కాన్పూర్: యూపీలోని ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న రెండు రోజుల ఏఐ మంథన్ 2.0 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఆనందీబెన్ పటేల్ శనివారం రైలులో కాన్పూర్ సెంట్రల్‌కు చేరుకున్నారు. ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె కాన్పూర్‌కు వచ్చారు. విశ్వవిద్యాలయంలో జరిగే ఏఐ మంథన్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించనున్నారు. శని, ఆదివారాలలో ఈ కార్యక్రమం జరగనుంది.
గవర్నర్ రైలులో కాన్పూర్‌కు రావడం విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ ఆమెకు స్వాగతం పలికారు. గతంలో జులై 9న జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా ఆనందీబెన్ పటేల్ రైలులోనే కాన్పూర్‌కు వచ్చారు. ఈసారి కూడా రైలు ప్రయాణానికే ప్రాధాన్యతనిచ్చారు. ఆమె నిర్ణయం నిరాడంబరతను ప్రోత్సహించే సందేశాన్ని ఇస్తోందని పలువురు అంటున్నారు.
ఏఐ మంథన్ 2.0లో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, పరిపాలనా రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రోబోటిక్స్, పాలన, పరిశోధన, ఉపాధి రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై చర్చించనున్నారు. ఐఐటీ, ఎయిమ్స్, బిట్స్ పిలానీ, గూగుల్, ఐబీఎం తదితర సంస్థలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
మంథన్‌లో పాల్గొనే అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కూడా రైలు ద్వారా లేదా ఒకే వాహనంలో కార్యక్రమానికి రావాలని గవర్నర్ సూచించారు. వేర్వేరు వాహనాల రాకపోకలను తగ్గించడం, సామూహిక ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ సూచన ఉద్దేశం.
రెండు రోజుల కార్యక్రమానికి విశ్వవిద్యాలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏఐ ఆచరణాత్మక వినియోగం, భారతదేశ భవిష్యత్తులో కృత్రిమ మేధ పాత్రపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను సిద్ధం చేయడం, పరిశోధన-ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కొత్త ఉపాధి అవకాశాలపై కూడా నిపుణులు మేధోమథనం చేయనున్నారు.
ఇదీ చదవండి: 5జీ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసి..


