్మింగ్‌హామ్‌: శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌కు నేడు తెర లేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలోని ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి... డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా... డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌; ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో బరిలో ఉన్నారు. అయితే స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది.

 పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ ఎయిర్‌ స్పేస్, ఎయిర్‌పోర్టు మూసివేయడంతో సింధు అక్కడే చిక్కుకుపోయింది. దుబాయ్‌ విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సింధు తన తొలి రౌండ్‌ మ్యాచ్‌ను బుధవారం థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ సుపనిద కటెథోంగ్‌తో ఆడాల్సి ఉంది. సింధు మినహా భారత ఇతర ప్లేయర్లు సింగపూర్, ఆఫ్రికా దేశాల  మీదుగా బర్మింగ్‌హామ్‌కు చేరుకున్నారు.  

క్లిష్టమైన ‘డ్రా’ 
127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్‌ (2001లో) మాత్రమే టైటిల్స్‌ సాధించారు. 2022లో లక్ష్య సేన్‌ ఫైనల్‌ చేరినా తుదకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్‌ కూడా రన్నరప్‌గానే నిలిచింది. ఈ ఏడాదైనా భారత ప్లేయర్లు టైటిల్‌ నిరీక్షణకు తెరదించుతారో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టిలకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది.

 తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షి యుకి (చైనా)తో లక్ష్య సేన్, అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా)తో ఆయుశ్‌ శెట్టి ఆడతారు. 2022, 2023లలో సెమీఫైనల్‌ చేరిన గాయత్రి–ట్రెసా ద్వయం తొలి రౌండ్‌లో సయాకా హిరోటా–అయాకో సకురామోటో (జపాన్‌) జోడీతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌–ఆరోన్‌ టాయ్‌ (మలేసియా)లతో సాతి్వక్‌–చిరాగ్‌ పోటీపడతారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా)తో మాళవిక; ఆరో సీడ్‌ 
చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ఉన్నతి ఆడతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement