బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు! | SGB Investors Strike Gold, 2019-20 Series X Delivers Massive Returns As Early Redemption Opens, Check More Details | Sakshi
Sakshi News home page

బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!

Sep 11 2026 4:22 PM | Updated on Sep 11 2026 5:05 PM

SGB Investors Strike Gold 2019 20 Series X Yields Massive Return On Early Exit

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఇందులో పెట్టుబడులు పెట్టినవారు భారీ లాభాలను పొందుతున్నారు. కేవలం ఫిజికల్ గోల్డ్ కొన్నవాళ్లు మాత్రమే కాకుండా.. గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి రాబడి వచ్చింది. ముఖ్యంగా 2020లో సావెరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు పెట్టుబడిపై భారీ లాభం కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే సావెరిన్ గోల్డ్ బాండ్లు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఇందులో.. మనం నేరుగా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎన్ని గ్రాముల బంగారానికి పెట్టుబడి పెడతామో, దానికి అనుగుణంగా బాండ్లు మనకు లభిస్తాయి. బంగారం ధర పెరిగితే ఈ బాండ్ల విలువ కూడా పెరుగుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది.

గ్రాముపై రూ.11,118 లాభం
2020 మార్చి 11న జారీ చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ Xలో.. ఒక గ్రాము బంగారం ధర రూ.4,210గా ఉంది. ఇప్పుడు 2026 సెప్టెంబర్ 11న ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో ఒక గ్రాము బంగారం విలువ రూ.15,328గా నిర్ణయించారు. అంటే 4,210 రూపాయలతో కొనుగోలు చేసిన ఈ బాండ్ విలువ.. ఇప్పుడు రూ.15,328కు చేరింది. అంటే ఒక్క గ్రాముపై రూ.11,118 లాభం (దాదాపు 264 శాతం వరకు రాబడి) అన్నమాట.

ఉదాహరణకు 2020లో ఒక వ్యక్తి రూ.1 లక్షను ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు అతనికి సుమారు 23.75 గ్రాముల విలువైన SGB యూనిట్లు లభించేవి. ఇప్పుడు ఒక్క గ్రాము రూ.15,328 చొప్పున లెక్కిస్తే వాటి విలువ సుమారు రూ.3.64 లక్షలకు చేరుతుంది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి దాదాపు రూ.3.64 లక్షలుగా మారినట్లు అర్థం.

వడ్డీ కూడా..
ఇక్కడ మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. సావెరిన్ గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని కూడా చెల్లిస్తుంది. ఈ వడ్డీని సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అంటే.. పెట్టుబడిదారుడికి బంగారం ధర పెరగడం ద్వారా ఒకవైపు లాభం వస్తే, మరోవైపు వడ్డీ రూపంలో కూడా ఆదాయం లభిస్తుంది.

సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం ఎనిమిది సంవత్సరాలు. అయితే.. ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొన్ని నిర్ణీత తేదీల్లో ముందుగానే రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 2020లో జారీ చేసిన ఈ బాండ్లకు ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement