లీగలాటా
భార్య నుంచి విడాకులు కావాలని భర్త, ఆ భర్త ద్వారా తనకు రెండో సంతానం కావాలని భార్య– ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. ఎవరి హక్కుల గురించి వారు వాదించారు. ఎలాగైనా ఒప్పించాలని భార్య; బంధమే వద్దనుకుంటే బిడ్డను కనడానికి ఎందుకు సహకరిస్తానని భర్త– చివరికి ఫ్యామిలీ కోర్టుకు ఈ వివాదం చేరింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భర్త హైకోర్టులో అప్పీలుకు వెళ్లాడు. బిడ్డను కనే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రెండూ అవసరమే కానీ, అంతిమంగా ఏది ముఖ్యమో బాంబే హైకోర్టు తేల్చింది. కుటుంబ వివాదానికి ఓ పరిష్కారం చూపింది.
భార్య తనతో క్రూరంగా ప్రవర్తిస్తోందని, అసభ్య పదజాలంతో దూషిస్తోందని, మానసికంగా హింసిస్తోందని తమ బంధాన్ని కొనసాగించలేనని విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భర్తపై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసు కొనసాగుతుండగానే, నాందేడ్ ఫ్యామిలీ కోర్టులో భార్య మరో పిటిషన్ వేసింది. ఇది సంచలనంగా మారింది.
భార్య ఏం కోరింది?
తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరింది. తమకు ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. కానీ, ‘నాకు మరో బిడ్డ కావాలి. నా వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. పిల్లలు కనడానికి తగిన వయసు. ఈ కేసు పూర్తవ్వడానికి కనీసం మరో 15 ఏళ్లు పట్టొచ్చు. అప్పుడు నాకు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పైగా పిల్లాడికి తోబుట్టువులు లేకపోతే మానసికంగానూ ఇబ్బంది పడతాడు. ఒంటరిగా మిగిలిపోతాడు. నాకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. అందువల్ల నా భర్తతో శారీరకంగా లేదా ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చేలా ఆదేశించాలి’ అని కోర్టును అభ్యర్థించింది. రెండో బిడ్డ పెంపకానికి ఎలాంటి ఆర్థిక సాయం కోరనని, భర్తపై పెట్టిన కేసునూ ఉపసంహరించుకుంటానని కోర్టుకు తెలిపింది.
ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇలా
బిడ్డల విషయంలో భార్యాభర్తలిద్దరికీ హక్కులు ఉంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ కేసులో రెండో బిడ్డ కోసం భార్యకు సహకరించాలని, ఐవీఎఫ్ ద్వారా బిడ్డ కావాలనుకుంటే అందుకు అవసరమైన తోడ్పాటును అందించాలని ఆదేశించింది. భార్యతో కలిసి ఐవీఎఫ్ కౌన్సెలింగ్‌కు వెళ్లాలని పేర్కొంది.
హైకోర్టులో అప్పీలు
ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఈ తీర్పు తన వ్యక్తిగత హక్కుకు, స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని వాదించాడు. అతను లేదా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రెండో సంతానం కోసం బలవంతం చేసే అధికారం న్యాయస్థానానికి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మహిళకు తల్లి అయ్యే హక్కు ఉన్నట్టే, తన సమ్మతి లేకుండా తండ్రి కాకూడదనే స్వేచ్ఛ భర్తకు ఉంటుందని పేర్కొంది. ఒకవేళ బిడ్డ ఈ విధంగా పుడితే, పెరిగి పెద్దయ్యాక తన జననానికి దారి తీసిన పరిస్థితులు తెలిస్తే అతని మానసిక ఎదుగుదలపైనా ప్రభావం ఉంటుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఫ్యామిలీ కోర్టు భర్త సమ్మతి గురించి చెబుతూనే రెండో బిడ్డకోసం సహకరించాలని చెప్పడం పరస్పర విరుద్ధంగా పేర్కొంది. ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లాలన్న ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వును రద్దు చేసింది. భార్య దాఖలు చేసిన ఎగ్జిబిట్–35ను తిరస్కరించింది. భవిష్యత్తులో వారి మధ్య సఖ్యత ఏర్పడి మళ్లీ కలిసి జీవిస్తే అప్పుడు రెండో బిడ్డ గురించి ఆలోచించడం వారి వ్యక్తిగత విషయం అని పేర్కొంది. కానీ కోర్టు ప్రస్తుతం బలవంతంగా రెండో బిడ్డ కోసం సహకరించాలనే ఆదేశాలను ఇవ్వజాలదని తేల్చి చెప్పింది. బిడ్డకు జన్మనిచ్చే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, పుట్టబోయే బిడ్డ సంక్షేమం మధ్య సమతుల్యం ఎలా ఉండాలో ఈ తీర్పు స్పష్టంగా వివరించింది.
- దిలీప్ మాదిరెడ్డి


