మహిళలు అంతగారానీ రంగంలోకి రావడమే కాదు..తనేంటో నిరూపించుకుంది. అత్యున్నత ధర్మాసనానికి తొలి మహిళా న్యాయమూర్తిగా నిలిచి..ఎందరో మహిళలు ఈ రంగంలోకి వచ్చేలా స్ఫూర్తిగా నిలిచింది. అంతేగాదు న్యాయమూర్తులు ఎవ్వరు పెదవి విప్పని స్వలింగ సంపర్కుల సంబంధాల అంశంపై మాట్లాడి యావత్తు ప్రపంచానికి కనువిప్పు కలిగించారు. తన చివరి శ్వాస వరకు న్యాయ విలువల కోసం పోరాడిన గొప్ప మహిళ ఆమె.
ఆ ధీర వనితే జస్టిస్ లీలా సేథ్. ఆమె కేవలం చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి కాదు. చట్టం ప్రజలను రక్షించాలి కానీ వారి జీవితాలను కష్టతరం చేయకూడదని నమ్మిన స్త్రీమూర్తి. ఆత్యాచార చట్టాలను బలోపేతం చేయడంలో సహాయపడిన మహిళ, అలాగే తన స్వలింగ సంపర్కుడైన కొడుకు కోసం గళం విప్పి ఎందర్నో ఆలోచింపచేశారామె. నిజమైన న్యాయం కేవలం కోర్టు గదులకు పరిమితం కాదని గుర్తు చేశారామె. న్యాయవాద వృత్తికి కావాల్సిన మార్గదర్శకాలను అందిచిన మహిళా న్యాయమూర్తి ఆమె. నిజానికి ఆమె న్యాయావాది కావాలని ఎన్నడు అనుకోలేదు. కానీ ఆమె ఎలా ఈ రంగంలోకి వచ్చిందంటే..
లీలా సేథ్ అక్టోబర్ 20, 1930లో లక్నో జన్మించారు. ఆమె చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయారు. ఆమె జీవితం ఎప్పుడు సాఫీగా సాగలేదు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ తన స్వతంత్ర జీవితాన్ని నిర్మించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న ధీర మహిళ ఆమె. ఆమె న్యాయవాద వృత్తిలోకి అత్యంత యాదృచ్ఛికంగా వచ్చింది. తన భర్తతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు, పిల్లలను పెంచుకుంటూ, రెగ్యులర్ తరగతులకు హాజరు కాకుండా పూర్తి చేయగల కొన్ని కోర్సుల కోసం అన్వేషించింది.
ఆ క్రమంలో న్యాయశాస్త్రం చదవాలని నిశ్చయించుకుంది. ఒక ఆచరణాత్మక నిర్ణయంగా ప్రారంభమైనది త్వరలోనే ఒక అద్భుతమైన వృత్తిగా మారింది. తాను ఎలా గౌరవనీయమైన న్యాయమూర్తులలో ఒకరిగా ఎదిగేందుకు ఎలా అడ్డంకులను చేధించిందో తెలిసేలా తన లైఫ్ జర్నీ గురించి 'ఆన్ బ్యాలెన్స్: ఏన్ ఆటోబయోగ్రఫీ' అనే పుస్తకంలో వివరించింది. 1958లో, ఆమె లండన్ బార్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన మొదటి మహిళ ఆమె.
ఇది ఆకాలంలో అతిపెద్ద ఘనత. ఆమె న్యాయవాద వృత్తిని ప్రారంభించినప్పుడు, ఒక సీనియర్ న్యాయవాది ఆమె ఆశయాలను కొట్టిపారేస్తూ, "వెళ్లి పెళ్లి చేసుకో" అన్నారు. దానికి లైలా ప్రశాంతంగా, "నాకు అప్పటికే పెళ్లయింది" అని బదులిచ్చారు. అక్కడి పక్షపాత బుద్ధి ఆమెను ఆపలేదు కదా..లింగ భేదం కన్నా..ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని తన పనితో నిరూపించింది.
లైలా సేథ్ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, న్యాయస్థానాలలో పురుషుల ఆధిపత్యం అధికంగా ఉండేది. అక్కడ మహిళా న్యాయవాదులు అరుదుగా ఉండేవారు. ఒకవేళ ఉన్నా కూడా ఆ మహిళా న్యాయవాదులు కేవలం మహిళల కేసులను మాత్రమే వాదించాలని ఆదేశించేవారు. లీలాసేథ్ ఆ పరిమితులను అంగీకరించడానికి నిరాకరించారు. ఆమె క్లిష్టమైన రాజ్యాంగ, పన్ను, క్రిమినల్ చట్టపరమైన విషయాలపై వాదించి, తనోంటే నిరూపించుకున్నారు.
