సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌ | Gautam Gambhir Shuns Down Any Comparisons Between Sanju Samson And Yuvraj Singh | Sakshi
Sakshi News home page

సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌

Mar 9 2026 4:23 PM | Updated on Mar 9 2026 4:29 PM

Gautam Gambhir Shuns Down Any Comparisons Between Sanju Samson And Yuvraj Singh

టీమిండియా దాదాపు 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వన్డే ప్రపంచకప్‌-2023లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. టీ20 వరల్డ్‌కప్‌-2026లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే ఊహించని పరాభవం చవిచూసిందో.. ఇప్పుడు అదే వేదికలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని.. మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో మూడు సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ఏకైక జ‌ట్టుగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. అయితే చారిత్రత్మక విజయంలో స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర.

టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేని సంజూ.. ఆ త‌ర్వాత అనుహ్యంగా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వ‌రుస‌గా మూడు కీల‌క మ్యాచ్‌ల‌లోనూ హాఫ్ సెంచ‌రీలు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు.

అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లోనూ 97 పరుగులతో సత్తాచాటాడు. దీంతో సంజూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్‌తో పోలుస్తున్నారు. యువరాజ్ కూడా అప్పుడు తన అద్బుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే యువీతో సంజూ పోలుస్తున్నారు.

అయితే ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "యువరాజ్ సింగ్‌తో సంజూను పోల్చడం సరికాదు. కానీ సంజూ ఏమి చేశాడో మనందరికి తెలుసు. నిజంగా అతడు అద్భుతాలు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కు పైగా పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు.

ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమై, టోర్నీ ప్రారంభంలో బెంచ్‌కే పరిమితమై,  ఆ తర్వాత ఈ తరహా ఇన్నింగ్స్‌లు ఆడడం నిజంగా గ్రేట్‌. ఇది అతడిలోని ధైర్యానికి నిదర్శనం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. సంజూ ఒక స్పెషల్ ప్లేయర్" అని గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
చదవండి: T20 WC 2026: ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement