కఠ్మాండు: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు కఠ్మాండులోని పలు ఆర్ట్ గ్యాలరీలు వినూత్న రీతిలో ముందుకొచ్చాయి. కళాకారుల పెయింటింగ్‌లను విక్రయించి, ఆ నిధులతో బాధితులకు ఆహారం, తాగునీరు, ఆశ్రయం కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
ఆగస్టు 26న భోటేకోశి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు రసువా, నువాకోట్, దాదింగ్ జిల్లాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా, ఇళ్లు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితుల సహాయార్థం దర్బార్ మార్గ్‌లోని ‘గ్యాలరీ 108’ సంస్థ ‘ఆర్ట్ కెన్ డూ మోర్’ పేరుతో పెయింటింగ్ విక్రయాలను చేపట్టింది. కళాకారులు విరాళంగా అందజేసిన దాదాపు 20 చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. రూ.6,000 నుంచి రూ.50,000 వరకు ధర గల ఈ కళాఖండాల ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల నిధులు సమకూరినట్లు సంస్థ వ్యవస్థాపకుడు సుగత్ రత్న శాక్య తెలిపారు.
చిత్రాలు అమ్ముడుపోగానే ఆ మొత్తాన్ని నేరుగా ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి జమ చేస్తున్నారు. కఠ్మాండులో లేనివారు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చని, అమ్ముడుపోని కళాఖండాలను నవంబరు 30 వరకు ప్రదర్శనలో ఉంచి అనంతరం కళాకారులకు తిరిగి అందజేస్తామని వివరించారు. అలాగే థామెల్‌లోని ‘ది కలా సెలూన్’ గ్యాలరీ సైతం ఈ తరహా సహాయ కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీలంక కళాకారుడు డాక్టర్ మనోరంజన హేరత్ బండార, స్థానిక కళాకారిణి జెన్నీ డాంగోల్ అందజేసిన చిత్రాల విక్రయం ద్వారా ఆగస్టు 31 నుంచి ఇప్పటివరకు రూ.20,000 సేకరించినట్లు వ్యవస్థాపక డైరెక్టర్ సోఫియా ఎల్ పాండే వెల్లడించారు.
బాధితుల సహాయార్థం ప్రతి విక్రయానికి సంబంధించిన బ్యాంక్ బదిలీ రసీదును కొనుగోలుదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. కళాఖండాలను కొనుగోలు చేయలేని వారు ఆహారం, దుస్తులు, సౌర ఫలకాలు, టార్పాలిన్ల వంటి వస్తు రూపేణా సహాయం అందించవచ్చని గ్యాలరీ నిర్వాహకులు సూచించారు. నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వ్యక్తిగత ఖాతాలకు నగదు పంపకుండా, గుర్తింపు పొందిన సహాయ సంస్థలకే అందించాలని దాతలకు సూచించారు. ఆసక్తి గల దాతలు సోషల్ మీడియా, ఫోన్ ద్వారా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు


