ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు.. | Record number of women IPS officers In Telangana | Sakshi
Sakshi News home page

ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..

Oct 19 2025 11:23 AM | Updated on Oct 19 2025 2:26 PM

Record number of women IPS officers In Telangana

దుష్ట ప్రవృత్తి గల నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేసే ఎందరో నరకాసురులకు సత్యభామలుగా మారిన పోలీసు ఆ‘షీ’సర్లు చెక్‌ చెప్తున్నారు. నేడు నరక చతుర్దశి సందర్భంగా మహిళా పోలీస్‌ అధికారుల ప్రాధాన్యం గురించి... 

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్‌పీఏ) తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారుల్లో 36 శాతం మహిళలే. ఎన్‌పీఏ చరిత్రలో ఇదో రికార్డు. 

దీనికిముందే ఇలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఐపీఎస్‌ అధికారుల బదిలీతో రాష్ట్ర పోలీసు విభాగంలోని హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌లో మకుటాలను 33.3 శాతం మహిళలే ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1979 వరకు మహిళా ఐపీఎస్‌లే లేరు. 

ఆ ఏడాది ఎన్‌పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న హైదరాబాదీ యువతి అరుణ బహుగుణ చిత్తూరు జిల్లా మదనపల్లె అదనపు ఎస్పీగా పోస్టింగ్‌ పొందారు. ఇది అప్పట్లో సంచలనం. ఆపై కాలక్రమంలో మహిళ ఐపీఎస్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ 2014 వరకు వీరికి సముచిత పోస్టింగ్స్‌ ఉండేవి కాదు. అత్యవసర సందర్భాల్లో అక్కరకు రావడానికి కమిషనరేట్‌కు ఒక మహిళ ఐపీఎస్‌కు పోస్టింగ్‌ ఇచ్చేవాళ్లు. మిగిలిన అధికారుల్ని అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించే వారు. రానురాను ఆ సీన్‌  పూర్తిగా మారిపోతూ వచ్చింది. 

పోలీసు విభాగంలో మహిళ ఐపీఎస్‌ అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోస్టింగ్స్‌ ఇవ్వడం అనివార్యంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళ భద్రత విభాగం, షీ–టీమ్స్‌ ఏర్పాటైన తర్వాత వీటిలో అనివార్యంగా మహిళ ఐపీఎస్‌లకే పోస్టింగ్‌ ఇస్తూ వచ్చారు. కమిషనరేట్లలో డీసీపీ పోస్టులతో పాటు కొన్ని జిల్లాలకు మహిళల్ని ఎస్పీలుగా నియమించారు. 

ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న మూడో వంతు హెచ్‌ఓడీ పోస్టులతో పాటు హైదరాబాద్, రాచకొండల్లోని డీసీపీ పోస్టుల్లో అత్యధికంగా మహిళా ఐపీఎస్‌లే ఉన్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడెమీకి అభిలాష్‌ బిస్త్, నేరగాళ్లలో మార్పునకు కృషి చేసే జైళ్లశాఖకు సౌమ్య మిశ్ర, 

రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చారు సిన్హా, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన బి.సుమతి, హోంగార్డ్స్‌ వింగ్‌కు స్వాతి లక్రా నేతృత్వం వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 15 హెచ్‌ఓడీ పోస్టుల్లో ఏడింటికి ఐదుగురు మహిళ ఐపీఎస్‌లు నేతృత్వం వహిస్తున్నట్లు లెక్క. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు శిఖా గోయల్‌ చీఫ్‌గా, అవినీతి నిరోధక శాఖకు చారు సిన్హా ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు ఉన్నత స్థాయిలో కూడా ఉండేవారు కారు. అయితే కాలక్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... 

నగరంలో హఠాత్తుగా తలెత్తే పరిణామాలతోపాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది. కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళ ఉన్నతాధికారి ఉండాలని  ప్రభుత్వమూ భావించినప్పటికీ చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్‌జోన్‌కు మాత్రమే మహిళ అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్‌కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసువింగ్‌లో మహిళ ఉన్నతాధికారి ΄ోస్టు ఇదొక్కటే అనే భావన కొనసాగింది.

ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌కు ఒక్కో డీసీపీ నేతృత్వం వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడు జోన్లలో మూడింటికి మహిళ ఐపీఎస్‌లే డీసీపీలుగా ఉన్నారు. మధ్య మండలానికి శిల్పవల్లి, ఉత్తర మండలానికి సాధన రష్మీ పెరుమాళ్, దక్షిణ మండలానికి స్నేహ మెహ్రా డీసీపీలుగా ఉన్నారు. 

వీరికి తోడు పరిమళ నూతన్, పరిపాలన విభాగం సంయుక్త సీపీగా, రక్షితమూర్తి, సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌ డీసీపీగా, అపూర్వ రావు– స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా, ఎన్‌ .శ్వేత డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీ గా, డి.కవిత,సైబర్‌ క్రైమ్‌ విభాగం డీసీపీగా, లావణ్య జాదవ్‌– ఉమెన్‌  సేఫ్టీ డీసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్‌లోని అత్యంత కీలకమైన మాదాపూర్‌ జోన్‌కు డీసీపీగా రితిరాజ్‌ వ్యవహరిస్తున్నారు. 

ఇక రాచకొండలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిలో మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, మహేశ్వరానికి పద్మజ రెడ్డి, అనురాధ, సునీత రెడ్డి డీసీపీలుగా ఉన్నారు. వీరిలో సునీత రెడ్డి మాత్రమే నాన్‌ ఐపీఎస్‌ అధికారి. ఈ జోనల్‌ డీసీపీలతోపాటు మహిళ భద్రత విభాగం, సైబర్‌ క్రైమ్‌ వింగ్స్‌లను ఆ‘షీ’సర్స్‌ నేతృత్వం వహిస్తున్నారు.
– శ్రీరంగం కామేష్, క్రైమ్‌ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement