ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ మనదే | IND W vs AUS W 3rd T20I: India Beat Australia Won Series | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ మనదే

Feb 21 2026 5:23 PM | Updated on Feb 21 2026 5:33 PM

IND W vs AUS W 3rd T20I: India Beat Australia Won Series

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత మహిళా క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పదిహేడు పరుగుల తేడాతో ఓడించి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. 

కాగా మూడు టీ20, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడేందుకు భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో తొలి టీ20లో గెలుపొందిన భారత్‌.. రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.

స్మృతి మంధాన ధనాధన్‌
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 జరిగింది. అడిలైడ్‌ వేదికగా టాస్‌ గెలిచిన హర్మన్‌ సేన.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో స్మృతి మంధాన 55 బంతుల్లో 82 పరుగులతో ఇరగదీయగా.. షఫాలి వర్మ (7) విఫలమైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అర్ధ శతకం (59)తో సత్తా చాటగా రిచా ఘోష్‌ 18 పరుగులు చేసింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2 పరుగులతో అజేయంగా నిలవగా.. అమన్‌జోత్‌ కౌర్‌ (1), దీప్తి శర్మ (1) రనౌట్‌ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 176 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ రెండు వికెట్లు తీయగా.. కిమ్‌ గార్త్‌, కెప్టెన్‌ సోఫీ మొలినెక్స్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

చెలరేగిన శ్రేయాంక, శ్రీచరణి
ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఓపెనర్లు జార్జియా వోల్‌ (10), బెత్‌ మూనీ (6) సహా ఎలిస్‌ పెర్రీ (1) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోబే లిచిఫీల్డ్‌ (26) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆష్లే గార్డ్‌నర్‌ హాఫ్‌ సెంచరీ (57) చేసింది. కానీ మిగిలిన వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.

భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలా మూడు వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. అరుంధతి రెడ్డి రెండు, రేణుకా సింగ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. స్మృతి మంధానకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement