ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత స్టార్
97 నిమిషాల సుదీర్ఘ సెమీఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయం
నేడు చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ చున్ యి టైటిల్ పోరు
బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 18–21, 21–15తో కెనడాకు చెందిన విక్టర్ లాయ్‌పై తుదికంటా పోరాడి గెలిచాడు. తాజా ప్రపంచ చాంపియన్íÙప్ (పారిస్–2025) కాంస్య పతక విజేత అయిన విక్టర్‌ను ఓడించేందుకు లక్ష్యసేన్ ఏకంగా 97 నిమిషాల పాటు శ్రమించాడు.
కాలి పాదాలు మంటపెడుతున్నా... కోర్టులో తన కదలికలతో నొప్పి మరింత పెరిగినా అన్నీ భరించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. నేడు జరిగే టైటిల్ పోరులో చైనీస్ తైపీ షట్లర్ లిన్ చున్ యితో లక్ష్యసేన్ తలపడతాడు. కాలి పాదం గాయాన్ని పంటిబిగువన భరించి సెమీస్‌లో చెమటోడ్చిన భారత షట్లర్ 25 ఏళ్ల తర్వాత చరిత్రలో నిలిచేందుకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచాడు.
సుప్రసిద్ధ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఖాతాలో రెండే టైటిల్స్ ఉన్నాయి. ప్రకాశ్ పదుకొనె (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే గెలిచారు. కానీ 24 ఏళ్ల లక్ష్యసేన్ పుట్టాక మరో టైటిల్ రానేలేదు. తనే నాలుగేళ్ల క్రితం 2022లో గెలిచే ప్రయత్నం చేసినా... ఫైనల్ తడబాటు వల్ల చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ లక్ష్యసేన్ ఎంతో మారాడు. అనుభవం సంపాదించాడు. నైపుణ్యం పెంచుకున్నాడు. ఇక చరిత్రకెక్కడమే తరువాయి!


