T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..! | T20 WC 2026 Final: Abhishek reveals he batted with Shivam Dube bat | Sakshi
Sakshi News home page

T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..!

Mar 9 2026 7:17 PM | Updated on Mar 9 2026 7:23 PM

T20 WC 2026 Final: Abhishek reveals he batted with Shivam Dube bat

నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.

ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్‌ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ న్యూజిలాండ్‌ బౌలర్లను ఊచకోత కోశారు.

వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్‌ అనంతరం అభిషేక్‌ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అతను సహచరుడు శివమ్‌ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడినట్లు పేర్కొన్నాడు.

అభిషేక్‌ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్‌తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు.  

ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్‌ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి భారత్‌ భారీ స్కోర్‌ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ దశనే మార్చేసింది. 

ఇలాంటి కీలక ఇన్నింగ్స్‌ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడటం విశేషం. అభిషేక్‌కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్‌లో సిరాజ్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్‌గా ఫైనల్‌లో అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించి, భారత్‌ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement