భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ ఫో లినే హోజ్‌మార్క్ జేర్‌ఫీల్డ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
500వ విజయం
ఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా తన కెరీర్‌లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్‌గా ఆరో బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచింది.
ఇక ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ అయిన సింధు.. వరల్డ్ నంబర్ 4, చైనాకు చెందిన చెన్ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్‌ను సింధు ఓడించింది.
లక్ష్య సేన్ సైతం
మరోవైపు.. లక్ష్య సేన్ సైతం ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్ షట్లర్ జేసన్ గునావన్‌పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్ ముందుడుగు వేశాడు.


