వాల్‌మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆహార పంపిణీ (ఫుడ్ డెలివరీ) విభాగంలోకి అడుగుపెడుతోంది. ‘ఈట్ ఇన్’ పేరుతో కొత్త సర్వీసును బెంగళూరులో తన ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. సెప్టెంబర్ 15 నాటికి ఈ సేవను నగరంలోని మొత్తం ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు, ఆ తర్వాత సాధారణ వినియోగదారులకూ విస్తరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఈ సర్వీసు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన యాప్‌లోనే అందుబాటులో ఉంటుందని, వ్యాపారం విస్తరించిన తర్వాత ప్రత్యేక యాప్‌ను తీసుకురావచ్చని సంస్థవర్గాలు తెలిపాయి.
జొమాటో, స్విగ్గీ ఆధిపత్యంలో ఉన్న ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించడంతో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. ఇప్పటికే ర్యాపిడో తన ‘ఓన్లీ’ సర్వీసుతో జీరో కమిషన్ మోడల్ ద్వారా బెంగళూరులో రోజుకు 50 వేలకు పైగా ఆర్డర్లు అందుకుంటుంది. నగరం మొత్తం రోజువారీ ఆర్డర్లలో దాదాపు 10 శాతం వాటా సంపాదించింది. మరోవైపు స్విగ్గీ ‘టోయింగ్’ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకురాగా, జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ తక్కువ ధరల ఆప్షన్లతో పాటు ‘బిస్ట్రో’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ నమూనాను అభివృద్ధి చేస్తోంది.
జులైలోనే ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, కంపెనీ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశిస్తుందని, తొలుత పరిమిత స్థాయిలో పరీక్షించి వినియోగదారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ధర మాత్రమే కాకుండా ఎంపిక, సేవా నాణ్యత, విశ్వసనీయతపైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) భాగస్వామ్యంతో ‘ఈట్ ఇన్’ను రూపొందిస్తున్న ఫ్లిప్‌కార్ట్, రెస్టారెంట్లకు కమిషన్ నిర్మాణాన్ని అందించే యోచనలోనూ ఉంది. ఉద్యోగుల పైలట్ దశ విజయవంతమైతే బెంగళూరు తర్వాత ఇతర నగరాలకూ ఈ సేవను విస్తరించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బొజ్జ గణపయ్య రూపంలో బిలియనీర్ సీక్రెట్స్!


