ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్ | Ishan Kishan played T20 World Cup final despite huge personal tragedy | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్

Mar 9 2026 2:51 PM | Updated on Mar 9 2026 5:20 PM

Ishan Kishan played T20 World Cup final despite huge personal tragedy

టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్‌ది కీల‌క పాత్ర‌. అభిషేక్ శ‌ర్మ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

కేవ‌లం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 54 ప‌రుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు.

ఏమి జరిగిందంటే?
ఫైన‌ల్‌కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిష‌న్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిష‌న్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భ‌ర్త రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్‌క‌తాలో ఓ  వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. వారిద్ద‌రి మ‌ర‌ణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.

ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విష‌యంపై కిష‌న్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జ‌రిగిపోయింది. మేము చాలా బాధ‌లో ఉన్నాము అని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌ అహ్మ‌దాబాద్‌లో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌కు హాజ‌రావ్వాల్సి ఉండేది. కానీ త‌మ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కార‌ణంగా ప్ర‌ణ‌వ్ కోల్‌క‌తాలో ఉండిపోయారు. 

మ్యాచ్ అనంత‌రం కిష‌న్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాల‌ని కోరుకునేది. ఇప్పుడు న‌న్ను ఛాంపియ‌న్‌గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధ‌గా ఉంద‌ని కిష‌న్ భావోద్వేగానికి లోన‌య్యాడు. కాగా దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.
చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే

Advertisement
 
Advertisement
Advertisement