లిట్‌వరల్డ్
దూరాన వినిపించెనొక తల్లి నోట, చిరుమువ్వ సడి పోలు ఓ జోలపాట అంతమెరుగని భయము, హద్దులెరుగని వగపు ఆ జోలపాటగా అల్లుకున్నాయి; రణభూమి వెలువర్చు ప్రతి ఒక్క గుండు, బలి తీసుకుంటుంది ఒక తల్లి గుండె విజయమెవ్వరినైన వరియించవచ్చు– తల్లి గుండెలు మటుకు తల్లడిలితీరు!
కరుణరసార్ద్రమైన ఈ శాంతిమంత్రాన్ని గానంచేసిన కవి పేరు కైసీన్ కులియేఫ్. ఒకప్పటి సోవియెట్ యూనియన్లో సుప్రసిద్ధుడైన ఈ కవి 1977లో బల్కార్ భాషలో ప్రచురించిన కవితా సంకలనంలోనిది ఈ గీతం. ఈ కవితా సంకలనానికి అప్పట్లోనే ‘గ్రాస్ అండ్ స్టోన్ (గడ్డి–రాయి)’ పేరిట ఆంగ్లానువాదం కూడా వెలువడింది. ఇది నాలుగుపాదాల చిరుకవిత మాత్రమే కాదు– ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించిన జాతి, ప్రపంచానికి వినిపించిన మాతృశోకమిది!
ఇక, నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే– నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళలో జర్నలిస్టులు సప్తర్షుల్లా ఏడుగురంటే ఏడుగురే! వాళ్ళలో నలుగురు– రడ్యార్డ్ కిప్లింగ్ (1907), ఎర్నెస్ట్ హెమింగ్వే (1954), అల్బర్ట్ కామూ (1957), స్వెత్లాన అలెక్సియేవిచ్ (2015) నోబెల్ ‘సాహిత్య’ పురస్కారం గెల్చుకున్నారు. ఇక, కార్ల్ ఫాన్ అసియేట్స్‌కియ్ (1935), మారీ రేజ– ద్మిత్రీయ్ మురతోఫ్ (2021) నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకోగలిగారు. నోబెల్ బహుమతుల్లో ‘జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కేటాయించినవి’ అంటూ ఏవీ లేకపోవడంతో, నోబెల్ విజేతల్లో ఎవరికీ ఆ బహుమతులు జర్నలిస్టులుగా రాలేదు. దాని మీద పత్రికల్లో పెద్ద చర్చే జరిగింది కానీ, పెద్ద ఫలితం లేకపోయింది.
తాను పుట్టడానికి మూడేళ్ళు ముందే ముగిసిన రెండో ప్రపంచ యుద్ధానిది మానవ నైజానికి– ముఖ్యంగా స్త్రీ ప్రకృతికి– విరుద్ధమైన స్వభావమని స్వెత్లాన తన రచనల్లో తీర్మానించారు. వాస్తవానికి, ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ యుద్ధ స్వభావాన్ని పరిశీలించినా, దానికి స్త్రీ నైజం లేదనే అర్థమవుతుందంటారామె. స్త్రీల –అందులోనూ, మాతృమూర్తుల– శోకం చరిత్ర రచనల్లో సక్రమంగా నమోదు కాలేదన్నది స్వెత్లాన నిశ్చితాభిప్రాయం. 1983లో వెలువడిన స్వెత్లాన రచన ‘సమరానికి మగువ మనసు లేదు!’ ఇదే విషయాన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది. రెండో ప్రపంచయుద్ధం గురించిన బెలరూస్ స్త్రీల మనోభావాలను స్వెత్లాన నమోదుచేశారు. ఈ రచనను ‘భావోద్వేగాల చరిత్ర’గా పేర్కొంటూ, దాన్ని ‘సరికొత్త సాహిత్య ప్రక్రియ’గా అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.
