Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్‌ బెల్‌ | Nepal Flash Floods Second Disaster Warning, 157 Dead And 133 Indian Mansarovar Pilgrims Missing, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్‌ బెల్‌

Aug 27 2026 7:06 AM | Updated on Aug 27 2026 12:37 PM

Nepal Flood Fury: Second Disaster Warning After Deadly Flash Floods

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. రాసువా జిల్లాలో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో 162 మంది మృతి చెందారు(ఇప్పటిదాకా). వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అందులో కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం.

భోట్‌ కోషి, త్రిశూలి నదీ వ్యవస్థల్లో ఒక్కసారిగా వచ్చిన వరదలు భారీగా మట్టి, రాళ్లు, బండరాళ్లను కొట్టుకొచ్చాయి. ఉదయం 9 గంటల సమయంలో టిబెట్‌ వైపు నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం నేపాల్‌లోని రాసువా, ధాదింగ్‌, నువాకోట్‌ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి నేపాల్‌లో రవాణా, విద్యుత్‌ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం 19 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రాసువాగఢి సరిహద్దు మార్గం కూడా ధ్వంసమైంది. ఎనిమిది జలవిద్యుత్‌ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇందులో రాసువాగఢి, సంజెన్‌ ఖోలా, అప్పర్‌ త్రిశూలి-3ఏ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

మరో వరద ముప్పు.. ఐసీఎంఓడీ హెచ్చరిక
హిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెన్‌ డెవలప్‌మెంట్‌ (ICIMOD) కీలక హెచ్చరిక జారీ చేసింది. వరదకు కారణమైన ప్రాంతంలో ఇంకా ఓ భారీ నీటి అడ్డంకి కొనసాగుతోందని, అది తెగిపోతే మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.

ఐసీఎంఓడీ వాతావరణ, పర్యావరణ ప్రమాదాల వింగ్‌ చీఫ్‌ కియాంగ్‌గాంగ్‌ జాంగ్‌ మాట్లాడుతూ.. గతేడాది వరదలు సంభవించిన ప్రాంతమే మళ్లీ ప్రమాదంలో ఉందన్నారు. లెండే ఖోలా ప్రాంతంలో మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని తెలిపారు.

గతేడాది కూడా ఇదే లెండే ఖోలా ప్రాంతం భారీ వరదలకు గురైంది. 2025 జూలైలో టిబెట్‌ సరిహద్దు సమీపంలో గ్లేసియర్‌ సరస్సు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు దిగువకు ప్రవహించాయి. ఈ వరద భోటే కోషి నదిలో కలసి రాసువా ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ వరదల్లో 15 మంది దాకా మరణించారు. రాసువాగఢి సరిహద్దు వంతెన, రహదారులు, పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నుంచి కోలుకోకముందే ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నిమిషాల్లోనే పెరిగిన నదీ ప్రవాహం
అయితే తాజా ఫ్లాష్‌ఫ్లడ్స్‌కు తీవ్రతకు నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. త్రిశూలి నదిలోని గల్చి ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల మేర పెరిగింది. మాలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన నీరు, మట్టి, మంచు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.

భూకంపం కాదు.. కొండచరియల కదలికగా గుర్తింపు
తొలుత ఈ విపత్తుకు కారణం భూకంపం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) విశ్లేషణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 5.2 తీవ్రతతో నమోదైన సీస్మిక్‌ సంకేతాలు వాస్తవానికి భూకంపం వల్ల కాకుండా భారీ కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడినవిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు కదలడంతో భూకంప తరంగాల్లాంటి సంకేతాలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

మంచు కొండ కూలి.. లోయలోకి దూసుకొచ్చిన విపత్తు
శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా నిపుణులు చేస్తున్న ప్రాథమిక అంచనాల ప్రకారం.. హిమనదంలోని దిగువ భాగం విరిగిపడి వందల మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మంచు-రాళ్ల భారీ దిబ్బ లెండే ఖోలా నదిలో పడటంతో ఒక్కసారిగా నీరు, బురద, భారీ బండరాళ్లతో కూడిన వరద ప్రవాహం దిగువకు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

చైనా వైపునా విధ్వంసం.. గ్యిరోంగ్‌ పోర్టుకు భారీ నష్టం
వరద ప్రభావం నేపాల్‌కే పరిమితం కాలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. మట్టి, రాళ్ల ప్రవాహంతో రహదారులు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, విద్యుత్‌ సరఫరా దెబ్బతిన్నాయి. చైనా అధికారులు గ్యిరోంగ్‌ పోర్టు ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలకు చేరుకోవడం కష్టంగా మారింది.

భారతీయ యాత్రికుల కోసం ఆందోళన
వరదల్లో గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. నేపాల్‌ పర్యాటక శాఖ ప్రకారం 400 మందికి పైగా పర్యాటకుల ఆచూకీ కొంతకాలం తెలియలేదు. ఇందులో 133 మంది భారతీయ కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 57 మంది ఎన్నారైలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్‌ రక్షణ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బురదలో కూరుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నేపాల్‌కు భారత్‌ సాయం
విపత్తు నేపథ్యంలో భారత్‌ వెంటనే స్పందించింది. సహాయక సామగ్రి, వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని భారత వైమానిక దళం నేపాల్‌కు పంపించింది. 10 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్లు సమాచారం. భారత ప్రదాని నరేంద్ర మోదీ జలప్రళయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ప్రజలు ఎదుర్కొంటున్న నష్టం ఎంతో బాధాకరం. ప్రభుత్వం తన పూర్తి వనరులతో సహాయక చర్యలు చేపడుతోంది’’ అని తెలిపారు.

తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతు
వరద ప్రభావిత ప్రాంతాల్లో విదేశీయులు కూడా చిక్కుకున్నారు. నేపాల్‌లోని ఓ జలవిద్యుత్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతైనట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో పది మంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తెలిపింది. వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తోంది.

కైలాస్‌ యాత్రకు తీవ్ర అంతరాయం
నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు మార్గం మూసుకుపోవడంతో కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రపై తీవ్ర ప్రభావం పడింది. రాసువాగఢి-కెరుంగ్‌ మార్గం పూర్తిగా దెబ్బతింది. వంతెనలు కొట్టుకుపోవడం, రహదారులు ధ్వంసం కావడంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రైవేటు మార్గాల్లో వెళ్లిన వందలాది మంది యాత్రికుల కాంటాక్ట్‌ తెగిపోవడంతో ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులపై ఆందోళన
కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రలో ఉన్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది సభ్యులు టిబెట్‌లోని గ్యిరోంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న సమయంలో వరదలు సంభవించాయని ఆ సంస్థ తెలిపింది. వారి పరిస్థితి, ఆచూకీపై అధికారిక సమాచారం అందలేదని సంస్థ వ్యవస్థాపకుడు సద్గురు తెలిపారు. తమ బృందాలు అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.

భారత్‌లోనూ అప్రమత్తత.. బిహార్‌, యూపీకి వరద అలర్ట్‌
నేపాల్‌ నుంచి వచ్చే వరద నీటితో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బిహార్‌లో గండక్‌ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ పెంచారు. వాల్మీకినగర్‌ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, కుషీనగర్‌ జిల్లాల్లోనూ అలర్ట్‌ జారీ చేశారు.

ప్రస్తుత వరదతో ప్రమాదం ముగిసిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెండే ఖోలా ప్రాంతం ఎగువన ఇంకా నీటి అడ్డంకి కొనసాగుతున్నట్లయితే అది ఎప్పుడైనా తెగిపోయి మరో భారీ వరదకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: విమానంలో వచ్చి.. మనిషిని చంపిన దోమ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement