నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్ పటేల్ (3-0-27-3), హార్దికా పాండ్యా (4-0-26-1), వరుణ్ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
కివీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ సీఫర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సూపర్-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించాయి.
ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్ రజా ఎంపికయ్యాడు. భారత్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్ పాండ్యా) కావడం విశేషం.
ఐసీసీ టీమ్ ఆఫ్ టీ20 వరల్డ్‌కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మైర్, సికందర్ రజా (c), శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా
12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా


