breaking news
Mandalaparti kishore
-
నోబెల్ శిఖరమెక్కిన జాణపదం!
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా టాగోర్ గీతరచనను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.పరిపూర్ణమైన కౌశలంతో నిండివుండే టాగోర్ కవితావేశం ఆయన (ఆంగ్ల) గీతాలను పాశ్చాత్య సాహితిలో భాగంగా మార్చిందని స్వీడిష్ ఎకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. నాటికి నూట మూడేళ్ళు మరో పదమూడు రోజుల్లో పూర్తి అవుతాయనగా– 2016, అక్టోబరు 13న– మరో గీతరచయిత బాబ్ డిలాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు అదే ఎకాడెమీ ప్రకటించింది. ‘మహత్తరమైన అమెరికన్ గీతరచన సంప్రదాయ పరిధిలోనే కొనసాగుతూ, సరికొత్త కవితాత్మక భావప్రకటనలు చేసినందుకు’ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ తన అభినందన సందేశంలో ప్రకటించింది. అలా, నూరేళ్ళ తర్వాత, గీతరచనకు రెండోసారి నోబెల్ పురస్కారం సంపాదించిపెట్టిన వాగ్గేయకారుడిగా బాబ్ డిలాన్ చరిత్ర సృష్టించాడు.కెనడా సరిహద్దుల్లో వుండే అమెరికన్ స్టేట్ మిన్నెసోటా. అక్కడి ఆదివాసుల జానపద గీతాలు చరిత్రప్రసిద్ధాలు. పద్దెనిమిదో శతాబ్ది చివర్లో, జంతువుల చర్మాల కోసం ఇక్కడికి వచ్చే ఫ్రెంచ్ యాత్రికులు తమ గీతాల బాణీలతో ఇక్కడి స్థానిక గీతాలను మేళవించి కొత్తరకం జానపద గీతాల సంప్రదాయం సృష్టించారంటారు. బాబ్ డిలాన్ కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది ఈ జానపద గీతాలు పాడే! సాధారణంగా జానపద బాణీలో రాసిన గీతాలనగానే, మనకి విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలూ’, నండూరి ‘ఎంకి పాటలూ’, కొనకళ్ళ ‘బంగారిమామ పాటలూ’ గుర్తుకురావడం సహజం.అయితే, బాబ్ డిలాన్ గీతసాహితి ఆ బాపతు కాదు. 1960 దశకం మొదట్లో, 22 యేళ్ళ బాబ్ ‘ఉత్తరాది పల్లెటూరి పడుచు పిల్లా’, ‘కుండపోతగా వాన కురవనుంది పిల్లా’ లాంటి పాటలు రాసి పాడకపోలేదు. కానీ బాబ్ డిలాన్ బాణీకి పేరుతెచ్చిపెట్టినవి అలాంటి పాటలు కావు. అమెరికాలో యుద్ధ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో బాబ్ పాడిన ‘పెనుగాలి వీస్తోంది’, ‘కాలం మారుతోంది’ లాంటివే బాబ్ డిలాన్ బాణీ ఇలాంటిదనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ పాటల్లో డిలాన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఆ రోజుల్లో సామాన్య పౌరులందరి మనస్సులనూ కలవరపరుస్తున్నవే! వాటికి ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదనే విమర్శ లేకపోలేదు. అయితే, అది కవిగారి పని కాదనే వాదన కూడా వినవచ్చింది! పాయింటేమిటంటే, అప్పట్లో– 1965 నాటికి– బీజప్రాయంగా మాత్రమేవున్న ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ (కౌంటర్ కల్చర్) చాయలు ఆ పాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అదీ అసలు విశేషం! బాబ్ డిలాన్ అనేది కవిగారి పెట్టుపేరు– రాబర్ట్ యాలెన్ జిమ్మెర్మన్ అతగాడి పుట్టుపేరు. దాన్నిబట్టి, బాబ్ యూదు మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టి పెరిగాడని అర్థమవుతుంది. అతని తండ్రి రష్యన్ జాతీయుడు కాగా, తల్లి లిథువేనియా జాతీయురాలు. (ఈ రెండు జాతులూ 1918 మొదలుకొని 1990 వరకూ సోవియెట్ యూనియన్‌లో భాగంగా వున్న సంగతి ఆధునిక రాజకీయ చరిత్ర తెలిసినవారికి వేరే చెప్పనవసరంలేదు! ఆ తర్వాత అవి తిరిగి ‘స్వతంత్ర’ దేశాలుగా ఆవిర్భవించాయి) రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో బాబ్ తల్లితండ్రులు అమెరికా చేరి అక్కడే మనువాడారు. మతానికి సంబంధించి, బాబ్ డిలాన్ అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1970–’80 మధ్యకాలంలో బాబ్ క్రైస్తవమతంలోకి మారి, కొద్దికాలానికే తిరిగి యూదుమతంలోకి మారిపోయారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి– వాటినలా వదిలేయండి!దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర, అమెరికన్ జానపద– రాక్ సంగీత సంప్రదాయానికి చెందిన ఈ వాగ్గేయకారుడి సొంతం. పన్నెండున్నర కోట్ల రికార్డులను అమ్మి, బాబ్ డిలాన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. అమెరికాకు పన్నెండో నోబెల్ సాహిత్య పురస్కారం సంపాదించి పెట్టిన అతగాడు. (అమెరికన్ రచయిత్రి లూయీజ్ గ్లిక్ –2020లో– పదమూడోసారి ఇదే పురస్కారాన్ని గెల్చుకున్న సంగతి చదువుకున్న మిత్రులకు తెలిసిన విషయమే!) ‘ప్రామాణిక సాహిత్యం అందించే మేధాసంపదతో సమృద్ధమైన సంస్కారం కలిగినవాడు బాబ్ డిలాన్. ఆయన 1960 దశకంలోనే, అమెరికన్ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశార’ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా శ్లాఘించింది. 85 సంవత్సరాల వయసున్న ఈ సుప్రసిద్ధ వాగ్గేయకారుణ్ణి, ఆధునిక పాఠక–శ్రోతలకు ఇప్పుడు పరిచయం చేయాలనుకోవడం దుస్సాహసమే!- మందలపర్తి కిషోర్ -
యుద్ధానికి మగువ మనసులేదు: స్వెత్లాన!
దూరాన వినిపించెనొక తల్లి నోట, చిరుమువ్వ సడి పోలు ఓ జోలపాట అంతమెరుగని భయము, హద్దులెరుగని వగపు ఆ జోలపాటగా అల్లుకున్నాయి; రణభూమి వెలువర్చు ప్రతి ఒక్క గుండు, బలి తీసుకుంటుంది ఒక తల్లి గుండె విజయమెవ్వరినైన వరియించవచ్చు– తల్లి గుండెలు మటుకు తల్లడిలితీరు!కరుణరసార్ద్రమైన ఈ శాంతిమంత్రాన్ని గానంచేసిన కవి పేరు కైసీన్ కులియేఫ్. ఒకప్పటి సోవియెట్ యూనియన్‌లో సుప్రసిద్ధుడైన ఈ కవి 1977లో బల్కార్ భాషలో ప్రచురించిన కవితా సంకలనంలోనిది ఈ గీతం. ఈ కవితా సంకలనానికి అప్పట్లోనే ‘గ్రాస్ అండ్ స్టోన్ (గడ్డి–రాయి)’ పేరిట ఆంగ్లానువాదం కూడా వెలువడింది. ఇది నాలుగుపాదాల చిరుకవిత మాత్రమే కాదు– ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించిన జాతి, ప్రపంచానికి వినిపించిన మాతృశోకమిది!ఇక, నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే– నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళలో జర్నలిస్టులు సప్తర్షుల్లా ఏడుగురంటే ఏడుగురే! వాళ్ళలో నలుగురు– రడ్యార్డ్ కిప్లింగ్ (1907), ఎర్నెస్ట్ హెమింగ్వే (1954), అల్బర్ట్ కామూ (1957), స్వెత్లాన అలెక్సియేవిచ్ (2015) నోబెల్ ‘సాహిత్య’ పురస్కారం గెల్చుకున్నారు. ఇక, కార్ల్ ఫాన్ అసియేట్స్కియ్ (1935), మారీ రేజ– ద్మిత్రీయ్ మురతోఫ్ (2021) నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకోగలిగారు. నోబెల్ బహుమతుల్లో ‘జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కేటాయించినవి’ అంటూ ఏవీ లేకపోవడంతో, నోబెల్ విజేతల్లో ఎవరికీ ఆ బహుమతులు జర్నలిస్టులుగా రాలేదు. దాని మీద పత్రికల్లో పెద్ద చర్చే జరిగింది కానీ, పెద్ద ఫలితం లేకపోయింది.తాను పుట్టడానికి మూడేళ్ళు ముందే ముగిసిన రెండో ప్రపంచ యుద్ధానిది మానవ నైజానికి– ముఖ్యంగా స్త్రీ ప్రకృతికి– విరుద్ధమైన స్వభావమని స్వెత్లాన తన రచనల్లో తీర్మానించారు. వాస్తవానికి, ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ యుద్ధ స్వభావాన్ని పరిశీలించినా, దానికి స్త్రీ నైజం లేదనే అర్థమవుతుందంటారామె. స్త్రీల –అందులోనూ, మాతృమూర్తుల– శోకం చరిత్ర రచనల్లో సక్రమంగా నమోదు కాలేదన్నది స్వెత్లాన నిశ్చితాభిప్రాయం. 1983లో వెలువడిన స్వెత్లాన రచన ‘సమరానికి మగువ మనసు లేదు!’ ఇదే విషయాన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది. రెండో ప్రపంచయుద్ధం గురించిన బెలరూస్ స్త్రీల మనోభావాలను స్వెత్లాన నమోదుచేశారు. ఈ రచనను ‘భావోద్వేగాల చరిత్ర’గా పేర్కొంటూ, దాన్ని ‘సరికొత్త సాహిత్య ప్రక్రియ’గా అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.అయితే పాఠకులుగా మనం ఇక్కడ మనసులో పెట్టుకోవలసిన విషయం ఒకటుంది– ఈ ధోరణి స్వెత్లానతోనే మొదలు కాలేదు! గోర్కియ్, షలహోఫ్, యెసినీన్, పస్తర్నాక్, మయాకఫ్స్కియ్ మొదలుకొని చింగిజ్ ఐత్మతోఫ్ వరకూ ఎందరో ప్రసిద్ధులు యుద్ధాన్ని ఏనాడో వ్యతిరేకించారు. లెనిన్ నాయకత్వంలో సోవియెట్ యూనియన్ జారీ చేసిన మొట్టమొదటి శాసనమే శాంతి శాసనం. ‘కత్తులను నాగేటి కర్రులుగ తీర్చుదాం!’ అన్నది దానికిచ్చిన శీర్షిక. కొందరు పాశ్చాత్య విమర్శకులు చిత్రించినట్లుగా స్వెత్లాన రచనకూ మిహయీల్ గొర్బచ్యేఫ్ ‘గ్లాస్నస్త్’కూ కూడా ఏ సంబంధం లేదు. స్వెత్లాన రచన వెలువడిన రెండేళ్ళకు–1985లో– గానీ మిహయీల్ గొర్బచ్యేఫ్ సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికకాలేదు! మరో మూడేళ్లకు గానీ గ్లాస్నస్త్ రంగం మీదికి రానేలేదు!!1945లో ముగిసిన రెండో ప్రపంచయుద్ధం నుంచి, 1979లో మొదలై– పదేళ్ళపాటు సాగిన అఫ్గాన్ దురాక్రమణ యుద్ధం వరకూ జరిగిన ఎన్నెన్నో పరిణామాలు మిగిల్చిన విషాద స్మృతులను ఆమె తన రచనల్లో– ముఖ్యంగా, 1992లో ఆంగ్లానువాదంగా వెలువడిన ‘జింకీ బ్రదర్స్’లో– నమోదుచేశారు. అలాగే, ‘వాయిసెస్ ఫ్రం చెర్నోబిల్’(2005) లో కూడా అధికారిక చరిత్రకెక్కని వాస్తవాలను ఆమె నమోదుచేశారు. మరో ఒకటిన్నర దశాబ్దానికి వెలువడిన ‘లాస్ట్ విట్నెసెస్’లో కూడా, రెండో ప్రపంచయుద్ధ కాలంలో బాలలుగా వుండినవారి జ్ఞాపకాలను నమోదు చేశారు. ఇదే కోవకు చెందిన మరో రచన ‘సెకండ్ హ్యాండ్ టైం.’ గడియారం ముళ్ళను ఇంగ్లిషులో హ్యాండ్స్ అంటారు. వర్తమానాన్ని రచయిత్రి – చమత్కారంగా– ‘సెకండ్ హ్యాండ్ టైం’ అన్నారు.ఇవన్నీ వాగ్రూపంలో వున్న చరిత్రను అక్షరబద్ధం చేసే క్రమంలో స్వెత్లాన రచించిన పుస్తకాలు. వీటిని ‘పాలీఫోనిక్’ రచనలుగా పాశ్చాత్య విమర్శకులు పరిగణించారు. సాధారణంగా చరిత్రగ్రంథాల్లో రచయిత దృక్కోణం ఒక్కటే స్ఫుటంగా కనిపిస్తుంది. కానీ వాగ్రూప చరితలకు మూలం వ్యక్తుల జ్ఞాపకాలు. అవన్నీ ఒకే కోణం నుంచి చూసిన దృశ్యాలు కానవసరంలేదు. అంచేత వాటి దృక్కోణం బహుళంగా వుండవచ్చు. స్వెత్లాన రచనల్లో అలా వుంటాయి కూడ! అందుకే అవి అక్షరాలా ‘పాలీఫోనిక్’ రచనలు.స్వెత్లానా అలెక్సియేవిచ్ లాంటి రచయితలు రాసిన పుస్తకాలు, పాఠకుల వ్యక్తిగత పరిమితులూ– విస్తృతులకు తగినట్లుగా అర్థమవుతాయి. ఇప్పుడు చదివితే ఒకలా అనిపించి, తర్వాత చదివినప్పుడు మరోలా అనిపించవచ్చు కూడా. మనుషుల్లో మార్పు సహజం కదా! నన్నడిగితే, 2013లో రాసిన ‘సెకండ్ హ్యాండ్ టైం’ అనే పుస్తకాన్ని స్వెత్లాన ఇప్పుడు తిరిగి రాస్తే, అది అలా వుండదు. లుకాషెంకో పాలనతో సోవియెట్ పాలనను పోల్చుకున్న బెలారూస్ పౌరులు ఇంతకుముందు మాట్లాడినట్లే ఇప్పుడూ మాట్లాడతారనుకోను!- మందలపర్తి కిషోర్ -
మౌనం – అది అద్భుతం, వాస్తవికం!
‘రచయితలు తమకు తెలిసింది మాత్రమే రాయగలరు; అది కూడా, తమకు సహజమైన పద్ధతిలో మాత్రమే రాయగలర’న్నారు ప్రపంచ ప్రసిద్ధ చైనీస్ రచయిత మో యాన్. అది ఆయన అసలు పేరు కాదు– పెట్టుకున్న కలంపేరు. దానికి ‘మాట్లాడ వద్దు!’ అని అర్థం. మో బతికి బట్టకట్టిన వ్యవస్థలో, పాలకులకు భజన చేసేవారికి తప్ప మరెవరికీ మాట్లాడే హక్కు లేదు. నిజానికి కొద్దిపాటి మినహాయింపులతో, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొని వుందిప్పుడు! చైనా ఆర్థిక– సామాజిక– సాంస్కృతిక వ్యవస్థలోనూ అదే పరిస్థితి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది.‘ప్రజా రిపబ్లిక్’ పేరుగొప్ప, ఊరుదిబ్బగా మిగిలింది. 1980 దశకంలో, ఇందులో కొద్దిపాటి మార్పులు రాకపోలేదు– కానీ, మానవ హక్కుల కోసం ఆజన్మాంతం పోరాడిన లియూ జియావ్బో లాంటి వాళ్ళు కన్నుమూయడానికి కొద్దికాలం ముందువరకూ కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఓ రచయిత పెట్టుకోదగిన కలంపేరునే, మో యాన్ ఎంచుకున్నాడు! అంతటి విచక్షణ ఉన్నందువల్లనే 2012లో మో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోగలిగాడు. అప్పటికే ఆయన స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సుప్రసిద్ధుడు!మనం నివసించే వ్యవస్థలో, చెప్పే మాటకూ చేసే పనికీ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడిన నేపథ్యంలో రచయితలూ కళాకారులూ ఏం చెయ్యగలుగుతారు? అది రష్యాలోనైనా సరే, చైనాలోనైనా సరే, లాటిన్ అమెరికన్ దేశాల్లోనైనా సరే –మరే దేశంలోనైనా సరే– ఇలాంటి విరోధాభాస పాతుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెయ్యగలరు పాపం? అద్భుత వాస్తవికత అనే కాల్పనిక వటవృక్షం నీడలో రవంత ఊరట పొందగలుగుతారంతే! మిహయీల్ బుల్గాకఫ్ రచనల్లో చేసిందే ఆంద్రెయ్ తార్కఫ్సి్కయ్ సినిమాల్లో చేశాడు. గాబ్రియల్ గార్సియా మార్కెజ్ మెక్సికోలో చేసిందే జిగ్మండ్ స్కూజి¯Œ ‡్ష లాత్వియాలో చేశాడు. మో యాన్ అదే పని చైనాలో చేశాడు! నోరు తెరవని మౌనిగా ఉంటూనే, తను చెప్పదల్చుకున్న కథలన్నీ చెప్పేశాడు మో.చైనా చరిత్రను– ముఖ్యంగా మో యాన్ లాంటి రైతుబిడ్డల జీవితాలను– 1966 నాటి చైనా సాంస్కృతిక విప్లవం పెనుమలుపు తిప్పింది. మలుపులన్నీ మంచి వైపే తిరగాలన్న రూలేం లేదని చదువుకున్న పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చైనా చరిత్ర చదువుకున్న వాళ్ళెవరూ, సాంస్కృతిక విప్లవం తెచ్చిపెట్టిన మార్పులన్నీ మంచివేనని అనుకోరు, అనలేరు! ఆ సంవత్సరమే మో బడి వదిలిపెట్టి మడిలోకి దిగాల్సివచ్చింది. అప్పటికి ఆయన అయిదో తరగతి చదువుతూండేవాడు. తన కుటుంబానికి సొంతమైన ఓ మడిచెక్కలో, పశువులను మేపుకుంటూ ఆరేడేళ్ళపాటు అలాగే గడిపేశాడు మో. బళ్ళో ఒంటబట్టించుకున్న అక్షరమ్ముక్కల్ని మర్చిపోకుండా వుండేందుకు మో‘షిన్ హువా నిఘంటువు’ను రోజంతా తిరగేస్తూవుండేవాడు. ఒంటరితనం శాపమే అతని పాలిట వరమైంది. తనలోకి తాను తొంగిచూసుకోగల రచయితకు పురుడుపోసిన మంత్రసాని ఆ ఒంటరితనమే! పల్లెపదాలు వింటూ పల్లెప్రజలు ఆడే బొమ్మలాటలూ, బయలాటలూ చూస్తూ పెరగడం వల్లనే మో మాటకు ఆ మట్టివాసన అంత గట్టిగా అంటుకుంది. అద్భుత వాస్తవికతను కూడా చైనా వాసులకు సొంతంచేసింది ఈ మట్టివాసనే!తనలాగే అర్ధాంతరంగా చదువులు మానేసిన మరికొందరు రైతుబిడ్డలతో కలిసి, మో యాన్ 1973లో ఓ నూలుమిల్లులో కూలిపనికి చేరాడు. అప్పటికే వాళ్ళలో కొందరికి కళలూ, సాహిత్యంలో వైవిధ్యంతో పరిచయం ఉంది. వాళ్ళ సాహచర్యం మో జీవనాన్ని మరో మలుపు తిప్పింది. విలియం ఫాక్నర్, మార్కెజ్ లాంటి అద్భుత వాస్తవిక వాదులను చదువుకున్న తరమది. మో యాన్‌కు వాళ్ళను పరిచయం చేసింది ఈ చదువుకున్న అబ్బాయిలే! చైనా ఆర్థిక వ్యవస్థను ‘సోషలిస్ట్ మార్కెట్ వ్యవస్థ’గా మార్చిన పుణ్యం కూడా ఈ చదువుకున్న అబ్బాయిలకే దక్కుతుంది. సదరు సోషలిస్ట్ మార్కెట్ వ్యవస్థే, చైనా పారిశ్రామిక రంగంలో స్వెట్ షాప్ విధానాన్ని ప్రవేశపెట్టిందని చరిత్ర చెప్తోంది. అది వేరే విషయం అనుకోండి!!మో యాన్ రచనల విషయానికి వస్తే, 1984లో ఆయన రాసిన ‘గాజు ముల్లంగి’, నవలిక అతనికి రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ యేడాదే, మో ‘చైనా ప్రజా విమోచన సైన్యం లలితకళాక్షేత్రం’లో చేరిన మాట నిజమే. అయితే, అతగాడు అంతకు ముందునుంచీ రాస్తూవున్న మాటా నిజమే! మరో రెండేళ్ళకు మో రాసిన ‘ఎర్రజొన్నలు’ నవల సంచలనాన్ని రేకెత్తించింది. కాలక్రమంలో నడవని ఈ కథను, ఓ గొర్రెల కాపరి కుర్రాడు చెప్తాడు. అది రచయితేనని విమర్శకుల నమ్మకం.ఈ నవలను మూలకథగా చేసుకుని జ్షాంగ్ యిమో దర్శకత్వంలో రూపొందిన సినిమాకు బర్లినాల్ (బర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం)లో గోల్డెన్ బేర్ పురస్కారం దక్కింది. ఈ రెండు రచనలకూ మధ్యలో మో ‘ఆనందం’ అనే నవలిక రాశాడు కానీ, అది పాలకుల కన్నెర్రకు గురైంది. అలాగే, 1987లో చైనా మార్కెట్లను ముంచెత్తిన వెల్లుల్లి సంక్షోభాన్ని ఇతివృత్తంగా తీసుకుని మో ‘వెల్లుల్లి వీరగాథ’ అనే నవల రాశాడు. పాలకులు ఈ రచనను– మొదట్లో– చూసీ చూడనట్లు వదిలేశారు. తీరా 1989లో తియానాన్మెన్ స్క్వేర్ అణచివేత నేపథ్యంలో ‘వెల్లుల్లి వీరగాథ’ నవలను నిషేధించారు. ఈ నిషేధాన్ని చైనాకు మాత్రమే పరిమితం చెయ్యడం గమనార్హం!ఇలాంటి అనుభవాలు మో యాన్‌కు మంచి పాఠమే నేర్పించాయి. దాంతో మో కాస్తో కూస్తో లౌక్యం ఒంటబట్టించుకున్నారు. 2012 మే నెల్లో యానాన్ ప్రసంగానికి నూరు ప్రతులు తయారు చేసే బృందంలో చేరి తన ‘బుడతా భక్తి’ ప్రదర్శించాడు. అంతటి లౌక్యుడికి నోబెల్ సాహిత్య పురస్కారం ఏమిటి, దేశాధ్యక్ష పదవి దక్కినా ఆశ్చర్య పడనక్కర్లేదు!- మందలపర్తి కిషోర్ -
చేదు మేసి నెమరేసిన రచయిత!
‘నా దృష్టిలో శిశిరం ఎప్పుడూ విషాదాన్ని మిగిల్చే రుతువు కాదు. రాలిన ఆకులూ, బక్కచిక్కిన పగళ్ళూ అంతిమ ఘడియలకు ప్రతీకలుగా కనిపించవు నాకు. అవి నా కళ్ళకు భవిష్యత్తు గురించిన ఆశల్లా కనిపిస్తాయి. అక్టోబరు మాసపు అసురసంజ వేళల్లో ఏదో విద్యుద్వాహిని ప్యారిస్ వీథుల్లో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అలాంటప్పుడు ముసురుపట్టి చినుకులు పడుతున్నా, నా మనసేం కుంగిపోదు! అలాగని కాలం పిట్ట రెక్కలమీద ఎగురుతున్నట్లూ అనిపించదు!!అలాంటి వేళల్లో ఏం జరిగినా జరగొచ్చని మాత్రమే అనిపిస్తుంది నాకు. నా వరకూ నాకు, అక్టోబరులోనే నూతన సంవత్సరానికి తెర తీస్తున్నట్లు భావిస్తాన’న్న రచయిత ఏ భావకవిగారో కాదు సుమా! అతగాడు ఫక్తు నవలా రచయిత! 2014లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న ప్యాట్రిక్ మొద్యానా చారిత్రక కాల్పనిక నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు. ఆయన రాసిన నాలుగు పదులకు మించిన పుస్తకాలన్నింటా ప్రాథమిక ఇతివృత్తం దాదాపు ఒకటే! రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్ ప్రజలు పడ్డపాట్లకే ఒకింత కాల్పనికత మేళవించి, మొద్యానా ఈ నవలలు రాశాడు. ‘చేజారిన యవ్వనం కెఫేలో...’ అనే నవలలో రాసినవే పైన ఉట్టంకించిన మాటలు.రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు ఎనిమిది కోట్లమంది జనం ఉన్నవూరికీ, కన్నవారికీ, కట్టుకున్నవారికీ, కన్న బిడ్డలకూ, చేసుకునే వృత్తులకూ దూరమై అలమటించారు. ఈ యుద్ధానికి ప్రధాన రణక్షేత్రంగా ఉండిన యూరపులోనే ఇలాంటి బాధితుల సంఖ్య సగానికి సగం వుంటుంది. యుద్ధబాధితుల్లో సగానికి సగం మంది స్త్రీ– శిశు– వృద్ధులే! ముఖ్యంగా, వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో బంధితులైన స్త్రీపురుషుల సంతానం అకస్మాత్తుగా అనాథలుగా మారి, నడివీథిలో నిలబడవలసి వచ్చింది. అలాంటి వారిలో, 1945లో పుట్టిన మొద్యానా కూడా ఒకడు.ఈ యుద్ధం సందర్భంగానే, అరవై లక్షలమంది యూదులను ఊచకోత కోశారు. మొద్యానా తండ్రి ఆల్బెర్ట్ కూడా యూదు మతస్థుడే; ఇటాలియన్ కులీన వంశానికి చెందిన ఆల్బెర్ట్ నాజీలతో చేతులు కలిపినవాడు. అతని తల్లి లూయిజా ఫ్లెమిష్ (బెల్జియన్–డచ్) సాంప్రదాయిక నర్తకి. ఫ్రాన్స్ విదేశీ దురాక్రమణకు గురైన రోజుల్లో, 1942లో, వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రణయానికీ, పరిణయానికీ దారితీసింది. యుద్ధకాలంలో, మొద్యానా తండ్రి కార్లాంగ్ అనే ఫ్రెంచ్ గెశ్టాపో ఆశీర్వాద బలంతో– బ్లాక్ మార్కెట్లో వీరవిహారం చేశాడంటారు. కార్లాంగ్ సారథులు, నేర ప్రపంచంలో కొమ్ములు తిరిగిన దున్నపోతులై వుండడం వల్లనే, ఇది సాధ్యమైందని కూడా చెప్తారు!