అయితే పాఠకులుగా మనం ఇక్కడ మనసులో పెట్టుకోవలసిన విషయం ఒకటుంది– ఈ ధోరణి స్వెత్లానతోనే మొదలు కాలేదు! గోర్కియ్, షలహోఫ్, యెసినీన్, పస్తర్నాక్, మయాకఫ్స్కియ్ మొదలుకొని చింగిజ్ ఐత్మతోఫ్ వరకూ ఎందరో ప్రసిద్ధులు యుద్ధాన్ని ఏనాడో వ్యతిరేకించారు. లెనిన్ నాయకత్వంలో సోవియెట్ యూనియన్ జారీ చేసిన మొట్టమొదటి శాసనమే శాంతి శాసనం. ‘కత్తులను నాగేటి కర్రులుగ తీర్చుదాం!’ అన్నది దానికిచ్చిన శీర్షిక. కొందరు పాశ్చాత్య విమర్శకులు చిత్రించినట్లుగా స్వెత్లాన రచనకూ మిహయీల్ గొర్బచ్యేఫ్ ‘గ్లాస్నస్త్’కూ కూడా ఏ సంబంధం లేదు. స్వెత్లాన రచన వెలువడిన రెండేళ్ళకు–1985లో– గానీ మిహయీల్ గొర్బచ్యేఫ్ సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికకాలేదు! మరో మూడేళ్లకు గానీ గ్లాస్నస్త్ రంగం మీదికి రానేలేదు!!
1945లో ముగిసిన రెండో ప్రపంచయుద్ధం నుంచి, 1979లో మొదలై– పదేళ్ళపాటు సాగిన అఫ్గాన్ దురాక్రమణ యుద్ధం వరకూ జరిగిన ఎన్నెన్నో పరిణామాలు మిగిల్చిన విషాద స్మృతులను ఆమె తన రచనల్లో– ముఖ్యంగా, 1992లో ఆంగ్లానువాదంగా వెలువడిన ‘జింకీ బ్రదర్స్’లో– నమోదుచేశారు. అలాగే, ‘వాయిసెస్ ఫ్రం చెర్నోబిల్’(2005) లో కూడా అధికారిక చరిత్రకెక్కని వాస్తవాలను ఆమె నమోదుచేశారు. మరో ఒకటిన్నర దశాబ్దానికి వెలువడిన ‘లాస్ట్ విట్నెసెస్’లో కూడా, రెండో ప్రపంచయుద్ధ కాలంలో బాలలుగా వుండినవారి జ్ఞాపకాలను నమోదు చేశారు. ఇదే కోవకు చెందిన మరో రచన ‘సెకండ్ హ్యాండ్ టైం.’ గడియారం ముళ్ళను ఇంగ్లిషులో హ్యాండ్స్ అంటారు. వర్తమానాన్ని రచయిత్రి – చమత్కారంగా– ‘సెకండ్ హ్యాండ్ టైం’ అన్నారు.
ఇవన్నీ వాగ్రూపంలో వున్న చరిత్రను అక్షరబద్ధం చేసే క్రమంలో స్వెత్లాన రచించిన పుస్తకాలు. వీటిని ‘పాలీఫోనిక్’ రచనలుగా పాశ్చాత్య విమర్శకులు పరిగణించారు. సాధారణంగా చరిత్రగ్రంథాల్లో రచయిత దృక్కోణం ఒక్కటే స్ఫుటంగా కనిపిస్తుంది. కానీ వాగ్రూప చరితలకు మూలం వ్యక్తుల జ్ఞాపకాలు. అవన్నీ ఒకే కోణం నుంచి చూసిన దృశ్యాలు కానవసరంలేదు. అంచేత వాటి దృక్కోణం బహుళంగా వుండవచ్చు. స్వెత్లాన రచనల్లో అలా వుంటాయి కూడ! అందుకే అవి అక్షరాలా ‘పాలీఫోనిక్’ రచనలు.
స్వెత్లానా అలెక్సియేవిచ్ లాంటి రచయితలు రాసిన పుస్తకాలు, పాఠకుల వ్యక్తిగత పరిమితులూ– విస్తృతులకు తగినట్లుగా అర్థమవుతాయి. ఇప్పుడు చదివితే ఒకలా అనిపించి, తర్వాత చదివినప్పుడు మరోలా అనిపించవచ్చు కూడా. మనుషుల్లో మార్పు సహజం కదా! నన్నడిగితే, 2013లో రాసిన ‘సెకండ్ హ్యాండ్ టైం’ అనే పుస్తకాన్ని స్వెత్లాన ఇప్పుడు తిరిగి రాస్తే, అది అలా వుండదు. లుకాషెంకో పాలనతో సోవియెట్ పాలనను పోల్చుకున్న బెలారూస్ పౌరులు ఇంతకుముందు మాట్లాడినట్లే ఇప్పుడూ మాట్లాడతారనుకోను!
- మందలపర్తి కిషోర్