అలా ఆమె 1978లో ఢిల్లీ హైకోర్టుకు మహిళా న్యాయమూర్తి అయ్యారు. పదమూడేళ్ల తర్వాత 1991లో, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆమె భారతదేశపు తొలి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. ఇది దేశవ్యాప్తంగా తరతరాల మహిళా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు స్ఫూర్తినిచ్చే మైలురాయి.
సమానత్వాన్ని చట్టంలోకి తీసుకొచ్చారు..
సమానత్వం కేవలం మాటల్లోనే కాకుండా చట్టంలో కూడా ఉండాలని జస్టిస్ లైలా సేథ్ విశ్వసించారు. కుమారులతో సమానంగా కుమార్తెలు కూడా వారసత్వ హక్కులను అనుభవించాలని వాదిస్తూ, హిందూ వారసత్వ చట్టానికి మార్పులను సిఫార్సు చేసిన కమిటీకి ఆమె అధ్యక్షత వహించారు.
ఆమె సిఫార్సులు 2005 సవరణలో కీలక పాత్ర పోషించాయి, ఇది చివరకు పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులను కల్పించింది. భారతదేశ వ్యాప్తంగా లెక్కలేనంత మంది మహిళలకు, ఇది కేవలం ఒక చట్టపరమైన సంస్కరణకు మించినది. దీని అర్థం ఆర్థిక భద్రత, స్వాతంత్ర్యం, తమ కుటుంబాలలో సమాన సభ్యులుగా గుర్తింపు.
అత్యాచార చట్టాలను బలోపేతం చేసింది..
2012లో జరిగిన దారుణమైన ఢిల్లీ సామూహిక అత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. పైగా మహిళల భద్రత కోసం మరింత కఠినమైన చట్టాలను డిమాండ్ చేస్తూ విస్తృతమైన నిరసనలకు దారితీసింది. చట్టపరమైన సంస్కరణలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లీలా సేథ్ దాని ముగ్గురు సభ్యులలో ఒకరు.
ఈ కమిటీ వేగంగా పనిచేసి, లైంగిక హింసకు సంబంధించిన భారతదేశ క్రిమినల్ చట్టాలలో గణనీయమైన మార్పులకు దారితీసిన సిఫార్సులను రూపొందించింది. ఈ సంస్కరణలలో చాలా వరకు మహిళలకు చట్టపరమైన రక్షణలను బలోపేతం చేశాయి. అలాగే తీవ్రమైన నేరాలకు శిక్షలను పెంచాయి.
నా కుమారుడు నేరస్థుడు కాదు..
ఆమె కుమారుడు, ప్రఖ్యాత రచయిత విక్రమ్ సేథ్, స్వలింగ సంపర్కుడు. 2013లో ఒక కోర్టు తీర్పు తర్వాత సెక్షన్ 377 మరోసారి స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించినప్పుడు ఆమె దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. లక్షలాది మందిని కదిలించేలా మాట్లాడారామె. అసలు ఆ సెక్షన్ 377 ఎందుకు అన్యాయమో వివరిస్తూ.. ఆమె శక్తిమంతంగా తన గళం వినిపిస్తూ రాశారు.
కేవలం తాము ఎలా ఉన్నారో అలా ఉన్నందుకే ఎవరినీ శిక్షించకూడదని వాదించారు. ఎందరో ప్రముఖులు మౌనం వహించిన సమయంలో, ఆమె స్వరం లెక్కలేనంత మంది స్వలింగ సంపర్కుల్లో ఆశాభావాన్ని రేకెత్తించింది. అలా లీలా సేథ్ చివరి క్షణం వరకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందిలే సహాయ సహకారాలు అందించారు. ఆమె 2017లో 86 ఏళ్ల వయసులో మరణించారు. ఆఖరికి తన శరీరాన్ని కూడా వైద్య పరిశోధన కోసం దానం చేశారామె.
(చదవండి: 97 ఏళ్ల వయసులో ఆకాశంలోకి దూసుకెళ్లి..గిన్నిస్ రికార్డు!)