రెండో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు మొద్యానా తల్లితండ్రులు కారనేది వాస్తవం! అయితే ఆ యుద్ధ పరిణామాల వల్ల, మొద్యానా మాదిరిగా, ‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని కూనలు’ ఎందరో అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చిందనే మాట కూడా వాస్తవమే మరి! అందుకే, మొద్యానా తన తల్లిదండ్రుల తరాన్ని జీవితంలో ఎన్నడూ క్షమించలేదు!! ఫ్రాన్స్‌లో చిన్నాపెద్దా ఊళ్ళకు కూడా మొద్యానా పేరును పరిచయం చేసిన ‘మాయమైన మనిషి’ లాంటి నవలలు మొదలుకొని ‘డారా బ్రూడర్’, ‘ముక్కలైన వాక్యాలు (మూడు నవలల సంపుటి)’, ‘కనిపించని సిరా’– ఇలా ఏ నవలను చూసినా ఇదే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత, అనేక భాషల్లోకి అనువాదమైన మొద్యానా 139 పుస్తకాలలో దేన్ని చూసినా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. పైపైన చూస్తే మొద్యానా రాసింది అపరాధ పరిశోధన సాహిత్యం అనిపిస్తుంది. అయితే, ఆ ‘అపరాధం’ చట్టాలు నిషేధించిన నేరాలు చేయడమే కాదు– స్త్రీలనూ, బాలలనూ– వృద్ధులనూ వేధించిన కండకావరం! దాన్ని నిరసించడానికే మొద్యానా తన సాహిత్య జీవితాన్ని మొత్తం అంకితం చేశాడు. అయితే, ఆ విషయం వాచ్యంగా చెప్పకుండా, సాహిత్య మర్యాదలన్నీ పాటించడంలో మొద్యానా శిల్ప పరిణతి కనిపిస్తుంది. అందువల్లనే ఈ అపరాధ పరిశోధక రచయితకు నోబెల్ పురస్కారం దక్కింది!మొద్యానా చవిచూసిన చేదు అనుభవాల్లో, ఘోరాతి ఘోరమైన విషయాలున్నాయి. అతన్ని పెంచి పెద్ద చేయడం ‘పెనుభారం’గా అటు తల్లీ, ఇటు తండ్రీ కూడా భావించడం వాటిలో మొదటిది. సదరు భారాన్ని తమ నెత్తిమీంచి దించి, ఎదుటివారి నెత్తిన మోపేందుకు నానా పాట్లూ పడ్డం రెండో ఘోరం. సహాయం కోరి ఆశ్రయించిన పాపానికి, మొద్యానాను తాము విదిలించి పారేయడమే కాకుండా, తమ బాయ్ ఫ్రెండ్సూ– గర్ల్ ఫ్రెండ్సూ చేత కూడా అదే సత్కారం జరిపించడం ఘోరాతి ఘోరం! ఇంత జరిగిన తర్వాత, తన తల్లితండ్రుల తరాన్ని అసహ్యించుకున్నందుకు మొద్యానాను ఎవరైనా తప్పు పట్టగలరా? సొంత అనుభవాలే పూర్వరంగంగా ఆనాటి ఫ్రాన్స్‌లో రచయితగా మనగలగడం మజాకా కాదు.ఆధునిక ఫ్రెంచ్ వాడుకభాషను ఓ మలుపుతిప్పిన రేమన్ కెనో, మొద్యానా తల్లికి నేస్తం; మొద్యానాకు గురువు. అతని చలవతోనే, మొద్యానా తన తొలినవల ‘నక్షత్ర కూడలి’ అచ్చువేయించుకున్నాడు. అందులో ప్రధాన పాత్రలు మొద్యానా తండ్రిని పోలివుండడం మింగుడు పడనందువల్లనే ఆ పెద్దమనిషి సదరు నవల కాపీలు దొరికినన్ని కొనేసి తగలబెట్టేశాడట!‘దురాక్రమణ పాలైన ప్రాంతాల్లో జీవప్రపంచం అనుభవించిన స్థితిగతులనూ, ఎవరికీ బోధపడని మానవాళి భవితనూ సొంత జ్ఞాపకాల ప్రాతిపదికగా మన కళ్ళముందు ఉంచిన కళ మొద్యానా సొంతమ’న్నారు స్వీడిష్ ఎకాడెమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్. ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మొద్యానా మరెక్కడా ప్రాచుర్యానికి నోచుకోలేదని 2014లో పీటర్ ఇంగ్లండ్ అన్నమాట వాస్తవమే. అయితే యేం? నోబెల్ పురస్కారం కోసం నామినేట్ అయిన తొలిసారే, అతన్ని ఆ బహుమతి వరించడం కూడా వాస్తవమే మరి! - మందలపర్తి కిషోర్ -
క్లాసిక్స్ అంటే ఏమిటి
‘ప్రపంచంలోని పుస్తకాలన్నీ రెండే రకాలు! కొన్ని క్షణకాలం నిలిచేవి – మరికొన్ని కలకాలం నిలిచేవి’ అన్నాడు పందొమ్మిదవ శతాబ్దపు బహుముఖ ప్రజ్ఞావంతుడు జాన్ రస్కిన్. అలా కలకాలం నిలిచే పుస్తకాలనే ‘క్లాసిక్స్’ అంటూవుంటారు. సాహిత్య విమర్శలో ఏ మాట చెప్పినా, ఆలంకారికంగానే చెప్తారు; అంచేత ‘కలకాలం’ అంటే సుదీర్ఘకాలమనే మనం అర్థంచేసుకోవాలి. ‘ఎంత కాలంగా నిలువనున్న సరుకైతే అది అంత ప్రశస్తమైనది’ అనే ప్రమాణం చింతకాయ పచ్చడికీ ఉసిరిపచ్చడికీ వర్తించినంతగా క్లాసిక్స్‌కు వర్తించదు. ‘పురాతన కళాఖండాలు మనకు శ్రేష్ఠమైనవిగా అనిపించడానికి వాటి ప్రాచీనత కారణం కాదు! అలాంటి క్లాసిక్స్ ఎప్పుడు చదివినా ఎంతో తాజాగానూ, శక్తిమంతంగానూ, ఆరోగ్యదాయకంగానూ అనిపించడం వల్లనే అవి క్లాసిక్స్ అయ్యాయి‘ అన్నాడు గోథే. ప్రతి విషయాన్ని చమత్కారంగా చెప్పే అమెరికన్ మహారచయిత మార్క్ ట్వైన్ మాత్రం క్లాసిక్స్‌నూ వదలలేదు! ‘ప్రతిఒక్కరూ చదవాలని అనుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ చదవని ఉద్గ్రంథాలే క్లాసిక్స్’ అన్నాడట ఆ మహానుభావుడు. అది తప్పని ఆయన విషయంలోనే రుజువైంది. హెమింగ్వేలాంటి వాళ్లు, ట్వైన్ రాసిన ‘హక్ల్ బెరీ ఫిన్’ నవలను క్లాసిక్‌గా పరిగణించిన మాట – దాన్ని చదవాలని ఒకప్పుడు మనమంతా ఉవ్విళ్లూరిన మాట నిజమే కదా! అంచేత, ఈ మాట అంటున్నప్పుడు మార్క్ ట్వైన్ తన గుబురు మీసాల మాటున నవ్వుకునే వుంటాడని గ్రహించాలి!! ఏతావాతా, దీర్ఘకాలం మనగలగడం ఒక్కటే క్లాసిక్స్ లక్షణం కాదు – కనీసం అది వాటి ప్రధాన లక్షణం కూడా కాదని తేలిపోయింది! జనజీవనంలో అనంతంగానూ, స్థిరంగానూ కొనసాగే కొన్ని ప్రమాణాలు క్లాసిక్స్‌లో ప్రముఖంగా కనిపించి