ఆస్ట్రేలియా చేతిలో భార‌త్ ఓట‌మి | Australia Women beat India Women by six wickets | Sakshi
Sakshi News home page

IND-W vs AUS-W: తేలిపోయిన బ్యాట‌ర్లు.. ఆస్ట్రేలియా చేతిలో భార‌త్ ఓట‌మి

Feb 24 2026 4:39 PM | Updated on Feb 24 2026 5:05 PM

Australia Women beat India Women by six wickets

ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేల సిరీస్‌ను భార‌త మ‌హిళ‌ల జట్టు ఓట‌మితో ఆరంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో 6 వికెట్ల తేడాతో భార‌త్ ప‌రాజ‌యం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ‌ర్మ‌న్ సేన 48.3 ఓవ‌ర్ల‌లో 214 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. స్టార్ బ్యాట‌ర్లు ప్రతిక రావల్ (0), షెఫాలీ వ‌ర్మ‌(4) వ‌రుస బంతుల్లో పెవిలియ‌న్‌కు చేరారు. అయితే స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (53) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. 

ఆ త‌ర్వాత భార‌త్‌ మ‌ళ్లీ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కును దాట‌గలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్ గార్డనర్ 3 వికెట్లతో రాణించ‌గా.. మేఘాన్ షాట్, అలానా కింగ్‌, మెక్‌గ్రాత్ త‌లా వికెట్ సాధించారు.

215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 38.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ఓపెన‌ర్లు అలిస్సా హీలీ (50), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (32) అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చారు.  అనంతరం బెత్ మూనీ (76 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు, దీప్తీ శ‌ర్మ‌, క్రాంతి గౌడ్ త‌లా వికెట్ సాధించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement