టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.
కాగా వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లను గెలిచాయి భారత్, సౌతాఫ్రికా.
ప్రతికూల అంశాలు ఇవే
అయితే, గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్‌లతో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది.
వాళ్ల గురించే నా బాధంతా!
ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.
అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్ పాండ్యా టాప్‌నకు ప్రమోట్ అవుతారు.
సమస్య లేదు
నాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు.
మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్‌ప్లాన్ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.


