సోల్‌ మిస్టరీ.. | Crucial And Investigation Funday Special Story Written By Sri Sudhamayi | Sakshi
Sakshi News home page

సోల్‌ మిస్టరీ..

Jul 19 2026 9:51 AM | Updated on Jul 19 2026 9:51 AM

Crucial And Investigation Funday Special Story Written By Sri Sudhamayi

క్లూషియల్‌

చెన్నైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ముత్తుస్వామి హైదరాబాద్‌ వచ్చాడు. కోట్ల విలువైన వజ్రాలు అతని వద్ద ఉన్నాయి. ఆధునిక స్టార్‌ హోటల్స్‌లో దిగితే నిఘా ఉంటుందని, ఎవరికీ అనుమానం రాకూడదని అతను హైదరాబాద్‌ లోని ఒక పాతకాలం నాటి లాడ్జిలో రూమ్‌ తీసుకున్నాడు.

పెద్ద శబ్దంతో తిరిగే పాతకాలం నాటి ఫ్యాన్‌... ప్లాస్టిక్‌ మగ్‌...
రాత్రి పదకొండు నలభై ...
ముత్తుస్వామి రూమ్‌ తలుపులు వేసుకుని, పడుకునే ముందు తన సూట్‌కేస్‌ తెరిచాడు. అందులోని చేతి సంచీని తీసి, కాసేపు ఆ వజ్రాల మెరుపులను చూసుకుని, మళ్లీ వాటిని జాగ్రత్తగా సంచీలో పెట్టి, పడుకున్నాడు. అయితే, అతను వజ్రాలు చూసుకుంటున్నప్పుడు కిటికీ సందులో నుంచి రెండు కళ్లు తనను నిశితంగా గమనిస్తున్నాయనే విషయాన్ని ముత్తుస్వామి గమనించలేకపోయాడు.
తెల్లవారింది. ముత్తుస్వామి రూమ్‌ తలుపు కాస్త నెట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూసిన రూమ్‌ బాయ్‌ గట్టిగా కేక పెట్టాడు. ముత్తుస్వామి మంచంపై రక్తపు మడుగులో శవమై పడి ఉన్నాడు. సూట్‌కేస్‌ తెరిచి ఉంది, వజ్రాల సంచీ మాయమైంది.
∙∙ 
క్రైమ్‌ సీన్‌..
సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. హత్యా స్థలాన్ని పరిశీలిస్తుండగా, మంచం కింద ఒక  వస్తువు దొరికింది. అది మహిళలు ధరించే ఒక సరికొత్త ‘హైహీల్‌’ చెప్పు. ఒకే ఒక్క చెప్పు అక్కడ పడి ఉంది.
‘సార్, దీన్ని బట్టి చూస్తే రాత్రి ఎవరైనా లేడీ లోపలికి వచ్చి, ముత్తుస్వామిని చంపి వజ్రాలు ఎత్తుకెళ్లినట్టు ఉంది’ అన్నాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.
ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న తల అడ్డంగా ఊపి అన్నాడు. ‘ముత్తుస్వామి గొంతును ఒక్క చేత్తో బలంగా నొక్కి, మరో చేత్తో గుండెల్లో పొడిచారు. ఆ పట్టు చూస్తే అది కచ్చితంగా ఒక బలమైన పురుషుడి పనే.’ కేవలం పోలీసుల దారి మళ్లించడానికే ఆ హైహీల్‌ చెప్పును అక్కడ వదిలేశారని గ్రహించాడు. అంతేకాదు, ఆ చెప్పు సైజు ‘9’. సాధారణంగా మహిళలకు అంత పెద్ద సైజు పాదం ఉండదు.
చుట్టుపక్కల చూశాడు. అనుమానించదగ్గ ఆధారాలు కానీ పనికి వచ్చే క్లూస్‌ కానీ దొరకలేదు. చేతికి గ్లౌస్‌ ధరించి ఆ హైహీల్‌ చెప్పును చేతిలోకి తీసుకున్నాడు. లాడ్జికి చుట్టుపక్కల ఉన్న చెప్పుల షాపుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ చూశాడు.
లాడ్జికి కొద్ది దూరంలోనే ఉన్న ఒక పెద్ద చెప్పుల షాపు సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేయగా అసలు నిజం బయటపడింది. ఒక వ్యక్తి ఆ షాపుకు వెళ్లి, తొమ్మిదో నంబర్‌ లేడీస్‌ హైహీల్‌ చెప్పులు కొంటున్న దృశ్యం అందులో స్పష్టంగా కనిపించింది.
∙∙ 
లాడ్జిలో ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న ఎదురుగా లాడ్జి సిబ్బంది, లాడ్జిలో బస చేసిన కస్టమర్లు నిలబడి వున్నారు.
ప్రద్యుమ్న వెంటనే లాడ్జిలో ఉన్న సిబ్బంది అందరినీ లైన్లో నిలబెట్టి, వారి పాదాలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించాడు. లాడ్జిలో ఆగిన మగవాళ్ళు ‘అదేంటి ఇన్‌స్పెక్టర్, మమ్మల్ని అనుమానిస్తున్నారా? అయినా  మేము హైహీల్‌ చెప్పులు వేసుకోవడం ఏమిటి?’ అన్నారు.
‘ఇది హత్యకేసు. అందరూ సహకరించాల్సిందే.’ కఠినమైన స్వరంతో చెప్పాడు.
అందరూ నిలబడ్డారు. తన చేతిలో ఉన్న హత్యాస్థలంలో దొరికిన హైహీల్‌ చెప్పును కిందపెట్టి, ఒకొక్కరిని వచ్చి చెప్పులో కాలు పెట్టమని చెప్పాడు. రూమ్‌ బాయ్‌ మొదలు అందరూ వచ్చి ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న చెప్పినట్టు ఆ హైహీల్‌ చెప్పులో పాదం పెట్టారు. చివరికి మిగిలిన ఒకే ఒక వ్యక్తి మెల్లిగా వెనక్కి జరిగాడు.

