నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ఆదివాసీల హక్కులు, అడవులు, జీవన విధానం గురించి మాట్లాడుతుంటాం. కానీ అత్యంత విలువైన వారి వారసత్వమైన మాతృభాష గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాం. ఒక భాష కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జానపద విజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం, జీవన తత్వాన్ని మోసుకెళ్లే సజీవ సంపద. అందుకే ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో పాటు ఒక ప్రపంచ దృష్టికోణం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో నివసించే కోయల మాతృభాష అయిన ‘కోయతూర్’ నేడు సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ కోయతూర్‌లో మాట్లాడుతున్నప్పటికీ, కొత్త తరం విద్య, ఉపాధి, పట్టణీకరణ ప్రభావంతో తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషల వైపు మొగ్గు చూపుతోంది. ఇంట్లోనే మాతృభాష వినిపించని పరిస్థితి ఏర్పడితే, ఆ భాషకు భవిష్యత్తు మరింత సంక్లిష్టమవుతుంది. ఇది కేవలం కోయ భాష సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అనేక ఆదివాసీ భాషలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో భారతదేశానికి చెందిన అనేక భాషలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కుపియా, గదబ, కొలామి, నాయకి, తోటి భాషా రూపాలు, అలాగే అండమాన్ దీవులలోని గ్రేట్ అండమానీస్, ఓంజీ వంటివారి భాషలు కూడా మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతోంది.
ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పట్టణాలకు వలసలు, మాతృభాషలో విద్య లేకపోవడం, ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ఆధిపత్య భాషలను ఎంచు కోవడం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. భాషను కోల్పోవడం అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; ప్రతి తరం కొద్దికొద్దిగా దూరమవుతూ చివ రకు ఆ భాష మాట్లాడేవారు లేకుండా పోతారు. ‘‘మాకు వీలై నంతలో భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్ప పూవుతో చాక్లెట్లు, లడ్డూలు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు ‘పుంగార’ అనే పేరు పెట్టాము. పుంగార్ అంటే మా కోయ భాషలో పువ్వు అని అర్థం’’ అని చెప్పారు భద్రాచలంకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ సమ్మక్క.
ఆదివాసీ పిల్లలకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంత అవసరమో, అంతే అవసరం వారిలో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వాటిని నేర్చుకునే క్రమంలో వారి భాషను మరచిపోవడం మాత్రం ఒక సాంస్కృతిక నష్టంగా మిగిలిపోతుంది.
ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వారి భాషలో పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం, జానపద గేయాలు, కథలు, సామెతలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలి.
2020లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దివ్య దేవరాజన్ అక్కడి గోండుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఒక ట్యూటర్‌ని నియమించుకొని గోండు భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ గూడేల్లో వారి అరుగుల మీద కూర్చొని వారి భాషలోనే ఆమె మాట్లాడుతున్నప్పుడు వారంతా వారి కష్టాలన్నీ ధైర్యంగా చెప్పుకునేవారు. దివ్య లాంటి అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. భాషను కాపాడటం అంటే ఒక భాషను మాత్రమే కాదు, ఒక జాతి చరిత్రను, ప్రకృతితో ముడిపడిన జీవన తత్వాన్ని, వేల ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే. భాష బతికితేనే జాతి బతుకుతుంది.
– శ్యాం మోహన్, ఆదివాసీ జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్ (నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)


