breaking news
Glaciares
-
తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత?
హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మనల్ని భయపెడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది. తుర్కియే, సిరియాల్లో భూకంపం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతకీ భారత్‌కి ఉన్న ముప్పు ఎంత ? నేలకింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే, మిన్ను విరిగి మీదపడినట్టు ఆకాశన్నంటే భవనాలు కుప్పకూలిపోతే, మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం..? తుర్కియే, సిరియాల్లో కుదిపేసిన పెను భూకంపంతో భారత్‌కు భూకంపం ముప్పు ఎంత అనే చర్చ జరుగుతోంది. తుర్కియే భూకంపాన్ని ముందే అంచనా వేసిన డచ్ అధ్యయనకారుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో త్వరలో భూకంపం వస్తుందని హెచ్చరించడం గుబులు రేపుతోంది. మన దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. తీవ్ర ముప్పులో ఢిల్లీ ఢిల్లీ, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్‌కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూపొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్‌గా ఉన్న సొహనా, మథుర, ఢిల్లీ–మొరాదాబాద్ వల్ల కూడా ఢిల్లీ ప్రమాదంలో ఉంది. హిమాలయాలు యమాడేంజర్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలను పెను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో 2,400 కి.మీ. పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండే అవకాశం ఉంది. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్‌పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తిడి ఉంది. ఫలకాలు కదులుతూ ఉండడం వల్ల అంచులపై ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా భూకంపం రావొచ్చు లేదంటే 200 ఏళ్ల తర్వాత తర్వాతైనా రావచ్చునని, ఇది మధ్య హిమాలయాలపై పెను ప్రభావం చూపిస్తుందని 2016లోనే శాసవ్రేత్తలు హెచ్చరించారు. హిమాలయాల్లో కంగారాలో 1905లో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్, బిహార్‌లో భూకంపానికి 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశిలో వచ్చిన భూకంపంలో 800 మంది మరణించారు. ఇక 2005లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంభవించిన భూకంపానికి 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు కాకుండా 2001లో గుజరాత్లో కచ్‌లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. భారత్, యూరోషియన్ ప్లేట్స్ తరచూ రాపిడి కారణంగా చిక్కుకుపోతూ ఉండడంతో హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలజీలో జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ వివరించారు. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరాఖండ్ : 12 మందిని కాపాడిన ఫోన్ కాల్
డెహ్రాడూన్: ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆకస్మికంగా సంభవించిన ఈ విలయంలో 170 మంది వరకు గల్లైంతైనట్లు సమాచారం. ఇంతటి విషాదంలో ఓ ఫోన్ కాల్ 12 మంది ప్రాణాలు కాపాడింది. వివరాలు... మంచు చరియలు విరిగిపడటంతో ఉప్పొంగిన ధౌలీనది ఉగ్ర రూపం దాల్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని చమేలి తపోవన్ పవర్ ప్రాజెక్ట్ వర్కర్లు 12 మంది ఓ అండర్‌గ్రౌండ్ టన్నెల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రమాదం గురించి.. బయటకు రావాల్సిందిగా తెలిపారు. ఇది విన్న వర్కర్లు టన్నెల్ నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. కానీ ఈ లోపే వరద నీరు టన్నెల్లోకి వచ్చింది. అంతేకాక వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రవేశ మార్గాన్ని బురద కప్పేసింది. టన్నెల్ నుంచి బయటపడే మార్గం లేకపోవడం.. బయట ఉన్న బురద వల్ల లోపల ఉన్న తమ గురించి అధికారులకు తెలిసే అవకాశం ఉండదని భావించిన ఆ 12 మంది వర్కర్లు జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు. అక్కడే సజీవ సమాధి తప్పదని భావించారు. అయితే వారికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని ఓ వ్యక్తి మొబైల్ నిరూపించింది. అతడి ఫోన్‌కి సిగ్నల్ అందడంతో వెంటనే కంపెనీకి కాల్ చేసి తమ పరిస్థితిని వివరించాడు. ఈ విషయాన్ని కంపెనీ జీఎం ఐటీబీపీ అధికారులకు చెప్పడంతో వారు టన్నెల్ వద్దకు చేరుకుని బురదను తొలగించి.. వర్కర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరందరిని ఐటీబీపీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘మేం 300 మీటర్ల లోతైన టన్నెల్లో ఉన్నాం. వరద నీటిలో చిక్కుకున్నాం. ఇక జీవితం మీద ఆశ వదిలేసుకున్నాం. ఈ సమయంలో టన్నెల్లో ఓ చోట వెలుతురు పడటం.. గాలి ఆడటం గమనించాం. ఎలాగోలా అక్కడకు చేరుకున్నాం. ఇంతలో మాలో ఒకరి ఫోన్‌కి సిగ్నల్ వచ్చింది. అధికారులకు కాల్ చేయడం.. వారు స్పందించి ఐటీబీపీ వారిని పంపిచడంతో బతికి బయటపడ్డాం. ఆ ఒక్క ఫోన్ కాల్ మా 12 మందిని కాపాడింది. మాకు సాయం చేసిన ఐటీబీపీ అధికారులకు జీవితాంతం రుణపడి ఉంటాం’’ అన్నారు. చదవండి: విషాదం: 170 మంది మరణించినట్లేనా? ప్రకృతి విపత్తులతో వణికిపోయిన దైవభూమి -
కరిగిన నీటితో కొండలు
చుట్టూ గడ్డి మొక్క కూడా లేదుగానీ... మధ్యలో భారీ మంచు పర్వతమా? ఎలాగబ్బా? ఫొటోలు చూడగానే చాలామందికి వచ్చే డౌట్లు ఇవే. ఎలా అన్న విషయాన్ని కాసేపు పక్కనపెడదాం. ఐస్స్తూపాలుగా పిలుస్తున్న ఈ మంచు పర్వతాల గురించి ముందు తెలుసుకుందాం. మనదేశానికి ఉత్తరాన మంచుకొండల కింద లడాఖ్ అనే ప్రాంతముందికదా... అక్కడిదీ ఈ మంచుస్తూపం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎడారి ప్రాంతంగా దీనికి పేరుంది. అయితే నిన్నమొన్నటి వరకూ పక్కనున్న మంచుకొండల్లోని హిమనదాలు (గ్లేషియర్స్) కరిగి లడాఖ్ ప్రాంతంలో ఉండేవారికి కొద్దోగొప్పో నీళ్లు అందించేవి. వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మరీ కనాకష్టంగా మారిపోయింది. ఈ చిక్కులకు చెక్‌పెట్టేందుకు సోనమ్ వాంగ్‌ఛుక్ అనే ఇంజనీరుకు తట్టిన ఐడియా వాస్తవ రూపమే ఈ మంచుస్తూపాలు. కరిగిపోతున్న హిమనదాల నీరు పల్లానికి వస్తుంది కదా.. అక్కడ కొన్ని పైపులను నిలువుగా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పైకి ఎగజిమ్మే నీరు... పరిసరాల్లో ఉండే మైనస్ 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ప్రభావంతో గడ్డకట్టిపోతుంది. చలి తగ్గి... ఎండలు పెరిగే వరకు ఇలాగే అక్కడే ఉండిపోయే నీరు ఆ తరువాత ప్రజల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతోంది. సోనమ్ వాంగ్‌ఛుక్ ఇప్పటికే ఇలాంటి మంచుస్తూపాలు కొన్నింటిని ఏర్పాటు చేయడమే కాకుండా... వాటి ఆధారంగా కొన్ని వేల మొక్కలను పెంచుతున్నారు కూడా. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని కొద్దిమేరకైనా పంటలు పండించుకునేందుకు, తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు ఇవి సాయపడతాయని, భవిష్యత్తులో కనీసం 50 వరకూ భారీ మంచుస్తూపాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు సోనమ్. ఇంకో విషయం...ఈ సోనమ్ వాంగ్‌ఛుక్ స్ఫూర్తితోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమాలో రంఛోడ్దాస్ శ్యామల్‌దాస్ ఛాంఛడ్ ఉరఫ్ రాంచో పాత్ర రూపుదిద్దుకుంది.