‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, రాగి ధరల కదలికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాధారణంగా బంగారం, రాగి ధరలు భిన్నమైన ఆర్థిక సంకేతాలను ఇస్తాయని కియోసాకి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పారిశ్రామిక డిమాండ్ కారణంగా రాగి ధర పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతారని వివరించారు.
అయితే ప్రస్తుతం బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరుగుతుండటం విస్మరించలేని పరిణామమని కియోసాకి అన్నారు. గతంలో 1978, 1998, 2006 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయని ఆయన తన పోస్ట్‌లో గుర్తుచేశారు. ఆ తర్వాత 1980 మార్కెట్ కల్లోలం, డాట్‌కామ్ బబుల్ పతనం, 2008 ఆర్థిక సంక్షోభం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం మాత్రమే కాదు.. నమ్మకం కోల్పోతున్నారా?
బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరగడం కేవలం ద్రవ్యోల్బణానికి సంబంధించిన సంకేతం కాకపోవచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ ఆస్తులు, కరెన్సీలపై ప్రజలు గతంలో ఉన్నంత నమ్మకంతో లేకపోవడానికి ఇది సంకేతం కావచ్చని అన్నారు. స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు అన్నీ ఒక రకంగా భవిష్యత్తుపై ఆధారపడిన ‘వాగ్దానాలు’ వంటివేనని, నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడులు హార్డ్ అసెట్స్ వైపు మళ్లే అవకాశం ఉందని వివరించారు.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2022, 2023 సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఒక్కో ఏడాది 1,000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయని కియోసాకి పేర్కొన్నారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు దశల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు.
భయపడొద్దు.. సిద్ధంగా ఉండాలి
ప్రస్తుత పరిణామాలు మార్కెట్లు ‘పానిక్’లో ఉన్నాయని చెప్పడం లేదని, అయితే పెట్టుబడిదారులకు ‘సిద్ధంగా ఉండండి’ అనే సంకేతాన్ని ఇస్తుండవచ్చని కియోసాకి అన్నారు. బంగారానికి ప్రభుత్వ హామీ అవసరం లేదని, వెండికి కూడా ప్రభుత్వ వాగ్దానంపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాగికి పారిశ్రామికంగా నిరంతర డిమాండ్ ఉందని తెలిపారు.
ఈ పరిణామాలను అర్థం చేసుకునే వారు భయపడరని, భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధమవుతారని కియోసాకి చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని సహజంగా భావించకుండా, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేలా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ముఖ్యమని సూచించారు.


