సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది.
హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన
సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయతి్నస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో...
ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్‌మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు.
అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్‌కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్‌లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యారి్థని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వా«దీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి.


