T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది? | Ravi Shastri BRAINFADE Moment After Failing to Spot Tilak Varma Catch | Sakshi
Sakshi News home page

T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?

Mar 9 2026 12:24 PM | Updated on Mar 9 2026 12:54 PM

Ravi Shastri BRAINFADE Moment After Failing to Spot Tilak Varma Catch

క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ కామెంటేటర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రికి పేరుంది. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఛలోక్తులు, చణుకులు విసరడంలో అతడు దిట్ట. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, అద్భుతమైన క్షణాలను తన వ్యాఖ్యానంతో మరింత గుర్తుండిపోయేలా చేసిన ఘనత అతడిది.

ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్లో.. నాటి భారత కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌.. ధోని సిక్స్‌ బాది విజయాన్ని ఖరారు చేయగానే.. ‘‘ఎంఎస్ ధోని తనదైన శైలిలో ముగింపు ఇచ్చాడు( "MS Dhoni finishes off in style" )’’ అన్న రవిశాస్త్రి మాటలు ఇప్పటికీ.. క్రికెట్‌ అభిమానుల చెవుల్లో మారుమ్రోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

అంతటి రవిశాస్త్రి కామెంట్రీలోనూ
అయితే, అంతటి రవిశాస్త్రి కామెంట్రీలో కూడా కొన్నిసార్లు తప్పులు దొర్లడం సహజం. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ సందర్భంగా అతడు చేసిన పొరపాటు నెట్టింట ట్రోలింగ్‌కు కారణమైంది. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

టాపార్డర్‌ దుమ్ములేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు సాధించింది. తద్వారా పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను.. భారత్‌ 159 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

తిలక్‌ వర్మ క్యాచ్‌ పట్టడంతో
కివీస్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లోనే.. అక్షర్‌ పటేల్‌ తొలి వికెట్‌ తీసి శుభారంభం అందించగా.. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో జేకబ్‌ డఫీ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్‌ వర్మ పట్టడంతో న్యూజిలాండ్‌ కథ ముగిసింది. అయితే, తిలక్‌ క్యాచ్‌ అందుకున్న సమయంలో రవిశాస్త్రి.. న్యూజిలాండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది అని కామెంట్రీలో చెప్పాడు.

అద్భుతమైన ప్రదర్శన
ఆ వెంటనే తప్పును గ్రహించి.. ‘‘నిజానికి అంతా అయిపోయింది.. టీమిండియా మూడోసారి ప్రపంచకప్‌ గెలిచింది. వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన’’ అని రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియాకు టైటిల్‌ కోల్పోయిన వేదికపైనే.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచి సత్తా చాటిందని కొనియాడాడు. రవిశాస్త్రి కామెంట్రీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: సంజూ, ఇషాన్‌ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్‌ మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement