బీమా ఏజెంట్‌పై నా భర్త వ్యామోహం.. రూ.14 కోట్ల మోసం | Wife Cracks How a Rs 14 Cr Insurance Affair 180 Hotel Stays Unraveled | Sakshi
Sakshi News home page

బీమా ఏజెంట్‌పై నా భర్త వ్యామోహం.. రూ.14 కోట్ల మోసం

Sep 11 2026 5:37 PM | Updated on Sep 11 2026 6:11 PM

Wife Cracks How a Rs 14 Cr Insurance Affair 180 Hotel Stays Unraveled

చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని లియుజౌ నగరానికి చెందిన ఒక కుటుంబంలో చోటుచేసుకున్న వివాహేతర సంబంధం, భారీ ఆర్థిక మోసం చర్చనీయాంశంగా మారింది. గువో అనే వ్యక్తికి బీమా ఏజెంట్‌తో ఏడేళ్లపాటు సాగిన వివాహేతర సంబంధం న్యాయ వివాదానికి దారితీసింది. భర్య సుమారు రూ.14 కోట్ల మోసాన్ని గుర్తించి తిరిగి ఆ మొత్తాన్ని తనకు చెల్లించాలంటూ బీమా కంపెనీపై దావా వేసింది.

గువో తన భార్య జెన్‌తో కలిసి రెండేళ్ల కుమార్తెతో జీవిస్తున్నాడు. 2017లోనే గువో తనకంటే ఎనిమిదేళ్లు చిన్నదైన బీమా ఏజెంట్‌ లీతో సన్నిహితంగా ఉంటూ, సందేశాలు పంపుకుంటున్న విషయం భార్య జెన్‌ గుర్తించింది. ఈ సందేశాల్లో మిస్ యూ వంటి మాటలతోపాటు, చైనీస్ భాషలో ఐ లవ్ యూకు సూచికగా భావించే 520 యువాన్ల మొత్తాన్ని పలుమార్లు బదిలీ చేసినట్లు తేలింది. అప్పట్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జెన్‌, 2024లో ఆసుపత్రిలో చేరినప్పుడు నిజం బయటపడింది. తనకు, తన కుమార్తెకు గువో ఇప్పటికే వైద్య బీమా పాలసీలు తీసుకున్నట్లు, అవి కూడా అదే బీమా ఏజెంట్‌ లీ ద్వారానే జారీ అయినట్లు జెన్‌ కనుగొంది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఇంకా కొనసాగుతున్నట్లు అనుమానం బలపడింది.

లోతుగా విచారించగా ఏడేళ్ల వ్యవధిలో గువో, లీకు 30 లక్షల యువాన్లకు పైగా (సుమారు 4.47 లక్షల డాలర్లు) బదిలీ చేసినట్లు జెన్‌ లెక్కతేల్చింది. ఇంతటితో ఆగకుండా బీమా రికార్డుల ప్రకారం గువో లీ ద్వారా 50కి పైగా పాలసీలు తీసుకున్నాడని, వాటికి ప్రీమియంల రూపంలో కోటి యువాన్లకు పైగా (సుమారు 15 లక్షల డాలర్లు, రూ.14 కోట్లకు పైగా) చెల్లించినట్లు వెల్లడైంది. జెన్, తన భర్త గువో ఆర్థిక లావాదేవీలను లోతుగా విచారించే క్రమంలో గువో-లీ ఇద్దరూ ఏడేళ్ల వ్యవధిలో 180 సార్లు వేర్వేరు హోటళ్లలో కలుసుకున్నట్లు ఆధారాలు సేకరించింది.

దీంతో జెన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భర్త గువో, ఏజెంట్‌ లీ, బీమా సంస్థపై దావా వేసింది. ప్రీమియం మొత్తాన్ని తిరిగివ్వాలని, లీ తీసుకున్న 30 లక్షల యువాన్లను వాపసు చేయాలని కోరింది. అయితే లీ మాత్రం అక్రమ సంబంధాన్ని పూర్తిగా ఖండించి 180 సార్లు హోటళ్లలో కలుసుకున్నది కేవలం వ్యాపార చర్చల కోసమేనని వాదిస్తోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement