గ్లోబల్ టెక్నాలజీ, కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో భారీ ఆఫీస్ లీజింగ్ డీల్ కుదుర్చుకుంది. థానేలోని హీరానందాని ఎస్టేట్‌లో ఉన్న ‘సెంటారస్’ కమర్షియల్ టవర్‌లో సుమారు 2.72 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-ఏ కార్యాలయ స్థలాన్ని 10 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపు రూ.269 కోట్లుగా ఉంది. నెలవారీ అద్దె సుమారు రూ.1.9 కోట్లుగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ కార్యాలయ స్థలం ‘హౌస్ ఆఫ్ హీరానందాని’ అభివృద్ధి చేసిన హీరానందాని ఎస్టేట్ టౌన్‌షిప్‌లోని సెంటారస్ టవర్‌లో ఉంది. ఈ భవనంలోని మూడు పక్కపక్కనే ఉన్న అంతస్తుల్లో యాక్సెంచర్ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ లీజింగ్ ఒప్పందాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా కుదిర్చింది. ఈ ఏడాది థానేలో నమోదైన అతిపెద్ద కార్యాలయ లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలిచింది.
21 అంతస్తుల సెంటారస్ భవనంలో మొత్తం నిర్మిత విస్తీర్ణం సుమారు 19 లక్షల చదరపు అడుగులు. హీరానందాని ఎస్టేట్‌లోని 375 ఎకరాల టౌన్‌షిప్‌లో ఈ వాణిజ్య ప్రాజెక్టు ఉంది. ఇప్పటికే ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బీఎన్‌పీ పరిబాస్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బేయర్ క్రాప్‌సైన్స్, వీవర్క్ వంటి ప్రముఖ సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి.
పెద్ద కంపెనీలు ముంబై ప్రధాన ప్రాంతాలతో పాటు థానే, నవి ముంబై వంటి అభివృద్ధి చెందుతున్న వాణిజ్య ప్రాంతాల్లో భారీ కార్యాలయ స్థలాలను ఎంచుకుంటుండటానికి ఈ ఒప్పందం మరో ఉదాహరణ. ముఖ్యంగా ప్రతిభావంతులైన ఉద్యోగుల లభ్యత, మౌలిక సదుపాయాలు, ఖర్చుల పరంగా అనుకూలత వంటి అంశాలు ఈ ప్రాంతాలపై సంస్థల ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజా మార్కెట్ గణాంకాలు కూడా ముంబై ఆఫీస్ మార్కెట్‌లో డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి. జేఎల్‌ఎల్ డేటా ప్రకారం 2026 జనవరి–జూన్ మధ్య ముంబైలో మొత్తం ఆఫీస్ లీజింగ్ 5.88 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇది 2025 ఇదే కాలంలోని 4.99 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 18 శాతం అధికం.


