
ఈ అమ్మాయి పేరు పరమ్‌జీత్ కౌర్... వయసు 19 ఏళ్లు. ప్రత్యేకత.. పంజాబీ ర్యాపర్. తెర మీది ‘గల్లీ బాయ్’కు నిజ జీవిత ప్రతిబింబం! ఘనత.. స్పాటిఫై గ్లోబల్ 50 చార్ట్‌లో టాప్‌లో నిలిచి రికార్డ్స్ బ్రేక్ చేసింది. పంజాబ్ గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ ఖ్యాతి దాకా సాగిన ఆమె ర్యాప్ ప్రయాణం గురించి...
పరమ్‌గా సుపరిచితమైన ఈ రాప్ గాయని తన లేటెస్ట్ ట్రాక్ ‘దట్ గర్ల్’తో స్పాటిఫై గ్లోబల్ వైరల్ 50 చార్ట్‌లో నంబర్ వన్‌కి చేరి.. ఆ ఖ్యాతిని ఆర్జించిన ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. పంజాబ్, మోగా జిల్లాలోని డనేకే అనే పల్లెటూరుకు చెందిన పరమ్‌కి సంగీతం అంటే ణం. పాటలు పాడటమే కాదు రాయటమూ అంతే ఇష్టం. ఆమె తండ్రి తాపీ మేస్త్రీ. అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది.
పరమ్ తన నేపథ్యాన్నే ర్యాప్‌గా వినిపిస్తుంది. తాను ఎదుర్కొంటున్న సవాళ్లూ.. చేస్తున్న పోరాటాలూ.. చూపిస్తున్న ధైర్యసాహసాలకే శ్రుతిలయలు అద్దుతోంది. ఆ సహజత్వమే తన ట్రాక్స్‌కి లేబుల్‌గా మారి ఆమెను ఈ రోజు అంతర్జాతీయ సంగీత సంచలనంగా మలిచింది. అందులోనిదే లేటెస్ట్ ‘దట్ గర్ల్’ ట్రాక్ కూడా! ఈ పంజాబీ సంప్రదాయ జానపద స్వరాలు.. ఆధునిక హిప్–హాప్ బీట్స్‌ల మిశ్రమమే ఆమె సంగీత బాణి.
ఈ ప్రతిభ భాషనే కాదు భౌగోళిక హద్దులనూ చెరిపేసి ప్రపంచానికి వీనులవిందు చేస్తోంది. కళకు రాగాల మీటర్ కన్నా జీవితంలోని రానెస్సే మ్యాటర్ అని నిరూపిస్తోంది. ‘పంజాబ్‌లో చాలామంది మహిళా పాప్ గాయనులున్నారు. కాని పంజాబీ రాపర్స్ లేరు. అందుకే పరమ్‌జీత్.. అమె స్వరం రెండూ ప్రత్యేకమే.
గల్లీ బాయ్ స్పేస్‌లో ఉన్న ఒకే ఒక సింగర్ ఆమె’ అంటారు మ్యూజిక్ ఇండస్ట్రీలోని పెద్దలు. ‘నాకు నచ్చిన పని ఇది. నా కల, లక్ష్యం ఒకటే.. మంచి ఇల్లు కట్టుకోవాలి.. ఆ ఇంట్లో మా పేరెంట్స్ ఏ చింతా లేకుండా హాయిగా సేదతీరాలి’ అంటుంది పరమ్‌జీత్ కౌర్. (చదవండి: వయసు 82... వెనక్కి తగ్గేదే ల్యా..)