ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు | Alyssa Healy Carried On Shoulders Emotional Farewell Video | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

Mar 9 2026 1:19 PM | Updated on Mar 9 2026 1:26 PM

Alyssa Healy Carried On Shoulders Emotional Farewell Video

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. టీమిండియాతో జరిగిన ఏకైక టెస్టు తర్వాత హీలీ ఆట నుంచి తప్పుకొంది. మ్యాచ్‌ ముగిశాక సహచరులు అలీసాను తమ భుజాలపై ఎత్తుకొని మైదానం చుట్టూ తిరిగారు. 

కాగా 35 ఏళ్ల అలీసా 11 టెస్టుల్లో 502 పరుగులు... 126 వన్డేల్లో 3777 పరుగులు... 162 టి20ల్లో 3054 పరుగులు సాధించింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి అలీసా 173 క్యాచ్‌లు తీసుకొని, 103 స్టంపింగ్‌లు చేసింది.

మిచెల్‌ స్టార్క్‌ సతీమణి
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీలీ.. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సతీమణి కూడా!.. భర్త మైదానంలో బ్యాటర్లను హడలెత్తిస్తుంటే.. భార్యేమో బౌలర్ల పాలిట విలన్‌ అయిన సందర్భాలు కోకొల్లలు. ఇక హీలీ చివరి మ్యాచ్‌ చూసేందుకు స్టార్క్‌ మైదానానికి వచ్చి ఆమెను చీర్‌ చేశాడు.

ఇదిలా ఉంటే.. ఆరుసార్లు ఐసీసీ మహిళల టీ20 ప్రంపచకప్‌ ముద్దాడిన ఏకైక ప్లేయర్‌గా హీలీ రికార్డు సాధించింది. అంతేకాదు... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఘనత ఆమె సొంతం. అదే విధంగా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు కూడా హీలీ పేరిటే ఉండగా.... అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపర్‌గానూ గుర్తింపు దక్కించుకుంది.

రికార్డుల మోత
అంతేకాదు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌గానూ.. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గానూ హీలీ అరుదైన ఘనత సాధించింది. ఇక ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే హీలీ రికార్డుల జాబితా పెద్దగానే ఉంది.    

మూడో రోజే
ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించిన భారత మహిళల జట్టు ఓవరాల్‌ చాంపియన్‌ఫిప్‌ను ఘోరంగా ముగించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌ను 2–1తో వశం చేసుకున్న హర్మన్‌ప్రీత్‌ బృందం... మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయ్యింది. 

ఏకైక డే అండ్‌ నైట్‌ టెస్టులో పూర్తిగా చేతులెత్తేసింది. 4 రోజుల పింక్‌బాల్‌ టెస్టును కనీసం రెండున్నర రోజులైనా ఆడలేక మూడో రోజే ప్రత్యర్థి ముందు మోకరిల్లింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 105/6తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 48.2 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. క్రితం రోజు బ్యాటర్‌ ప్రతీక రావల్‌ (137 బంతుల్లో 63; 8 ఫోర్లు) చేసిన అర్ధసెంచరీ భారత్‌ను ఇన్నింగ్స్‌ పరాజయం నుంచి తప్పించింది కానీ పరాభవం నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయింది. ప్రతీక, స్నేహ్‌ రాణా (54 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.

ఏకైక టెస్టు విజయంతో
ఈ కాస్త పోరాటం చేస్తున్న వీరిద్దరిని యాష్లే గార్డ్‌నర్‌ (2/8) అవుట్‌ చేయగా, అలానా కింగ్‌ (2/23) టెయిలెండర్ల పనిపట్టింది. కేవలం 25 పరుగుల నామమాత్రమైన లక్ష్యాన్ని ఆతిథ్య జట్టుకు నిర్దేశించగా, ఓపెనర్లు జార్జియా వోల్‌ (16 నాటౌట్‌; 4 ఫోర్లు), ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (11 నాటౌట్‌; 1 ఫోర్‌) 4.3 ఓవర్లలోనే అజేయంగా ముగించారు. 

శతకం సహా రెండు ఇన్నింగ్స్‌ల్లో (4/46, 2/15) ఆరు వికెట్లు తీసిన అనాబెల్‌ సదర్లాండ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

టీ20లు, వన్డేలు, ఒక టెస్టు కలిపి సాగిన ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను 12–4 పాయింట్ల తేడాతో ఆసీస్‌ జట్టు చేజిక్కించుకుంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ విజయానికి 2 పాయింట్లు, టెస్టు గెలుపునకు 4 పాయింట్లు కేటాయించారు. రెండు టీ20లు నెగ్గిన భారత్‌ ఖాతాలో 4 పాయింట్లే ఉండగా, ఒక టి20, మూడు వన్డేలు, ఏకైక టెస్టు విజయంతో ఆసీస్‌ డజను పాయింట్లను సాధించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement