భోపాల్‌లో నిర్వహించిన అస్మిత్ కెనోయ్ స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. ఆగస్టు 8, 9 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో పలు బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించారు.
1000 మీటర్ల విభాగంలో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. సింగిల్‌లో ఎన్. బిందు వెండి పతకం సాధించగా.. డబుల్‌లో పి. జస్విక, కె. అనూష జోడీ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
ఫోర్ విభాగంలో కె. బిందు, పి. జస్విక, ఆర్. రేఖ, కె. అనూష బృందం స్వర్ణ పతకం సాధించింది. కయాక్ సింగిల్‌లో ఎం. చందన్ కాంస్య పతకం దక్కించుకోగా.. కయాక్ ఫోర్‌లో ఎం. చందన్, శ్రావంతి, అవంతిక, సింధు బృందం వెండి పతకం సాధించింది.
500 మీటర్లలోనూ మెరుపులు
500 మీటర్ల విభాగంలోనూ తెలంగాణ క్రీడాకారులు విజయ పరంపరను కొనసాగించారు. సింగిల్‌లో కె. అనూష రజత పతకం సాధించింది. డబుల్‌లో ఎం. బిందు, పి. జస్విక జోడీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరిచిన ఈ ప్రదర్శన రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. క్రీడాకారుల కఠోర శ్రమ, పట్టుదలతో పాటు జట్టు సమష్టి కృషికి ఈ విజయాలు నిదర్శనంగా నిలిచాయి.
విజేతలకు అభినందనలు
పతక విజేతలతో పాటు కోచ్ రామకృష్ణ నిషి, సహాయక సిబ్బందిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అభినందించింది. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ ఇదే జోరును కొనసాగించి తెలంగాణకు మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించింది.


