పల్లెటూరిలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రతిభావంతురాలిగా ఎదిగింది, ఐటీ కంపెనీలో కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగం సంపాదించింది. హావేరి జిల్లాకు చెందిన రైతు మంజునాథ్ కూతురు సృష్టి దక్షిణ కన్నడ జిల్లాలో బీటెక్ కోర్సు పూర్తి చేసింది. ప్రముఖ సంస్థ వీసా లో రూ.46.33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొందింది. ఆమె అదే సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు.
-బెంగళూరు
పేపర్ లీక్.. రిసార్టుల్లో పరీక్ష
బెంగళూరు: కేపీఎస్‌సీలో ఉద్యోగాల అక్రమాలలో కొత్త కొత్త సంగతుల బయటపడుతున్నాయి. డబ్బులిచ్చిన అభ్యర్థులు రిసార్టుల్లో జల్సాగా పరీక్షలు రాశారని బయటపడింది. ఈ కేసుల్లో ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ను ఏ1గా, కేపీఎస్‌సీ సభ్యులను ఏ2గా, అధికారులను ఏ3గా, ఎంపికైన 29 మంది అభ్యర్థులను ఏ4గా, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ను ఏ5గా ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ అధికారులు చేర్చారు. జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజ్ కన్నాళెలను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న లావాదేవీలు, అభ్యర్థులతో లింకులు తదితరాలపై విచారణ చేపట్టారు. వీరితో పాటు అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేస్తారు. బసవరాజ్ మొబైల్‌ఫోన్ కాల్ డేటాతో పాటు సాక్ష్యాధారాలను బట్టి దర్యాప్తు సాగిస్తున్నారు.
చక్రం తిప్పిన బసవరాజు
బసవరాజ్ కన్నాళె 29 పశువైద్యుల పోస్టులను ఒక్కొక్కటి రూ.80 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో కాకుండా రిసార్టుకు ప్రశ్నాపత్రాన్ని తెప్పించుకుని భర్తీచేశారు. జ్ఞానేంద్రకుమార్ బీదర్‌లో పనిచేసిన సమయంలో బసవరాజ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. తాను ఎమ్మెల్యేని అవుతానని బసవరాజ్ ప్రచారం చేసుకునేవాడు. 29 మంది అభ్యర్థుల నుంచి ముందే డబ్బులు వసూలు చేసి పేపర్‌ను లీక్ చేసి ఇచ్చాడని విచారణలో బయట పడింది. బెంగళూరు రాజాజీనగర కార్యాలయంలో డీల్ కుదుర్చుకున్నారు. బెంగళూరు, తుమకూరు జిల్లా దేవరాయనదుర్గ, ఆంధ్రప్రదేశ్‌లోని రిసార్టుల్లో అభ్యర్థులను కూర్చోపెట్టి పరీక్ష రాయించారని సమాచారం. 10 మంది అభ్యర్థులు తప్పు ఒప్పుకుని అంతా చెప్పేస్తామని సీఐడీకి తెలిపారు.
చదవండి: గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు


