సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే | T20 WC 2026: Shivam Dube, Axar Patel powered Indias T20 World Cup win | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే

Mar 9 2026 1:19 PM | Updated on Mar 9 2026 3:56 PM

T20 WC 2026: Shivam Dube, Axar Patel powered Indias T20 World Cup win

సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ త్రయం గురించే మాట్లాడుకుంటున్నారు. టీ20 వరల్డ్‌కప్-2026 వీరివల్లే భారత్ గెలిచిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవును నిజమే. కానీ వీరితో పాటు మ‌రో ఇద్ద‌రు సైలెంట్ హీరోలు కూడా ఉన్నారు. 

భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో వారిద్ద‌రూ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో వికెట్లు తీయడం, బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం వారి స్పెషాలిటీ. ఒకరెమో తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగా.. మరొకరు తన స్పిన్ మయాజాలంతో కివీస్ అగ్రశ్రేణి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. వారే ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్‌.

సిక్సర్ల దూబే
ఈ టోర్నీ అసాంతం దూబే అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్ వంటి వారు ఆరంభంలో దూకుడుగా ఆడితే, దూబే చివరిలో బ్యాటింగ్‌కు వచ్చి తనపని తాను చేసుకోపోయేవాడు. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం విఫలమైనా.. దూబే మాత్రం రాణించాడు. 

కీలకమైన సెమీఫైనల్‌, ఫైనల్‌లోనూ తన మార్క్‌ను చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ముంబై ఆటగాడు తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా దూబే బ్యాట్ ఝూలిపించాడు. 

భారత్‌ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా నీషమ్ వేసిన చివరి ఓవర్‌లో అతడు ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 255 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. దూబే మొత్తంగా 9 మ్యాచ్‌ల‌లో 235 ప‌రుగులు చేశాడు. దూబే ఆడిన చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఈ రోజు భార‌త్‌ను విశ్వ‌విజేత‌గా నిలిపింది.

అక్ష‌ర్ అదుర్స్‌
భార‌త్ ఫైన‌ల్‌కు చేరి క‌ప్ కొట్ట‌డంలో అక్ష‌ర్‌ది కీల‌క పాత్ర‌. వాంఖ‌డే వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీస్‌లో ప‌టేల్ బంతితో రాణించ‌క‌పోయిన‌ప్ప‌టికి ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్ష‌ర్ సంచ‌ల‌న క్యాచ్‌ల‌తో హ్యారీ బ్రూక్‌, విల్ జాక్స్ వంటి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్లను పెవిలియ‌న్‌కు పంపాడు.

ఒక‌వేళ అక్ష‌ర్ ఆ క్యాచ్‌ల‌ను అందుకోపోయింటే క‌థ మ‌రోలా ఉండేది. అప్ప‌టికే ఇంగ్లండ్ భార‌త్‌ను ఓడించే అంత ప‌నిచేసింది. ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అక్ష‌ర్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫిన్ అలెన్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్ వంటి డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ల‌ను ఔట్ చేసి భార‌త్‌కు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్‌లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement