భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే! | Viral Love Story: Cop Reunites Wife With Her School Day Sweetheart | Sakshi
Sakshi News home page

భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!

Sep 12 2026 11:08 AM | Updated on Sep 12 2026 11:08 AM

Viral Love Story: Cop Reunites Wife With Her School Day Sweetheart

వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..

ఈవీవీ డైరెక్షన్‌లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో.  ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్‌ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. 

లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్‌ దళ్‌ (PRD) జవాన్‌ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్‌ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు  ఒప్పుకోలేదు. 

బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..

సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.

అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు.  ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.

పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement