- నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీ
- ముంబై, వడోదరలలో మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 5న ఫైనల్
- తొలి పోరులో ముంబైతో బెంగళూరు ‘ఢీ’
- రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించారు. ముంబై రెండుసార్లు, బెంగళూరు ఒకసారి విజేతగా నిలిచాయి. అయితే గతానికి, 2026 సీజన్‌కు ప్రధాన తేడా ప్లేయర్ల ‘గుర్తింపు’. టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తర్వాత జరుగుతున్న తొలి డబ్ల్యూపీఎల్ ఇదే కావడంతో అన్ని వైపుల నుంచి సహజంగానే అదనపు ఆసక్తి పెరిగింది. టోర్నీ మొదలైనప్పుడు మహిళా క్రికెటర్ల గురించి ఒక పరిచయ కార్యక్రమంలాగా ప్రచారం సాగింది.
కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు! నాడు ఉచితంగా అభిమానులను అనుమతించగా, తక్కువే అయినా ఇప్పుడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు టికెట్ ఉండటం లీగ్ స్థాయి పెరిగిందనేందుకు సంకేతం. ఐపీఎల్ తరహాలోనే వేలం, ప్రతిభాన్వేషణ, ప్రత్యేకంగా టీమ్ స్పాన్సర్లతో లీగ్ ఇప్పుడు స్వతంత్రంగా నిలబడింది. ఈ నేపథ్యంలో లీగ్ నాలుగో సీజన్ వచ్చేసింది. ఐదు జట్ల మధ్య జరిగే సమరంలో తుది విజేత ఎవరో 22 మ్యాచ్‌ల తర్వాత తేలనుంది.
ముంబై: హర్మన్‌ప్రీత్ బృందం ముచ్చటగా మూడోసారి టైటిల్ సాధిస్తుందా? భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన టీమ్‌ను రెండోసారి విజేతగా నిలుపుతుందా? లేక కెపె్టన్‌గా కొత్త పాత్రలో మరో టాప్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తన జట్టుకు తొలిసారి టైటిల్ అందిస్తుందా? ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరోసారి ప్రపంచ మహిళా క్రికెటర్ల ప్రదర్శన చూసేందుకు సమయం ఆసన్నమైంది. నేడు ప్రారంభం కానున్న నాలుగో సీజన్ ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నమెంట్‌ను ఈసారి రెండు మైదానాలకే పరిమితం చేశారు.
ఫ్రాంచైజీలు ఐపీఎల్ తరహాలో సొంత, ప్రత్యర్థి వేదికలపై మ్యాచ్‌లు ఆడాలని ఆశించినా... ప్రధాన వేదికలన్నీ టి20 వరల్డ్ కప్, రంజీ ట్రోఫీల కోసం కేటాయించడంతో బీసీసీఐ దానికి అనుమతించలేదు. రెండు తొలి 11 మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కాగా, తర్వాతి 11 మ్యాచ్‌లు వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. తొలి మూడు సీజన్ల పాటు డబ్ల్యూపీఎల్ ఫిబ్రవరి–మార్చిలలో జరిగినా ... కొత్త ఎఫ్‌టీపీలో డబ్ల్యూపీఎల్, ఉమెన్ బిగ్‌బా‹Ù, హండ్రెడ్ టోరీ్నలకు ప్రత్యేకంగా తేదీలను కేటాయించారు. ఇకపై జనవరి–ఫిబ్రవరిలోనే ఈ లీగ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ‘డబుల్ హెడర్’లు ఉండబోతున్నాయి. జనవరి 10, 17 తేదీల్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.
కొత్త కోచ్‌లతో...
లీగ్‌లో ఎప్పటిలాగే ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా... హర్మన్, స్మృతి, జెమీమాతో పాటు మెగ్ లానింగ్, యాష్లీ గార్డ్‌నర్ మరో రెండు జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు జెమీమా రూపంలో కొత్త కెప్టెన్ వచ్చింది. గత సీజన్ వరకు ఢిల్లీకి సారథిగా ఉన్న మెగ్ లానింగ్ ఈ ఏడాది యూపీ వారియర్స్ కెపె్టన్‌గా బరిలోకి దిగుతోంది. లానింగ్ నాయకత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సీజన్లలో కూడా ఫైనల్‌కు చేరింది.
దురదృష్టవశాత్తూ మూడుసార్లు ఆ జట్టు రన్నరప్‌గానే నిలిచింది. ఈ సీజన్ కోసం మూడు జట్లు కొత్త కోచ్‌లను ఎంచుకున్నాయి. ముంబై కోచ్‌గా చార్లెట్ ఎడ్వర్డ్స్ స్థానంలో లిసా కీట్లీ, ఆర్‌సీబీ కోచ్‌గా ల్యూక్ విలియమ్స్ స్థానంలో మలోలన్ రంగరాజన్, యూపీ కోచ్‌గా జాన్ లూయిస్ స్థానంలో అభిషేక్ నాయర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఎలీస్ పెరీ, అనాబెల్ టోర్నీ నుంచి తప్పుకోగా... గుర్తింపు ఉన్న ప్లేయర్లలో అలీసా హీలీ, చమరి అటపట్టు, హీతర్ నైట్‌లను వేలంలో ఎవరూ ఎంచుకోలేదు.
ఎవరి సత్తా ఎంత?
లీగ్‌లో ఐదు జట్ల బలాబలాలను చూస్తే ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే పటిష్టంగా కనిపిస్తోంది. మూడో సారి టైటిల్ గెలవకుండా జట్టును నిలువరించడం అంత సులువు కాదు. హర్మన్‌ప్రీత్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్, బ్రంట్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్‌లతో బలంగా ఉంది. తాజా సంచలనం కమలినిని కూడా టీమ్ ఎంచుకుంది. స్మృతి నాయకత్వంలో బెంగళూరు రెండో ట్రోఫీపై గురి పెట్టింది. అయితే టీమ్‌లో బెస్ట్ ప్లేయర్ ఎలీస్ పెరీ ఈ సీజన్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆమె లేని లోటును ఆర్‌సీబీ పూరించాల్సి ఉంది.
స్మృతి ఎప్పటిలాగే ముందుండి నడిపించనుండగా... రిచా ఘోష్, పూజ వస్త్రకర్, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. ఇటీవల వరల్డ్ కప్‌లో చెలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ ఇదే టీమ్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధానంగా టాపార్డర్‌పై ఆధారపడుతోంది. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా కెపె్టన్ లారా వోల్‌వార్ట్, షఫాలీ వర్మ, జెమీమా, మరిజాన్ కాప్ టాప్–4లో కీలకం. బౌలింగ్‌లో నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్ రాణావంటి స్పిన్నర్లు ఉన్నా జట్టు పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది.
గత రెండు సీజన్లలో కలిపి 16 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లో గెలిచి 2025లో చివరి స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్ ఈసారి తమ అదృష్టం మారుతుందని భావిస్తోంది. వరల్డ్ కప్ స్టార్ దీప్తి శర్మపై మరోసారి పెద్ద భారం ఉండగా... మెగ్ లానింగ్ కెపె్టన్సీ, నాయర్ కోచింగ్‌ను జట్టు నమ్ముకుంది. ధాటిగా ఆడే కిరణ్ నవ్‌గిరే, వరల్డ్ కప్ సభ్యురాలు హర్లీన్ డియోల్, లిచ్‌ఫోల్డ్ ఇతర కీలక ప్లేయర్లు. పేసర్లు క్రాంతి గౌడ్, శిఖా పాండేలతో స్పిన్నర్ ఎకెల్‌స్టోన్‌లపై బౌలింగ్ భారం ఉంది. వేలంలో సోఫీ డివైన్, రేణుకా సింగ్, డానీ వ్యాట్‌లను తీసుకొని గుజరాత్ జెయింట్స్ తమ జట్టును కాస్త పటిష్టంగా మార్చుకుంది. గార్డ్‌నర్, బెత్ మూనీ, వేర్‌హామ్ టీమ్ ప్రధాన బలం. యువ ఆటగాళ్ళలో టిటాస్ సాధు, కాశ్వీ గౌతమ్, తనూజ కన్వర్ రాణించడం ముఖ్యం.
ఈసారి డబ్ల్యూపీఎల్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లపురెడ్డి శ్రీచరణి (ఢిల్లీ), తెలంగాణ నుంచి అరుంధతి రెడ్డి (బెంగళూరు), గొంగడి త్రిష (యూపీ), మమత మదివాలా (ఢిల్లీ), నల్లా క్రాంతి రెడ్డి (ముంబై) పోటీపడనున్నారు.