తీరాలి. మానవమేధను మరింత రసవంతం చేసే లక్షణం దాంట్లో ఉండి తీరాలి. భూగోళమంతా విస్తరించుకుని వున్న మానవాళిలో ప్రతి నిత్యం దర్శనమిచ్చే భావావేశం క్లాసిక్స్‌లో పెల్లుబుకుతూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పుకుంటే, క్లాసిక్స్‌లో – ఏదో ఒక రూపంలో– మౌలికమైన, విస్తృతమైన, లోతైన ఆలోచన – అనుశీలన – ఆవిష్కరణ వ్యక్తమై ఉండాలి. టీయస్ ఇలియట్ లాంటి నవ్య సంప్రదాయవాదుల లెక్క ప్రకారం, క్లాసిక్స్‌లో అంతర్నిహితంగా నిర్దిష్ట నైతికబోధన ఉండాలి. పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో, ఈ ప్రతిపాదనను సమర్థించేవాళ్లకన్నా, పట్టించుకోనివాళ్లే ఎక్కువ! విషయమేమిటంటే, కొన్ని తరాలపాటు పాఠక లోకాన్ని ప్రభావితం చేసే లక్షణాలున్న గొప్ప పుస్తకాలన్నీ క్లాసిక్సే. ఉదాహరణకి గురజాడ ‘కన్యాశుల్కం’, చలం ‘మైదానం’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, దేవులపల్లి ‘కృష్ణపక్షం’, సురవరం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది!’, దాశరథి ‘అగ్నిధార’, నవీన్ ‘అంపశయ్య’ – ఇవన్నీ క్లాసిక్సే. నాలాంటి వాడికి మల్లారెడ్డి, రాంభట్ల, సినారె అనువదించిన ‘మఖ్దూం కవిత’, సదాశివ ‘యాది’ కూడా క్లాసిక్స్ గానే కనిపిస్తాయి! అవి ఫలానా దేశంలో, ఫలానా భాషలో, ఫలానా కాలంలో వెలువడి వుండాలనేం లేదు. మనం ఈ విషయం గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉండగానే, ఏదో గొప్ప క్లాసిక్‌కు శ్రీకారం చుట్టడం జరిగివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మాటకొస్తే, ప్రతి క్లాసిక్ అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు భాషల్లో పుడుతూ వచ్చిందే! నోబెల్ బహుమతో – లేదా పులిట్జర్ పురస్కారమో – లేదా బుకర్ ప్రైజో పొందిన రచనలే క్లాసిక్స్ అని ఎవరూ అనరు – అనలేరు! సామాన్యయుగానికి పూర్వం ఏడో శతాబ్దిలో హోమర్ గానం చేసిన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లకు ఏ నోబెల్ ప్రైజ్ వచ్చిందని అవి క్లాసిక్స్ కాగలిగాయి? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వాల్మీకి ‘రామాయణ’ కావ్యానికి ఏ పులిట్జర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వ్యాస ‘మహాభారత’ ఇతిహాసానికి ఏ బుకర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? అంతెందుకు – టాల్ స్టాయ్ రాసిన ‘ఆనా కెరినినా’ గానీ, ‘యుద్ధం–శాంతి’ గానీ ఏ పురస్కారానికీ నోచుకోలేదు. అవి క్లాసిక్స్ కాదనడానికి ఎవరికైనా గుండెలున్నాయా? ఇక, జేమ్స్ జాయిస్ రాసిన ‘యులిసెస్’కు ఏ బహుమతీ దక్కకపోగా తీవ్రమైన ఆంక్షల పోటులూ, సెన్సార్ కత్తెర వేటులూ మాత్రమే ప్రాప్తమయ్యాయి. అది మేలిరకం క్లాసిక్ సుమా! అని పనిగట్టుకుని చెప్పాలా? హోర్హే లూయీ బోర్హే రాసిన ‘ఫిక్షన్’కు నోబెల్ పురస్కారం దక్కకపోవడానికి, ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావడం అందరికీ తెలిసిందే! అంతమాత్రాన అది క్లాసిక్ కాకపోతుందా? ఈ జాబితా సుదీర్ఘమైంది. జార్జ్ ఆర్వెల్, వర్జీనియా వూల్ఫ్, చినువా అచెబే, స్కాట్ ఫిట్జెరాల్డ్ లాంటి మహా రచయితల రచనలెన్నో ఉన్నాయి అందులో! క్లాసిక్స్ అంటే ఏమిటో – స్థూలంగా – అర్థం చేసుకోవడానికి ఈ చర్చ సరిపోతుందనుకుంటా. -
Rachamallu Ramachandra Reddy: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!
విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! విమర్శకుల్లో రా.రా. మెథడాలజీని, మెథడ్‌ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది! ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్! ఈ విష యంలో ఫ్రాస్ట్‌కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్.ఎస్. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్ ఖయావ్ు, రబీంద్రనాథ్ టాగోర్ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్‌ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్ ఎట్ హార్ట్) అయివుండాలి!! దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి చెప్తూ ‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి. ‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా. రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! - మందలపర్తి కిశోర్ సీనియర్ పాత్రికేయుడు (నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి) -
శ్రావ్యంగా సొంత గొంతు!
పుస్తక పరిచయం రెండు పీహెచ్డీ పట్టాలు పుచ్చుకుని, తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక పరిశోధన విభాగం అధిపతిగా ఉన్న ఆచార్య కర్రి సంజీవరావును తెలిసినవాళ్లు కొన్ని వందల్లో ఉంటారేమో. కానీ, దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రగాఢమైన, అనుభూతి ప్రధానమైన కవిత్వం రాస్తూ, సొంత గొంతులో దళితానుభూతిని ఆవిష్కరిస్తూ, అప్పుడప్పుడు సాహితీమూర్తులకు శ్రద్ధాంజలి సమర్పించుకుంటూ వస్తున్న శిఖామణిని ఎరిగినవాళ్లు అనేక వేలల్లో ఉంటారు. ఈ మధ్యనే శిఖామణి మూడు పుస్తకాలు అచ్చేసి, విడుదల చేశాడు. వాటిల్లో ఒకటి 2013-15 మధ్యకాలంలో అచ్చయిన కవితల సంకలనం (పొద్దున్నే కవి గొంతు). మరొకటి, పీహెచ్డీ కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి తను సమర్పించిన పరిశోధన పత్రం (తెలుగు మరాఠి దళిత కవిత్వం). వేరొకటి ముప్పయి నాలుగు మంది సాహిత్య జీవులకు ఘటించిన నివాళి (స్మరణిక). వీటిల్లో చివరి పుస్తకాన్ని తన ‘పంచమాతృకల స్మృతికి’, ‘తెలుగు మరాఠి దళిత కవిత్వం’ కలేకూరి ప్రసాద్ (యువక) స్మృతికి అంకితమివ్వడం బావుంది. ఎన్ని రచనా రూపాల్లో తన ఉనికిని చాటుకున్నప్పటికీ, శిఖామణి ప్రాయికంగా కవి. అతని కవితా సంకలనాన్ని సాకల్యంగా పరిశీలిస్తే, శిఖామణి సాహితీ మూర్తిమత్వం ఆవిష్కృతమవుతుంది. అంతెందుకు -‘పొద్దున్నే కవిగొంతు’ పుస్తకంలోని ‘పులస స్వగతం’ కవిత చదివితే చాలు - అతని కవితాత్మ అర్థమైపోతుంది. (నా దగ్గిర ఇలాంటి మోక్షదాయికమైన సూక్ష్మాలు డజన్లకొద్దీ ఉన్నాయి. అవసరమైనవాళ్లు ఎప్పుడైనా సంప్రదించవచ్చు). కవి ఈ కవితా సంకలనాన్ని తన ‘గురువుగారు’ ఇస్మాయిల్‌కి అర్పించుకున్నాడు. తత్తుల్యుడైన కె.శివారెడ్డి గురించి రాసిన కవిత పేరే ఈ సంకలనానికి పెట్టుకుని తన ప్రపత్తి చాటుకున్నాడు. ఇస్మాయిల్ నుంచి శివారెడ్డి వరకూ విస్తరించిన సువిశాల కవితాత్మ శిఖామణిది. తర్వాత తర్వాత అది దళిత కవిత్వం వరకూ సాగింది, అది వేరే విషయం. తన రచనా సంవిధానం గురించి కవిగారు ఈ సంకలనంలో ఓ కవిత రాశాడు (వాక్యం పలకాలి). శిఖామణి రాసే పద్ధతిని నరేటివ్ రీతి అనొచ్చునేమో. ఇది కవిత్వం కట్టినట్లు ఉండదు. కథ చెప్పినట్లు ఉంటుంది. ఈ సంకలనంలోని తొట్టతొలి కవిత ‘మురమళ్ల రేవు’ దీనికి నిదర్శనంగా ఉంది. జానపద, పౌరాణిక రచనల్లో ఎక్కువ భాగం ఈ రీతిలో రాసినవే. మన భావుకవుల్లోనూ చాలామంది ఈ పద్ధతిలో రాశారు. శ్రీశ్రీ రాసిన ‘భిక్షు వర్షీయసి’, ‘బాటసారి’ లాంటివి కూడా ఇదే కోవకి చెందుతాయి. ఇక కుందుర్తి కథా కావ్యాలు రాయగా, శీలా వీర్రాజు ఏకంగా నవలా కావ్యమే(!) రాశారు. అయితే, శిఖామణి కవితలకీ ఇక్కడ చెప్పుకున్నవాటికీ రూపం వరకే పోలిక. సారం విషయానికొస్తే ఇతగాడు సమకాలీనుడు. ఈ సంకలనంలోని చిట్టచివరి కవిత ‘భీమ్ పాటే పాడతాను’ ఇందుకు రుజువు. ముప్పయ్యేళ్లలో పది కవితా సంకలనాలు విడుదల చేసిన శిఖామణి అదే ఉత్సాహం ఇక ముందు కూడా ప్రదర్శిస్తాడని ఆశ. ఒక చిన్నమాట - ఈ మూడు పుస్తకాల్లోనూ అడుగడుగునా అచ్చుపుచ్చులు వేధిస్తున్నాయి. ఆచార్యులవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. - మందలపర్తి కిషోర్ 8179691822 -
ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!
తాజా పుస్తకం: ఒకప్పుడు బెజవాడ చుట్టూ చాలా కొండలుండేవి. వాటి సిగపాయల్లో మరెన్నో శిఖరాలు మెరుస్తుండేవి. కాలపురుషుడు వాటిలో చాలావాటిని -ఉల్లిపాయలు తరిగినట్లు- నరికిపారేశాడు. కానీ, కొన్ని శిఖరాలు ఇప్పటికీ ఠీవిగా తలెత్తుకు తిరుగుతూనే ఉన్నాయి. కాలపురుషుడే కాదు- కాలయముడు కూడా మమ్మల్నేం చెయ్యలేడు అన్నట్లు నిటారుగా నిలిచివుండే శిఖరాలవి. ఈ మధ్యన బెజవాడ వెళ్లినప్పుడు అలాంటి శిఖరాల్ని చూసి ముచ్చటించి ఆనందపడ్డాను. ఏలూరు రోడ్డులోని సీతారాంపురంలో కనకదుర్గా సినిమాటాకీసు ఉండేది. అదిప్పుడు లేదు. అక్కడ కట్టిన అపార్టుమెంట్లలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటున్నారు. ఎంచేతో గానీ, సుబ్బరామయ్యగారు మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట, సీతారాంపురం - ఆ చుట్టుపక్కలే ఉంటుంటారు. ‘ఇది ఈ మధ్యన మొదలయిందేం కాదు- నేను ఎస్సారార్‌లో చదివే రోజుల్నించీ నాకిక్కడే అలవాటు. అప్పట్లో (విశ్వనాథ) సత్యనారాయణగారు ఇక్కడ ఉండడం వల్ల కావచ్చు. విశాలాంధ్రలో నా స్నేహితులు చాలామంది ఉద్యోగాలు చేస్తూండడం వల్ల కావచ్చు. నాకే కాదు- ఇంట్లో వాళ్లందరికీ ఈ ప్రాంతం అలవాటయిపోయినందువల్ల కావచ్చు. మొత్తానికి ఎక్కువభాగం ఇక్కడే ఉండిపోయాం. ఆ మాటకొస్తే, నా డెబ్బయ్యారేళ్ల జీవితంలో గట్టిగా పదేళ్లు తప్పిస్తే మిగతాదంతా బెజవాడలోనే గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలూ మరెన్నో తియ్యని అనుభూతులూ ఇక్కడే ఎదురయ్యాయి నాకు’ అన్నారు పెద్దిభొట్ల. ‘నేనీ ప్రపంచానికి ఏమివ్వగలిగానో ఎప్పుడూ పరామర్శించుకోలేదు. కానీ, ప్రపంచం మాత్రం నాపైన బోలెడంత కరుణ కురిపించింది. నేను డిగ్రీ ఇలా పూర్తి చేశానోలేదో లయోలా కాలేజ్ యాజమాన్యం నన్ను పిల్చి ట్యూటరు ఉద్యోగమిచ్చింది. అప్పట్లో రెవెన్యూ డిపార్టుమెంటులో గుమాస్తాలకు 48 రూపాయలిచ్చేవాళ్లు. అలాంటిది, లయోలావాళ్లు నాకు 116 రూపాయల నెలజీతంమీద ఉద్యోగమిచ్చారు. నిజానికి నాకు విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో ఫోర్తానర్సు చెయ్యాలని ఉండేది. కానీ, మా అమ్మ మాటమీద లయోలాలో చేరాలని -ఓ శనివారం ఉదయం- బయల్దేరా. దార్లో లీలా మహల్ బయట ఓ బోర్డు పెట్టిఉంది. సత్యజిత్ రాయ్ తీసిన ‘పథేర్ పాంచాలీ’ ఆ పూట ఒకే ఒక్క షో వేస్తున్నారట. బస్సుదిగి తిన్నగా వెళ్లి హాల్లో కూర్చుని, ఆటయ్యాక ఇంటికెళ్లిపోయా. సోమవారం నాడు లయోలాకు వెళ్లి ట్యూటరుగా చేరిపోయాను. అక్కడే రిటైరయినాను. ఈ మధ్యే మా కాలేజ్ వాళ్లు నన్ను పిల్చి సన్మానం చేసి -అదిగో, ఆ జ్ఞాపిక చేతికిచ్చి పంపించారు’ అంటున్నప్పుడు సుబ్బరామయ్యగారి మొహం -సంతృప్తితో కాదు, సంతోషంతో- తళతళలాడింది. ‘విషయమేమిటంటే, నాకు విశాఖ వెళ్లాలనుకున్నా వెళ్లివుండలేకపోవచ్చు. కానీ, పథేర్ పాంచాలీ సినిమా చూడదల్చుకున్నప్పుడు చూసేశాను! అంటే మంచి కథో మంచి సినిమానో అంటే ఉండే పిచ్చి అది. ఆ పిచ్చిని అర్థం చేసుకున్నారు కాబట్టే చెప్పిన టైముకు రాకపోయినా లయోలా ఫాదర్లు నా మీద కోపగించలేదు. సరిగదా, మా కాలేజ్‌లో ఓ మంచి రైటరున్నాడర్రా అని కేరళలో అందరికీ మచ్చటగా చెప్పుకునే వారట కూడా. అలాగే, నేనేదో నా బుద్ధికి తోచిన కథలేవో రాసుకుపోయానంతే. సెంట్రల్ సాహిత్య అకాడెమీ వాళ్లు బహుమతిచ్చారు. ఓ రోజు మధ్యాహ్నం భోంచేసి కూర్చున్నా. ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు. ‘నా పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ- మా అజోవిభొ ఫౌండేషన్ పురస్కారం మీకివ్వాలనుకుంటున్నాం!’ అన్నారాయన. అది చాలా పెద్దపేరున్న సంస్థ అని తెలుసు తప్ప వాళ్ల అడ్రెస్గానీ, కనీసం ఫోన్ నంబరుగానీ నాకు తెలీవు. అయినా పిల్చి పీటేయడం వాళ్ల ఔదార్యం’ అన్నారు పెద్దిభొట్ల తొణకని బెణకని ఆత్మ గౌరవంతో. ఆ తర్వాత సిద్ధార్థ కాలేజ్ దాటి, సున్నపు బట్టీల మీదుగా, క్రీస్తురాజపురం వైపు వెళ్తుంటే, ఓ సందులో ‘అభ్యాస’ స్కూలు బస్సులు కనిపించాయి. అదే సందులో సి.రాఘవాచారిగారిల్లుంది. వరవరరావులాంటి వాళ్లను మార్క్సిజం ప్రభావ పరిధిలోకి ఆకర్షించిన ప్రతిభ ఆయనది. అరవై దశకంలో పేట్రియాట్, లింక్ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాఘవాచారిగారు గొప్ప వ్యాఖ్యలను -రిపోర్టుల పేరిట- రాశారు. వాటి గురించి ‘అప్ కంట్రీ’ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉండడం కద్దు. ఇక, విశాలాంధ్ర పత్రికను తెలుగు సాంస్కృతిక జీవిత ప్రతినిధిగా దిద్దితీర్చడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. బెజవాడలో జరిగే చెప్పుకోదగిన సభలన్నింటికీ రాఘవాచారిగారే అధ్యక్షత వహించడం ఓ స్థానిక సంప్రదాయంగా పరిణమించింది. డైలీ జర్నలిజం నుంచి విరమించినప్పటికీ, ఇప్పటికీ, విజయవాడ మేధో జగత్సహోదరులకు పెద్దదిక్కుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ‘మాది వరంగల్లు. మా మేనమామలది పశ్చిమగోదావరి జిల్లా పెన్నాడ. తెలుగు సంస్కృతిలోని భిన్నత్వాన్నీ దాన్లోని ఏకత్వాన్నీకూడా చిన్నప్పుడే గ్రహించినవాణ్ణి నేను. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవనంలో అరుదయిన వ్యక్తులను అతిసన్నిహితంగా చూశాను. అది వరంగల్లులోని కాళోజీలే కావచ్చు- హైదరాబాద్‌లోని మఖ్దూం, రాజ్‌బహదూర్ గౌర్, మొహిత్ సేన్లే కావచ్చు- విజయవాడ వచ్చాకా విశాలాంధ్ర పెద్దలయిన చంద్రంగారూ, బలరామమూర్తిగారే కావచ్చు. సంపాదక ప్రముఖులు నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారే కావచ్చు. రాంభట్ల, మల్లారెడ్డి, బూదరాజులాంటి అభ్యుదయ రచయితలే కావచ్చు. వీళ్లలో ప్రతిఒక్కరితోనూ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది నాకు. ఆ బాంధవ్యం ప్రాతిపదికగానే మా స్నేహం మారాకు వేస్తూ వచ్చింది.’ అన్నారు రాఘవాచారి సగర్వంగా. ‘నేనన్నమాటకు అర్థం పైన చెప్పినవాళ్లతో నాకు భిన్నాభిప్రాయాలే లేవని కాదు సుమా!’ అని హెచ్చరించారాయన. ‘ఎప్పుడూ ఎవరితోనూ మూసకట్టు ‘అభిప్రాయభేదాలు’ పెంచుకోలేదన్నది నా పాయింటు. మన గీటురాళ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.’ ఆ తర్వాత చాలామాటలే నడిచాయి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. పెద్దిభొట్ల, రాఘవాచారి... ఇద్దరూ వయసు తాలూకు అలసటగాని అనారోగ్యపు అస్థిమితత్వాన్నిగాని లెక్క చేయకుండా హుషారుగా ఉన్నారు. దప్పికేసిన వాళ్లకు దాహం అందించే చలివేంద్రాల్లానే ఉన్నారు. దేశమంటే మట్టికాదు మనుషులు అంటే అర్థం అదే. ఒక ఊరంటే ఆ ఊరి మనుషులే. పర్లేదు. బెజవాడ భేషుగ్గానే ఉంది. - మందలపర్తి కిశోర్ 99122 29931