ఆ వ్యక్తి మేనేజర్‌ కిరణ్‌... ముందుగా గింజుకున్నా ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న మొహంలో కోపం చూసి పాదం పెట్టాడు. కిరణ్‌ పాదాల సైజు కచ్చితంగా తొమ్మిది (9). అంతేకాదు, కిరణ్‌ కుడికాలి చర్మం కాస్త చిట్లిపోయి, చిన్న గాయం అయి ఉండటాన్ని ప్రద్యుమ్న గమనించాడు.
‘చెప్పు మిస్టర్‌ కిరణ్‌! ఇంకో హైహీల్‌ చెప్పు ఎక్కడ?’ కూల్‌గా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న. ఆ కూల్‌నెస్‌లోని సీరియస్‌నెస్‌ అర్థమైంది కిరణ్‌కు...

‘నాకు... నాకేం తెలుసు?’ బింకంగా అన్నాడు.
‘నాకేం తెలుసు అన్నావు గానీ, నేను ఈ హత్య చేయలేదు అనలేదు. కొత్త హైహీల్‌ చెప్పు కాబట్టి కరిచింది. చర్మం చిట్లిపోయి ఉంది. చెప్పుల షాప్‌లో సీసీ ఫుటేజ్‌లో నువ్వు హైహీల్‌ చెప్పులు కొంటున్న విజువల్‌ వుంది. మమ్మల్ని  డైవర్ట్‌ చేయడానికి నువ్వాడిన డ్రామా– హైహీల్‌ చెప్పుతో తప్పుదారి పట్టించాలనుకున్నావు. అదే ఇక్కడ సాక్ష్యాధారంగా మారింది.’ అంటూ ప్రద్యుమ్న కిరణ్‌ను తన స్టైల్లో విచారించడంతో కిరణ్‌ నిజం ఒప్పుకున్నాడు. అతను దొంగిలించిన వజ్రాలు ఎక్కడా కనిపించలేదు. కిరణ్‌ రూమ్‌ అంతా వెతికినా లాభం లేకపోయింది. అప్పుడు ప్రద్యుమ్న చూపు కిరణ్‌ రూమ్‌లో ఉన్న రెండో హైహీల్‌ చెప్పుపై పడింది.

ప్రద్యుమ్న ఆ రెండో చెప్పును తీసుకుని గట్టిగా లాగి, దాని అడుగు భాగాన్ని (సోల్‌) విరిచి చూశాడు. అంతే, అందరి కళ్లు బైర్లు కమ్మాయి!  కిరణ్‌ చాలా తెలివిగా ఆ హైహీల్‌ చెప్పు సోల్‌ భాగాన్ని కట్‌ చేసి, అందులో కోట్ల విలువైన వజ్రాలను దాచి మళ్లీ గ్లూతో అంటించాడు. కిరణ్‌ వేసిన మాస్టర్‌ ప్లా¯Œ ను ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న తన చాకచక్యంతో ఛేదించి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు.
- శ్రీసుధామయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement