పోషకాహారం
ఈ రోజుల్లో మహిళల రుతుక్రమంలో సమస్యలు తలెత్తడం ఎక్కువ కనిపిస్తోంది.. హార్మోన్ల హెచ్చుతగ్గులు వీటికి ప్రధాన కారణంగా ఉంటుంటాయి. ఈ సమస్యను సరిదిద్దడానికి మన ప్రాంతీయ సంప్రదాయ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. సమతుల ఆహారంతో పాటు సీడ్ సైక్లింగ్ థెరపీ పీసీఓఎస్ సమస్యలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.
30 నుంచి 50 ఏళ్లు పైబడిన మహిళలు ... పీసీఓఎస్, థైరాయిడ్, మెనోపాజ్ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు రోజువారీ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది.
→ మెటబాలిజంను బ్యాలెన్స్ చేసే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీలను ఆహారంలో చేర్చాలి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లను వృద్ధి చేస్తాయి. క్యాన్సర్ కారక రిస్క్‌ను కూడా తగ్గిస్తాయి.
→ సాల్మన్ ఫిష్, చియా, అవిశ గింజలలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. చియా, అవిశ గింజలను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవచ్చు. చియా సీడ్స్ మజ్జిగ, నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు.
→ హోల్ గ్రెయిన్స్‌లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కూరగాయలు, శనగలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను సమం చేస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ సరిగ్గా పనిచేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి.
→ పప్పులు, శనగలు, బొబ్బర్లు.. వంటి వాటిలో బి12 ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో బి12 లోపం చాలా మందిలో కనిపిస్తుంది. ఈ పప్పులను చేర్చడం వల్ల బి12తో పాటు హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. పప్పులను ఉడికించి రోజూ ఒక కప్పు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
→ బాదంపప్పు, వాల్ నట్స్‌లలో మెగ్నిషియం లభిస్తుంది. నట్స్ అండ్ సీడ్స్ రోజూ మూడు నెలల పాటు రోజూ తీసుకుంటే హార్మోన్ల హెచ్చుతగ్గులు బ్యాలెన్స్ అవుతాయి.
→ గట్ హెల్త్‌ని సపోర్ట్ చేసే పెరుగు, యోగర్ట్, మజ్జిగ.. వంటివి ఆహారంలో చేర్చాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం తగ్గడం సమస్య కూడా ఉంటుంది. థైరాయిడ్, హార్మోన్లకు సపోర్ట్ చేసే ఎగ్ లేదా టోఫూ వంటివి ఉపయోగించాలి.
→ కల్తీ నూనెలు కాకుండా ఫ్లాక్స్ సీడ్, అవకాడో, ఆలివ్ ఆయిల్స్, స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. ఆకుకూరలు, చిలకడ దుంప, నట్స్ .. మెగ్నిషియం ఉండే పదార్థాలను చేర్చుకుంటే పిఎమ్‌ఎస్ లక్షణాలు తగ్గుతాయి.
గింజలను పొడులు చేసి, నేరుగా తీసుకోవచ్చు. లేదంటే పెరుగు, ఓట్స్‌లో కలుపుకోవడం ద్వారా లేదంటే చిన్న చిన్న లడ్డూలు కట్టి కూడా తీసుకోవచ్చు. ఇతర జంక్‌ఫుడ్ తిని సీడ్ సైక్లింగ్ పాటించడం వల్ల ఉపయోగం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సీడ్ సైక్లింగ్ పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ, రోజువారి జీవనశైలి బాగుండేలా చేసుకుంటే ఇవి సాయపడతాయి. ప్రభావం వెంటనే కనిపించలేదు అనుకోకుండా 2–3 నెలల పాటు ప్రతిరోజూ వాడితే మంచి ఫలితాలు వస్తాయి.
నిల్వ ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా మన సంప్రదాయ ఆహారం ద్వారానే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. నెలసరి సమస్యలు దరిచేరవు.
సీడ్ సైక్లింగ్
పీసీఓఎస్ ఫేజెస్‌ను బట్టి సీడ్ సైక్లింగ్ విధానం ఎంతో మేలు చేస్తుంది. హార్మోన్ల సపోర్ట్ కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. రుతుక్రమం సరిగా రాని వాళ్లకు ఈ విధానాన్ని ఆవలంబించమని నిపుణులు చెబుతుంటారు. సీడ్ సైక్లింగ్ మెథడ్‌ను రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి తిరిగి రుతుక్రమం ప్రారంభమయ్యే రోజు వరకు పాటించాలి.
పారిక్యులర్ ఫేజ్
ఇది సీడ్ సైక్లింగ్‌లో మొదటి ఫేజ్. రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి 14వ రోజు వరకు ఒక దశ. దీనిలో గుమ్మడి గింజల పొడి 1–2 టీ స్పూన్లు, అవిశ గింజల పొడి 1–2 టీ స్పూన్లు రోజూ తీసుకోవాలి. దీనివల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల పనితీరు బాగుంటుంది. నెలసరి సమస్యలు తగ్గుతాయి.
లూటియల్ ఫేజ్
రుతుక్రమం ఆగిపోయిన 15వ రోజు నుంచి 28వ రోజు వరకు సన్‌ఫ్లవర్ గింజలు, నువ్వులు ఉపయోగించాలి. సన్‌ఫ్లవర్, నువ్వులలో విటమిన్–ఇ ఉంటుంది కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే క్రాంప్స్, యాక్నె, నొప్పి, మూడ్ స్వింగ్స్ .. వంటివి కూడా తగ్గుతాయి. మెనోపాజ్, థైరాయిడ్ సమస్యలకు ఈ విధానం సరైన పరిష్కారం.
డా. సుజాతా స్టీఫెన్, న్యూట్రిషియనిస్ట్


