సాహో...  సాగర ధీర | Indian Female Officers Made History in the Indian Armed Forces | Sakshi
Sakshi News home page

సాహో...  సాగర ధీర

Dec 4 2025 12:37 AM | Updated on Dec 4 2025 12:37 AM

Indian Female Officers Made History in the Indian Armed Forces

నేడు ఇండియన్‌ నేవి డే

సముద్రాన్ని జీవితంతో పోలుస్తారు తాత్వికులు. సముద్రంలో మౌనం ఉంటుంది. కల్లోలం ఉంటుంది. పడి లేచిన కెరటాలు ఉంటాయి. సవాళ్ల విషయంలో భారత నావికాదళం కూడా సముద్రంలాంటిదే. ఆ సవాళ్లను అధిగమించి భారత నావికా దళంలో వివిధ కీలక విభాగాల్లో తొలి మహిళలుగా చరిత్ర సృష్టించిన రోల్‌ మోడల్స్‌ గురించి...

భారత నావికా యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా కమాండర్‌గా ప్రేరణ దియోస్థలీ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన ప్రేరణ ‘జీసస్‌ అండ్‌ మేరీ కాన్వెంట్‌’ స్కూలులో చదువుకుంది. నేవీలో పనిచేయాలనే లక్ష్యానికి స్కూలు రోజుల్లోనే బీజం పడింది. సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో సైకాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన ప్రేరణ 2009లో నావికాదళంలో చేరింది. ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని ఆమె తమ్ముడు కూడా నావికా దళంలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రారంభ సమస్యలు ఎదుర్కొంది ప్రేరణ. 

గోవాలో తన మొదటి ఎన్‌సీసీ సెయిలింగ్‌ క్యాంప్‌లో సెయిల్‌ బోట్‌ మూడుసార్లు బోల్తా పడింది. అయినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. పట్టుదలతో సెయిలింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. ఒడిశాలోని చిల్కా సరస్సులో జరిగిన సెయిలింగ్‌ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరీర్‌ తొలిరోజుల్లో  సముద్ర నిఘా విమానంలో పరిశీలకురాలిగా శిక్షణ పొందింది. 2012లో చైనా వాణిజ్యనౌకపై సోమాలియ దొంగలు దాడికి దిగినప్పుడు, ఆ దాడిని తిప్పి కొడుతూ చేసిన ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ప్రేరణ భారత్‌ నేవీ విదేశ్‌ సేవాపతకాన్ని అందుకుంది.

నేవీలో తొలి మహిళా క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌
భారత నావికాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (క్యూఎఫ్‌ఐ)గా చరిత్ర సృషించింది కమాండర్‌ దివ్యశర్మ. డోర్నియర్‌ పైలట్‌లుగా పనిచేసిన మొదటి ముగ్గురు మహిళలలో న్యూ దిల్లీకి చెందిన దివ్యశర్మ ఒకరు. ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా అర్హత సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఫ్రంట్‌లైన్‌ కార్యకలాపాల కోసం నావికా ఏవియేటర్‌లకు శిక్షణ ఇవ్వడంలో ఇన్‌స్ట్రక్టర్‌లది కీలక పాత్ర.

గతంలో ఫిక్స్‌డ్‌–వింగ్‌ విమానాలను నడిపిన దివ్య ఇండియన్‌ నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌లలో పైలట్‌లకు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్‌ అందుకుంది. న్యూ దిల్లీలోని మాల్వియానగర్‌కు చెందిన దివ్య కెరీర్‌ తొలి రోజుల్లో నుంచే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తోంది. డోర్నియర్‌ ఆపరేషనల్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ (డీవోఎఫ్‌టీ) కోర్సులో అత్యత్తమ ప్రతిభ చూపింది. కెరీర్‌ ప్రారంభంలో  నైపుణ్యం, అంకితభావానికి గుర్తింపుగా ‘ఫస్ట్‌ ఇన్‌ ఫ్లయింగ్‌’ అవార్డ్‌ అందుకుంది.

నావికా దళంలో నారీశక్తి
భారత నావికాదళంలో ఒకప్పుడు మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. అయితే కాలక్రమంలో మహిళల శక్తిసామర్థాల్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి దారులు తెరిచింది ఇండియన్‌ నేవీ. ఒకప్పుడు మాండోవి, గోవా బ్రాంచ్‌లలో ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్‌... మొదలైన వాటిలో పరిమిత పాత్ర పోషించిన మహిళలు కీలకమైన విభాగాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నేవీలో పైలట్, ఫైటర్‌ పైలట్, క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా... ఎన్నో కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు.

 విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్‌లు, ప్రిగేట్‌... మొదలైన ఫ్రంట్‌లైన్‌ యుద్ధనౌకలలో మహిళలు విధులు నిర్వహించడం నావికాదళంలో మహిళల పాత్రకు సంబంధించి విప్లవాత్మక అభివృద్ధి. లింగసమానత్వానికి పెద్ద పీట వేయడంలో భారత నావికాదళం ముందు వరుసలో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం భారత నావికాదళం మహిళా అధికారులకు (వైద్యేతర శాఖలు) మెరిట్‌ ఆధారంగా పర్మినెంట్‌ కమిషన్‌ మంజూరు చేసింది.

తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌
భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించింది ఆస్తా పూనియా. ‘మహిళా ఫైటర్‌ పైలట్‌తో భారత నౌకాదళంలో కొత్త శకం మొదలైంది’ అన్నారు అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ రియర్‌ అడ్మిరల్‌ జనక్‌ బెల్వీ. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఆఫ్‌ గోల్డ్‌’ పురస్కారాన్ని అందుకుంది ఆస్తా పూనియా. నాన్‌–ఫైటర్‌ ఆపరేషన్‌లలో మహిళా అధికారులు ఉన్నప్పటికీ ఫైటర్‌ స్ట్రీమ్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరర్‌కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్‌ చేసింది. ఎన్నో పరిమితుల కారణంగా నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించింది. ఎంతోమంది యువతులకు రోల్‌మోడల్‌గా నిలిచింది.

తొలి మహిళా పైలట్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లోని తిల్హార్‌కు చెందిన శుభాంగి స్వరూప్‌ భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది. 2017లో కన్నూర్‌లోని ‘ఇండియన్‌ నేవల్‌ అకాడమీ’ నుంచి పట్టభద్రురాలైన మొదటి బ్యాచ్‌ మహిళా అధికారులలో శుభాంగి ఒకరు. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందింది. నావికా దళంలో పనిచేసిన తండ్రి కమాండర్‌ జ్ఞాన్‌స్వరూప్‌ శుభాంగికి స్ఫూర్తి.
‘నేవీలో పనిచేయడం అంటే మాటలు కాదు. తట్టుకుంటావా?’ అని తండ్రి అడిగినప్పుడు ‘యస్‌’ అని చెప్పింది శుభాంగి. ఆమె నేషనల్‌ తైక్వాండో ఛాంపియన్‌ కూడా.

ఆమె అమరత్వం
వృత్తి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత వైమానిక దళంలోని తొలి మహిళా అధికారి కిరణ్‌ షెఖావత్‌. అబ్జర్వర్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్‌ 2015 మార్చి 24న గోవా తీరంలో జరిగిన డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదంలో చనిపోయింది. ముంబైలో పుట్టిన కిరణ్‌ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిజిక్స్‌లో పట్టా పుచ్చుకుంది. ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ)లో చేరడానికి ముందు ఒక ప్రైవేట్‌బ్యాంకులో పనిచేసింది. 

తన ఐదు సంవత్సరాల కెరీర్‌లో దేశంలోని వివిధ నౌకాదళ స్టేషన్‌లలో విధులు నిర్వహించింది. నేవీలోకి రావాలనుకోవడానికి తండ్రి స్ఫూర్తి. ఆయన నేవీ ఆఫీసర్‌. రచయిత నికోలస్‌ స్పార్క్‌కు కిరణ్‌ పెద్ద అభిమాని. అతడి అన్నిపుస్తకాలు చదివింది. ఆ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలు చూసింది. కుమార్తె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద ‘లెఫ్టినెంట్‌ కిరణ్‌ షెఖావత్‌’ ఫౌండేషన్‌ స్థాపించాడు తండ్రి. హరియాణాలోని కుర్తాలలో కిరణ్‌ షెఖావత్‌ గౌరవార్థం రెండు ఎకరాల భూమిని షహీద్‌ పార్క్‌గా అభివృద్ధి చేశారు. ఈ పార్క్‌లో కిరణ్‌ విగ్రహం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement