ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి! | Legal Advice: Legal Rights of Children with Autism | Sakshi
Sakshi News home page

ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!

Sep 2 2026 10:10 AM | Updated on Sep 2 2026 10:40 AM

Legal Advice: Legal Rights of Children with Autism

మా అక్క–బావ రెండేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వాళ్లకి పదహారేళ్ళ పాప వుంది. తనకి ఆటిజం. మాటలు కూడా సరిగా రావు. మనం చెప్పేది కూడా ఏమీ అర్థం కాదు. అక్కాబావా చనిపోయాక పాప తన నానమ్మ గారింటిలోనో ఉంటోంది. అప్పట్లో ఒక స్పెషల్‌ స్కూల్‌కి వెళ్ళేది. ఇప్పుడు అది కూడా మాన్పించారు. 

ఇటీవల అమ్మాయి వంటి మీద గాయాలు కనిపించాయి. ‘ఆస్తికోసమే పాపని వుంచుకున్నాము, లేకపోతే ఎప్పుడో రోడ్డుమీద వదిలేసేవాళ్ళం’ అని మా బావగారి తమ్ముడు ఎవరితోనో అనటం విన్నాను. నాకు అమ్మ–నాన్న, తోబుట్టువులూ ఎవరూ లేరు. నా భర్తని అడిగితే పాపపై మనకు హక్కులు లేవు – మనం ఏమీ చేయలేము అంటున్నారు. పాపను కాపాడుకోవటం ఎలాగో సలహా ఇవ్వగలరు. 
– సరోజ, మల్కాజిగిరి, హైదరాబాద్‌

ఆటిజం కల్గినవారు జీవితాంతం దాదాపు పిల్లలే! మానసిక ఎదుగుదల లేకపోవటం వలన ఆటిజం బారిన పడిన పిల్లల గాధలు – ముఖ్యంగా వారి తల్లిదండ్రులు/బాగోగులు చూసుకునే వారు లేనప్పుడు పడే కష్టాలు వర్ణనాతీతం. ఆటిజం వున్న వారి హక్కులు – బాగోగులు – ఆస్తులు – పెంపకం – కస్టడీకి సంబంధించిన అంశాలకు గాను ‘ఆటిజం, సెరిబ్రల్‌సాల్సీ, మానసిక వెనుకబాటు, బహుళ వైకల్యాల వ్యక్తుల సంక్షేమం కోసం జాతీయ ట్రస్ట్, 1999 అనే చట్టం వుంది. 

ఈ చట్టం ప్రకారం, 18 యేళ్ళ లోపు వయసుగల ఆటిజం వున్న పిల్లల కస్టడీ తల్లిదండ్రులకి ఉన్నప్పటికీ – వారి వయసు 18 యేళ్ళు దాటిన తర్వాత ఎవరైనా గార్డియన్‌గా ఉండటానికి దరఖాస్తు చేసుకోవాలి. తల్లి–తండ్రులు లేదా కుటుంబ సభ్యుల దరఖాస్తు మేరకు ఏ వ్యక్తినైనా, రిజిస్టర్‌ చేయబడిన స్వచ్ఛంద సంస్థను అయినా: ఆటిజం, సెరిబ్రల్‌పాల్సీ వంటి సమస్యలు కల్గిన వారికి గార్డియన్‌గా నియమించ వచ్చు. అంతే కాక ది రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌ యాక్ట్‌ 2016 కూడా ఇలాంటి అంశాలలో పాత్ర పోషిస్తుంది.

మీ విషయానికి వస్తే...నేషనల్‌ ట్రస్ట్‌ యాక్ట్‌ 1999 లోని సెక్షన్‌ 17 ప్రకారం ఎవరైనా ఆటిజం, సెరిబ్రల్‌పాల్సీ వంటి సమస్యలు కల్గిన వారి తల్లిదండ్రులు లేదా బంధువు లేదా నమోదిత సంస్థ దృష్టికి ఎవరైనా గార్డియన్‌ (సంరక్షులు) (1) దివ్యాంగులను వేధిస్తున్నారని లేదా నిర్లక్ష్యం చేస్తున్నారని; లేదా (2)  దివ్యాంగులకి సంబంధించిన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారని లేదా నిర్లక్ష్యం చేస్తున్నారని – తెలిస్తే చట్టంలో నిర్దేశించిన విధంగా అటువంటి సంరక్షకుడిని తొలగించవలసిందిగా కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకుగాను లోకల్‌ లెవల్‌ కమిటీ (LCC) ని సంప్రదించవలసి ఉంటుంది. 

కొన్ని సందర్భాలలో, 2016 చట్టం ప్రకారం కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. కాబట్టి మీ అక్క కూతురి భద్రతకు – తన ఆస్తికి సైతం ఎటువంటి భంగం కల్గుతున్నది అని మీకు అనుమానం వున్నా, LCC ముందు దరఖాస్తు చేసుకోండి. ఈ చట్టం క్రింద LCCకి అధికారాలు ఉంటాయి కనుక మీ అక్క కూతురిని సురక్షితంగా మీ వద్దకు చేర్చే అవకాశం లేకపోలేదు. లేకుంటే ఏదైనా నిర్దిష్ట సంస్థ పర్యవేక్షణలో కూడా ఉంచగలరు. ఆటిజం వంటి పరిస్థితిని ఎదుర్కొనే వారు వున్న తల్లిదండ్రులు/కుటుంబ సభ్యులు అందరూ కూడా వారికి వర్తించే చట్టాలు – హక్కులపై కనీస అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. ) 

(చదవండి: మిస్ వరల్డ్ ఉగాండా గౌనులో ఇంత గొప్ప సందేశమా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement